కార్పొరేటర్ల యాత్రకు వసూళ్లు!

ABN , First Publish Date - 2022-08-11T06:52:02+05:30 IST

జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో పాలక వర్గంలోని కొంతమంది నేతలు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్పొరేటర్ల యాత్రకు వసూళ్లు!

ఈనెల 16 నుంచి 23 వరకూ ఉత్తర భారతదేశ పర్యటన

ఢిల్లీ, సిమ్లా, మనాలి, ఆగ్రా తదితర కార్పొరేషన్లు సందర్శన

ఒక్కో కార్పొరేటర్‌కు రూ.85,500 చొప్పున ఖర్చు

అదనపు ఖర్చులకు అయ్యే డబ్బు కోసం కలెక్షన్‌

ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలకు టార్గెట్లు

అధికారులు గగ్గోలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో పాలక వర్గంలోని కొంతమంది నేతలు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఏటా కార్పొరేటర్ల అధ్యయన యాత్ర చేపట్టేందుకు మునిసిపల్‌ చట్టంలో అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చుకు ఒక పరిమితి ఉంటుంది. దీంతో అదనంగా అయ్యే ఖర్చుల కోసం జీవీఎంసీలోని పలు విభాగాలకు టార్గెట్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల టూర్‌ ప్రస్తుతం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.

జీవీఎంసీ కార్పొరేటర్లు ఏటా దేశంలోని ఏదో ఒక మునిసిపల్‌ కార్పొరేషన్‌ను సందర్శించి అక్కడ అమలుచేస్తున్న వినూత్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు మునిసిపల్‌ చట్టం వీలు కల్పించింది. ఈ మేరకు కౌన్సిల్‌ వుంటే కార్పొరేటర్లు ఏటా అధ్యయన యాత్రకు వెళ్లి వస్తుంటారు. కార్పొరేటర్‌లతోపాటు వారికి సహాయంగా కొంతమంది అధికారులు కూడా వెళుతుంటారు. అయితే 2012 నుంచి 2021 మార్చి వరకూ పాలకవర్గం లేకపోవడంతో అధ్యయన యాత్రల ఊసు లేదు. గత ఏడాది పాలక వర్గం ఏర్పడడంతో ఈనెల 16 నుంచి 23 వరకూ ఉత్తర భారతదేశంలో అధ్యయన యాత్ర చేపట్టాలని పాలకవర్గం పెద్దలు నిర్ణయించారు. యాత్రలో భాగంగా ఢిల్లీ, ఛండీఘర్‌, సిమ్లా, కులుమనాలి, ఆగ్రా నగర పాలక సంస్థలను సందర్శించి అక్కడ అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిపై కార్పొరేటర్ల అభిప్రాయాలను స్వీకరించగా 17 మంది వివిధ కారణాలతో తాము పర్యటనకు హాజరుకావడం లేదని చెప్పగా...మిగిలిన వారంతా అంగీకారం తెలిపారు. ఒక్కో కార్పొరేటర్‌కు విమానం టిక్కెట్లు, స్థానికంగా తిరిగేందుకు బస్సులు, బస చేసేందుకు హోటళ్లు, భోజన సదుపాయం కోసం రూ.84,500 చొప్పున దాదాపు రూ.90 లక్షలు వెచ్చిస్తున్నారు. అయితే అధ్యయన యాత్రకు వెళుతున్న కార్పొరేటర్లలో 41 మంది మహిళలు ఉన్నారు. వారికి సహాయంగా భర్త వచ్చేందుకు జీవీఎంసీ పాలక పెద్దలు అంగీకారం తెలిపారు. అందుకు మరో రూ.32 లక్షల వరకూ అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ మొత్తాన్ని జీవీఎంసీ నుంచి సర్దుబాటు చేసే అవకాశం లేదని కమిషనర్‌ తేల్చి చెప్పేశారు. దీంతో పాలకవర్గంలోని కొంతమంది పెద్దలు ఆ మొత్తాన్ని జీవీఎంసీలోని కొంతమంది అధికారులతోపాటు ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ వంటి విభాగాలను సర్దుబాటు చేయాలని కోరినట్టు తెలిసింది. ఒక్కొక్కరికి వారి పరిస్థితిని బట్టి లక్ష్యం నిర్దేశించినట్టు ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు. కార్పొరేటర్ల యాత్ర కోసం తాము నిధులు సేకరించడమేమిటని వాపోతున్నారు.

 



Updated Date - 2022-08-11T06:52:02+05:30 IST