డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జేసీ
కర్నూలు(కలెక్టరేట్), జనవరి 24: డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమాలకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతుభరోసా) రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తమ సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 41 మంది డయల్ యువర్ కలెక్టర్ స్పందనకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారు.
సి.బెళగల్ మండలం పోలకల్‌కు చెందిన ఎం.రాజేష్ పోలకల్ గ్రామంలో 2, 3 అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.
మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన డి.శివుడు తనకు రైస్ కార్డు తొలగించారని ఫిర్యాదు చేశారు.
కర్నూలు నగరం గణేష్‌నగర్‌కు చెందిన పి.కిషోర్ తమ కాలనీలో డ్రైనేజీ వాటర్ రోడ్లపైకివచ్చి పారుతోందని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.
సిరివెళ్ల మండలం అదే గ్రామానికి చెందిన కె. మనోజ్‌కుమార్ 2016లో తమ తండ్రి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ డ్యూటీలో గుండెపోటుతో మరణించారని, తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.