భూముల రక్షణకు సంఘటితంగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2020-07-09T11:48:02+05:30 IST

నిమ్జ్‌ బాధిత రైతులందరూ తమ భూములను రక్షించుకునేందుకు సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు..

భూముల రక్షణకు సంఘటితంగా ఉద్యమిద్దాం

రేపటి ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయకపోతే ఆందోళనలు 

ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం


న్యాల్‌కల్‌/ఝరాసంగం, జూలై 8 : నిమ్జ్‌ బాధిత రైతులందరూ తమ భూములను రక్షించుకునేందుకు సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం ఝరాసంగం మండలం ఎల్గోయి, న్యాల్‌కల్‌ మండలం మామిడిగి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిమ్జ్‌ పేరుతో రైతుల నుంచి వ్యవసాయ భూములను బలవంతంగా తీసుకోవడం సరికాదన్నారు.


భూసేకరణ ఆపకపోతే రైతులు సమష్టిగా చేసే ఆందోళనలకు తాము మద్దతుగా ఉంటామన్నారు. నిమ్జ్‌ బాధిత రైతులందరూ భూరక్షణ కమిటీని వేసుకుని పోరాటాలను ఉధృతం చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ నెల 10న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోకపోతే అందరూ ఇబ్బందుల్లో పడినట్లేనని ఆయన స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ జనసమితి వెన్నుదన్నుగా నిలబడి పనిచేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయసేకరణ సభను ప్రభుత్వమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనారోగ్యంతో తల్లడిల్లుతూ పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదండరాం విమర్శించారు. ప్రజలు వ్యాధులతో మృత్యువాత పడుతుంటే చర్యలు తీసుకోని ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. కొత్త సెక్రటేరియట్‌ కోసం రూ. 500 కోట్లను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. ఆయన  వెంట టీజేఎస్‌ నియోజకవర్గం నాయకులు ఆశప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు.


న్యాల్‌కల్‌: ఈనెల 10న నిమ్జ్‌ భూసేకరణ విషయంలో ఝరాసంగం మండలంలో నిర్వహించే ప్రజాభ్రిప్రాయ సేకరణను వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్‌ చేశారు. బుధవారం న్యాల్‌కల్‌ మండలంలోని పలు గ్రామాల్లో వారు పొలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ భూములను లాక్కోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు జయరాజ్‌, రాజయ్య వెంట ఉన్నారు.


సంగారెడ్డి రూరల్‌ : కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ జహీరాబాద్‌లోని నిమ్జ్‌పై తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే నిలిపివేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజ్‌ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దీంతో 17 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధు ఇబ్బందులు పడుతారని, వారి ప్రాణాలను కాపాడేందుకు వాయిదా వేయాలని కోరారు.


‘నిమ్జ్‌’ ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి

ఝరాసంగం, జూలై 8 : మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో ఈ నెల 10వ తేదీన నిమ్జ్‌ భూ నిర్వాసితుల ప్రజాభిప్రాయసేకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ సభకు తరిలి వచ్చే రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.


ప్రతీ వ్యక్తికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సభకు వచ్చే అందరికీ శానిటైజర్‌, మాస్క్‌లను అందజేస్తామన్నారు. రెండు మీటర్ల భౌతిక దూరం ఉండేలా కుర్చీలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించామని తెలిపారు. ఝరాసంగం, న్యాల్‌కల్‌ రెండు మండలాల్లో 14 రోజుల నుంచి ఎలాంటి కోవిడ్‌ కేసులు నమోదు కాలేదన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-09T11:48:02+05:30 IST