అందరి సహకారంతో ప్రగతి

ABN , First Publish Date - 2021-01-27T05:22:39+05:30 IST

అన్ని శాఖల పరస్పర సహకారంతో జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ ఉద్ఘాటించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అందరి సహకారంతో ప్రగతి
త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

స్థానిక వనరులను వినియోగించుకుంటాం

ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట

అన్ని శాఖలకూ ప్రాధాన్యం 

 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

 (విజయనగరం- ఆంధ్రజ్యోతి)  

అన్ని శాఖల పరస్పర సహకారంతో జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ ఉద్ఘాటించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని శాఖలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్త్తామన్నారు. ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తుచేశారు. పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. పాఠశాలలు, వైద్య శాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులను రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. రైతుల పంటలకు పెట్టుబడి అందించేందుకు రైతు భరోసా కింద నిధులు అందిస్తున్నామని వివరించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కావటం వల్ల సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

జిల్లా ఖ్యాతి విశ్వవ్యాపితం

మహాకవి గురజాడ రచించిన ‘సొంత లాభం కొంత మానుకొని.. పొరుగు వారికి తోడు పడవోయ్‌.. దేశ మంటే మట్టి కాదోయ్‌.. దేశ మంటే మనుషులోయ్‌’ అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం రోజున ప్రస్తావించారని, తద్వారా మరోసారి జిల్లా ఖ్యాతి విశ్వ వ్యాప్తమైందని కలెక్టర్‌ ప్రస్తావించారు. కరోనా వైరస్‌కు ఎక్కువ మంది గురి కాకుండా కాపాడగలిగామన్నారు. ఇందుకోసం వైద్య, పోలీస్‌, పారిశుధ్య కార్మికులు ప్రత్యేకంగా కృషి చేశారని ప్రశంసించారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా అదుపులోనే ఉందని, గ్రీన్‌ జోన్‌లోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు అందిస్తున్నామని, జిల్లా ప్రజలందరికీ త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.

జిల్లాకు ఎనిమిది పురస్కారాలు

పచ్చదనానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1.25 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. భూ గర్భజలాలను పెంచేందుకు, సాగునీటి వనరులను పటిష్ట పరిచేందుకు ఉపయోగపడే చెరువుల అభివృద్ధికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. జాతీయ సాయిలో ఈ రెండు రంగాల్లోనూ మనం గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. అందుకు గాను నాలుగు స్కాచ్‌ అవార్డులు, కేంద్ర జలశక్తి అవార్డు, కేంద్ర ఎన్నికల సంఘం అవార్డు వంటి ఎనిమిది పురస్కారాలను దక్కించుకున్నామన్నారు. విజయనగరం జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు.. కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు, క్రీడాకారుల ఖిల్లా అని కొనియాడారు. 

పోలీస్‌ శాఖ కృషి భేష్‌

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ శాఖ చేస్తున్న కృషిని కలెక్టర్‌ కొనియాడారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణలో ఎస్పీ రాజకుమారి, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది అందించిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీస్‌ శాఖకు అనేక అవార్డులు కైవసం చేసుకున్న విషయాన్నీ గుర్తుచేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు 370 మందిని ఉత్తమ సేవలకులుగా గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు అందించారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరం న్యూ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు జై జవాన్‌.. జై కిసాన్‌.. అంటూ చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. గంట్యాడ ఏపీ మోడల్‌ స్కూల్‌, డెంకాడ జడ్పీ ఉన్నత పాఠశాల, విజయనగరం ఏపీ బాలయోగి గురుకుల, విజయనగరం నారాయణ స్కూల్‌, విజయనగరం కెజీబీవీ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రగతిని చాటుతూ...

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో వివిధవిభాగాల ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన చేపట్టారు. ముందుగా వైద్య ఆరోగ్యశాఖ శకటం సంవత్సర కాలంలో అందించిన సేవల వివరాలతో కదలగా ..108, 104 వాహనాలు అనుసరించాయి.  అనంతరం గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం, స్త్రీ, శిశు సంక్షేమం, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్థక శాఖ, గృహ నిర్మాణశాఖల శకటాలు ముందుకు నడిచాయి. గణతంత్ర వేడుకల్లో ఎస్పీ బి.రాజకుమారి, జేసీలు కిశోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం. డీఆర్‌వో గణపతిరావు, ఆర్డీవో బీసీహెచ్‌ భవానీ శంకర్‌, జడ్పీ సీఈఓ టి.వెంకటేశ్వరరావు, డీఈవో నాగమణి, డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్‌ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కూడా హాజరయ్యారు. 



Updated Date - 2021-01-27T05:22:39+05:30 IST