ప్రముఖులను మింగిన AIR CRASHES

ABN , First Publish Date - 2021-12-09T01:38:10+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారంనాడు జరిగిన ఐఏఎఫ్..

ప్రముఖులను మింగిన AIR CRASHES

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారంనాడు జరిగిన ఐఏఎఫ్ ఎంఐ-17హెచ్‌పీ హెలికాప్టర్ ప్రమాదంలో తన భార్య, మరో 12 మందితో సహా ప్రాణాలు కోల్పోయారు. 14 మందితో వెళ్తున్న హెలికాప్టర్ తమిళనాడు సమీపంలోని కూనురు సమీపంలో కుప్పకూలిన దుర్ఘటన దేశ ప్రజలను విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో గ్రూప్ కెప్టన్ వరుణ్ సింగ్ (డీఎస్ఎస్‌సీ డెరెక్టింగ్ స్టాఫ్) ఒక్కరే తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ (తమిళనాడు)లోని మిలటరీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.గతంలోనూ ఎయిర్స్ క్రాష్‌తో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి.


ఎయిర్ క్రాష్ ఘట్టాలు...

1. ఎయిర్ క్రాష్ ఘటనల్లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఘటన ప్రధానంగా గుర్తుండిపోతుంది. ఆయన ప్రయాణిస్తున్న విమానం 1945లో తైవాన్‌లో కుప్పకూలింది. సుభాష్ చంద్రబోస్ ఆచూకీ అప్పట్నించీ ఇప్పటి వరకూ మిస్టరీగానే మిగిలింది.

2. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ 2009లో చిత్తూరు జిల్లాలో కుప్పకూలింది. అడవుల్లో కుప్పకూలడంతో ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి 27 గంటలు పట్టింది.

3. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ ప్రయాణిస్తున్న గ్లైడర్ 1980లో కుప్పకూలి ఆయన కున్నుమూశారు.

4.కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్ రావ్ సింథియా 2001లో కాన్పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఎయిర్‌క్రాఫ్ క్రాష్‌లో కన్నుమూశారు.

5. లోక్‌సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం నేత జీఎంసీ బాలయోగి సైతం 2002లో ఆంధ్రప్రదేశ్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

6. 2005లో అప్పటి హర్యానా విద్యుత్ శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఓపీ జిందాల్, ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సురేంద్ర సింగ్‌లు 2005లో షహరాన్‌పూర్‌లో సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ కుప్పకూలడంతో మృతి చెందారు.

7. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యత ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో సూపర్ కింగ్ ఎయిర్‌ క్రాఫ్ట్ ఒకటి 1994లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న పంజాబ్ గవర్నర్ సురేంద్ర నాథ్, ఆయన కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కన్నుమూశారు. సురేంద్ర నాథ్ అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ యాక్టింగ్ గవర్నర్‌గా కూడా ఉన్నారు.

8.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. విమానం కనిపించకుండా పోయిన ఐదు రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని చైనా సరిహద్దుల్లో కనుగొన్నారు.

Updated Date - 2021-12-09T01:38:10+05:30 IST