నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-02-24T06:12:26+05:30 IST

గత కొద్ది రోజుల నుంచి చెరువులు, చారిత్రక కోటలు, బురుజుల పరిధిలోని భూముల ఆక్రమణతో పాటు పార్కులు, పిన్కింగ్‌ స్థలాలు, ప్లే గ్రౌండ్‌ల కోసం కేటాయించిన భూములను ఆక్రమించడం, అలాగే ఆ స్థలాల్లో భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ లాంటివి నిర్మించడం యథేచ్ఛగా జరుగుతోన్న సంగతి తెలిసిందే

నిషేధాస్త్రం
భూములను సర్వే చేస్తున్న సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు

జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి మరోసారి చిక్కులు 

ఆక్రమిత సర్వే నెంబర్‌ల రిజిస్ట్రేషన్‌లకు బ్రేక్‌  

నిర్మల్‌ పట్టణ శివారు, మండలంలోని కొన్ని భూములపై కఠిన ఆంక్షలు 

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు 

దాదాపు 40కి పైగా సర్వే నంబర్‌ భూములకు కష్టకాలం 

హైకోర్టు సీరియస్‌ ఆదేశాలతో దుమారం 

నిర్మల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : గత కొద్ది రోజుల నుంచి చెరువులు, చారిత్రక కోటలు, బురుజుల పరిధిలోని భూముల ఆక్రమణతో పాటు పార్కులు, పిన్కింగ్‌ స్థలాలు, ప్లే గ్రౌండ్‌ల కోసం కేటాయించిన భూములను ఆక్రమించడం, అలాగే ఆ స్థలాల్లో భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ లాంటివి నిర్మించడం యథేచ్ఛగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూముల ఆక్రమణపై నిర్మల్‌కు చెందిన ఓ హైకోర్టు న్యాయవాది రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించి ఆ భూములన్నింటినీ నిషేధ జాబితాలో చేర్చిన వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ భూముల్లో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లను ఏర్పాటు చేసి అడ్డగోలుగా ప్లాట్లను విక్రయించేశారు. దీంతో పాటు 422 సర్వేనంబర్‌లో ఏకంగా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సైతం నిర్మిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ఈ సర్వేనంబర్‌ భూమిని కూడా నిషేధం పరిధిలోకి చేర్చడంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న భవన నిర్మాణానికి ఆటంకాలే ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోగా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఇక ముందు ఆ పనులు కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది చెరువులు, కోటలు, బురుజుల స్థలాలను ఆక్రమించి వాటికి ఆక్రమ పట్టాలు సైతం సృష్టించుకొని కబ్జాలకు పాల్పడినట్లు ఫిర్యాధులున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కొంతమంది బడాబాబులు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లలో లే అవుట్‌ పేరిట పార్కులు, ప్లే గ్రౌండ్‌, కమ్యూనిటీ భవనాలు తదితర వాటి కోసం స్థలాలను వదిలిపెట్టారు. అయితే భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ బడాబాబులు ఆ స్థలాల్లో కూడా మళ్లీ ప్లాట్లను ఏర్పాటు చేసి దర్జాగా అమ్ముకుంటు,న్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దాదాపు 40కి పైగా సర్వేనంబర్‌లను సూచిస్తూ ఆ సర్వే నంబర్‌ భూములకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లను జరపరాదని, రిజిస్ర్టేషన్‌లపై పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేయాలంటూ హైకోర్టు సంబంధిత సబ్‌రిజిస్ర్టార్‌లను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సబ్‌రిజిస్ర్టార్‌ అధికారులు ఆ సర్వే నంబర్‌ భూములను తా త్కాలికంగా నిషేధిత జాబితాలో చేర్చారు. దీని కారణంగా కొద్ది రోజుల నుంచి ఈ సర్వే నంబర్‌లలో రిజిస్ర్టేషన్‌లు, క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో ఆ భూముల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన సాధారణ ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

కోర్టు హెచ్చరించే దాక ఆగని ఆక్రమణలు

గత కొంతకాలం నుంచి నిర్మల్‌ జిల్లాలో భూ కబ్జాలు పెద్దఎత్తున జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్లనట్లుగా వ్యవహరించలేదన్న ఆరోపణలున్నాయి. కబ్జా ల వెనక రాజకీయ ప్రముఖుల బినామీల హస్తం ఉండ డం వారికి అధికారులు వంత పాడడంతో కబ్జాలపర్వం హద్దులు దాటిపోయింది. ముఖ్యంగా జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పో యింది. ఇక్కడి భూముల ధరలు ఒక్కసారి ఆకాశాన్నం టాయి. ఎకరంభూమి ధర రూ.కోటి నుంచి రూ. 5 కోట్లు పలుకుతుండడం ఇక్కడి భూముల డిమాండ్‌ను వెల్లడిస్తోంది. అయితే పలుకుబడి గల వ్యక్తులు కొంతమంది రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఏకంగా చెరువులు, బురుజులు, కోటలకు సంబందించిన భూముల రికార్డులను తారుమారు చేశారన్న ఫిర్యాదులున్నాయి. బినామీల పేరిట రికార్డులను తయారు చేసిన ఈ బడాబాబులు ఆ భూముల్లో భారీ ఎత్తున వెంఛర్‌లను ఏర్పా టు చేయడం, అందులో అడ్డగోలుగా ప్లాట్లను అమ్మేయ డం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా రాజకీయ నేతలకు అధికారులు అండగా నిలవడంతో ఈ కబ్జాకహానీకి అంతులేకుండా పోయింది. అయితే ఈ క్రమంలో నిర్మల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది హైకోర్టులో ఈ ఆక్రమణలపై పిటిషన్‌ వేయడం, కోర్టు దీనిపై సీరియస్‌గా విచారణ జరిగి చర్యలు చేపట్టాలంటూ ఆదేశించడంతో ఒక్కసారిగా దుమా రం మొదలైంది. హైకోర్టు హెచ్చరికతో నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం సైతం కుదుపుకు గురైంది. 

