3 నెలల్లో.. ఏడింతలు

ABN , First Publish Date - 2021-04-17T08:01:11+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటంతో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకుగానూ వ్యాక్సిన్‌ కంపెనీలకు నిధులను సమకూరుస్తోంది. ఈ ఆర్థిక సాయంతో హైదరాబాద్‌కు

3 నెలల్లో.. ఏడింతలు

భారీగా పెరగనున్న ‘కొవాగ్జిన్‌’ ఉత్పత్తి

నెలకు 6-7 కోట్ల డోసులకు.. ఆ తర్వాత 10 కోట్లకు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటంతో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకుగానూ వ్యాక్సిన్‌ కంపెనీలకు నిధులను సమకూరుస్తోంది. ఈ ఆర్థిక సాయంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ‘కొవాగ్జిన్‌’ టీకాల ఉత్పత్తి  మే-జూన్‌ నాటికి రెట్టింపు కానుంది. జూలై-ఆగస్టు నాటికి డోసుల ఉత్పత్తిని దాదాపు ఏడింతలకు పెంచనున్నారు. 2021 ఏప్రిల్‌ నెలలో కోటి కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. అయితే జూలై, ఆగస్టు నాటికి నెలకు 6-7 కోట్ల డోసులు, సెప్టెంబరు నాటికి 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలిగేలా తయారీ ప్లాంట్‌లలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక సామర్థ్యాలను విస్తరించనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం గ్రాంట్‌ రూపంలో అందించనుంది. బెంగళూరులోని భారత్‌ బయోటెక్‌ కొత్త ప్లాంట్‌ను కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడానికి వీలుగా తీర్చిదిద్దడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి దాదాపు రూ.65 కోట్లను సమకూరుస్తున్నట్లు బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం వెల్లడించింది. మూడు ప్రభుత్వ రంగ కంపెనీలకు కూడా గ్రాంట్లు అందనున్నాయి. కొవాగ్జిన్‌ టీకాల తయారీకి వీలుగా ప్లాంట్‌ను తీర్చిదిద్దడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హాఫ్‌కైన్‌ బయోఫార్మాస్యూటికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు దాదాపు రూ.65 కోట్లు ఇవ్వనున్నారు. అయితే ఇందుకు దాదాపు 12 నెలల వ్యవధిని ఈ కంపెనీ కోరగా.. ఆరు నెలల్లోగా టీకాలు ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధం కావాలని కేంద్రం సూచించింది. ఈ కంపెనీకి చెందిన ప్లాంట్‌కు.. ప్రతినెలా 2 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ లెక్కన ఏటా 24 కోట్ల డోసులను ‘హాఫ్‌కైన్‌’ ఉత్పత్తి చేయగలదు. ముంబైలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో కొవాగ్జిన్‌ డోసులు ఉత్పత్తి చేస్తామని హాఫ్‌కైన్‌ బయో ఎండీ సందీప్‌ రాథోడ్‌ తెలిపారు. 


ఐఐఎల్‌, బీఐబీసీఓఎల్‌ సామర్థ్యం పెంపు..

నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు చెందిన ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం పరిధిలోని భారత్‌ ఇమ్యూనోలాజికల్స్‌ అండ్‌ బయోలాజికల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తమ యూనిట్ల సామర్థ్యాలను పెంచుకోవడానికి నిధులు పొందనున్నాయి. వీటిని ఉపయోగించి ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రతినెలా కోటిన్నర డోసులను ఉత్పత్తి చేసేలా ప్లాంట్ల సామర్థ్యాలను పెంచుకోనున్నాయి. ఐఐఎల్‌ హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా,  బీఐబీసీఓఎల్‌ సంస్థ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. 

Updated Date - 2021-04-17T08:01:11+05:30 IST