మద్య నిషేధం మిథ్యేనా!

ABN , First Publish Date - 2021-08-06T05:39:54+05:30 IST

‘రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలుచేస్తాం. ఏడాదికి ఇరవై శాతం చొప్పున దుకాణాలను మూసివేస్తాం.

మద్య నిషేధం మిథ్యేనా!

ఏడాదికి 20 శాతం దుకాణాలను మూసివేస్తామన్న వైసీపీ ప్రభుత్వం

ఈ ఏడాది జిల్లాలో కొత్తగా 20 దుకాణాలు ప్రారంభం

తాగండి...ఊగండి

టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ పేరిట ఏర్పాటు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలుచేస్తాం. ఏడాదికి ఇరవై శాతం చొప్పున దుకాణాలను మూసివేస్తాం. ఐదేళ్లలో మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అఽధికారంలోకి వచ్చిన తరువాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్ల పేరుతో కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మొదటి ఏడాది విక్రయాలు బాగా తక్కువగా వున్న మద్యం దుకాణాలను గుర్తించి మూసివేయాలని ఆదేశించింది. ఇలా గత రెండేళ్లలో విక్రయాలు అంతగా లేని 140 వరకూ దుకాణాలను మూసివేసింది. మద్య నిషేధంలో భాగంగానే దుకాణాల సంఖ్యను తగ్గిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మూడో ఏడాదిలోకి అడుగుపెట్టేయడంతో మరికొన్ని దుకాణాలను మూసివేయాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యంపై ఆదాయం తగ్గితే కష్టమనే ఉద్దేశంతో ఆ ఆలోచనను పక్కనపెట్టేసింది. పైగా...మద్యంపై ఆదాయం పెంచుకునేందుకు  ప్రభుత్వం కొత్తవ్యూహానికి తెరదీసింది. పర్యాటకానికి ప్రోత్సాహం అంటూ టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్ల పేరుతో కొత్తగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేస్తోంది. ఆ సెంటర్లకు మద్యం అబ్కారీ శాఖ  సరఫరా చేసినప్పటికీ నిర్వహణ మాత్రం పర్యాటక శాఖకు అప్పగించింది. మద్యం విక్రయాలకు అవకాశం ఎక్కువగా వుండే ప్రాంతాలను గుర్తించి మరీ ఈ సెంటర్లను తెరుస్తున్నారు. ఇప్పటికే అప్పుఘర్‌ వద్ద ఒకటి ఏర్పాటుచేయగా, సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో మరొకటి ప్రారంభానికి సిద్ధంచేశారు. రూరల్‌లో అనంతగిరి, అరకులోయల్లో ఈ సెంటర్లను దుకాణాలను ప్రారంభించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 20 వరకూ మద్యం దుకాణాలను కొత్తగా ఏర్పాటుచేసే అవకాశం వున్నదని అధికారులు పేర్కొంటున్నారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు దుకాణాలను పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 266 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవికాకుండా 110 బార్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ నెలకు సగటున రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. 

Updated Date - 2021-08-06T05:39:54+05:30 IST