నిషేధిత సర్వేనంబర్‌ భూముల వివరాలు

కాగా నిర్మల్‌ అర్బన్‌ శివారు, నిర్మల్‌ అర్బన్‌ మండల్‌ పరిధిలోని  అక్రమ నిర్మాణాలు, అలాగే అక్రమవెంచర్‌లు వెలిసిన సర్వేనంబర్‌లపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది.  సర్వేనంబర్‌ 418,419,422,439,456,457,458,459, 485,486,487,531,532,533,536,535,537,538,539 సర్వే నంబర్‌ల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశారు. దీంతో పాటు చారిత్రకకోటలు, బురుజులు, చెరువులు తదితర లాంటి వాటి పరిధిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని అలాగే ఆక్రమిత భూ ములను స్వాధీనం చేసుకొని ఆ భూములకు రిజిస్ర్టేషన్‌లు జరగకుండా చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించింది. సర్వే నంబర్‌లు 404 నుంచి 411, 412, 419,420,421, 439, 456, 456, 457, 458, 459, 463, 466,467,468,469,470,476,477,478,479,485,486,487,488,489,490 నుంచి 539 సర్వే నంబర్‌ గల భూములకు సంబంధించి రిజిస్ర్టేషన్‌లపై ఇక నుంచి నిషేధం కొనసాగనుంది. 

సంక్షోభంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణం

కాగా మొదటి నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటున్న కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి మళ్లీ చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌ భవనం నిర్మిస్తున్న 422 సర్వేనంబర్‌పై కూడా ఆంక్షలు విధించడంతో నిర్మాణ పనులపై సందేహాలు నెలకొంటున్నాయి. మొదటి నుంచి కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి సంబందించిన భూ సేకరణ వ్యవహారం వివాదాలను రేపుతున్న సంగతి తెలిసిందే. మొదట భీమన్నగుట్టపై నూతన కలెక్టరేట్‌ను నిర్మించాలని తలపెట్టినప్పటికీ దానిని స్థానిక ముదిరాజ్‌లు వ్యతిరేకించడం, ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో పాటు వాస్తు సరిగా లేదన్న కారణంతో అక్కడి నుంచి కలెక్టరేట్‌ను మరోచోటికి తరలించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు ఎల్లపెల్లి గ్రామసమీపంలోని సర్వేనంబర్‌ 422 భూమిలో 25 ఎకరాలను కేటాయించారు. అయితే దీనిపై అభ్యంతరాలు వెలుగేత్తడం, అలాగే ఈ భూమి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందన్న వాదనలు తెరపైకి రావడంతో కేటాయించిన భూమిని కేవలం 15 ఎకరాలకు కుదించారు. అయి నప్పటికీ మిగతాభూమి కూడా ఎఫ్‌టీఎల్‌లోనే ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు దానికి అనుగుణంగా ఈ సర్వేనంబర్‌ భూములపై కూడా ఆంక్షలు విధించింది. దీని కారణంగా కలెక్టరేట్‌ భవన నిర్మాణ వ్యవహరం మరోసారి చిక్కుల్లో పడిందంటున్నారు. ఇప్పటికే నిధుల కొరత కారణంగా పనులు కొనసాగిస్తున్న గుత్తేదారు ఆ పనులను అర్థాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి కలెక్టరేట్‌ భవన నిర్మాణ వ్యవహారం ఎప్పటి వరకు పూర్తవుతుందోనన్న సస్సెన్స్‌ కొనసాగుతోంది. 

హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తాం

 రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తమకు సూచించిన భూముల రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశాం. నిషేధిత భూ ములకు సంబంధించిన వివరాలను అం దరికి అందుబాటులో ఉంచాం. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో వివరాలను తెలుసుకున్న తరువాతనే భూములను కొనుగోలు చేయాలి. రిజిస్ర్టేషన్‌కు అనుమతులు లేని భూములను కొనుగోలు చేసి నష్టపోవద్దు. తదుపరి హైకోర్టు ఆదే శాలకు అనుగుణంగా వ్యవహారిస్తాం. 

- విజయ్‌కాంత్‌ ( సబ్‌ రిజిస్ట్రార్‌, నిర్మల్‌ )


Updated Date - 2021-02-24T06:12:26+05:30 IST