బుద్దుని బోధ: సమస్యలు మిమ్మల్ని చుట్టముట్టాయా? పరిష్కారం దొరకడం లేదా? అయితే ఈ కథ మీకోసమే..

ABN , First Publish Date - 2021-11-21T13:16:10+05:30 IST

కలత చెందిన మనసులో ఎన్నో ప్రశ్నలు...

బుద్దుని బోధ: సమస్యలు మిమ్మల్ని చుట్టముట్టాయా? పరిష్కారం దొరకడం లేదా? అయితే ఈ కథ మీకోసమే..

కలత చెందిన మనసులో ఎన్నో ప్రశ్నలు... ఫలితంగా సరైన నిర్ణయం తీసుకోలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది? ఈ విషయంలో గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ప్రచారంలో ఉంది. దానిని ఇప్పుడు తెలుసుకుందాం.. గౌతమ బుద్ధుడు ప్రతిరోజూ తన శిష్యులకు మంచి విషయాలు బోధించేవారు. బుద్ధుని ప్రసంగాలు వినడానికి శిష్యులతో పాటు ఇతరులకు కూడా అక్కడికి వచ్చేవారు. ఒకరోజు బుద్ధుడు ఉపన్యాసం చేస్తున్న సందర్భంలో.. ఒక వ్యక్తి లేని నిలబడి.. ‘ఓ మహానుభావా.. నేను చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నా మనసు కలతలతో కొట్టుమిట్టాడుతోంది. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. అప్పుడే నా మనసుకు ప్రశాంతత లభిస్తుంది’ అని అన్నాడు. వెంటనే బుద్ధుడు..‘మీ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతానని’ అన్నాడు. ‘అయితే మీరు ఒక సంవత్సరం పాటు మౌనం పాటించాలి. ఏడాది తర్వాత ఏది అడిగినా కచ్చితంగా సమాధానం చెబుతానని’ అన్నాడు. 


బుద్ధునిపై నమ్మకంతో ఆయన సూచనను అనుసరించి ఆ వ్యక్తి మౌనవ్రతం చేపట్టాడు. ఫలితంగా అతని మనస్సు క్రమంగా ఏకాగ్రత చెందడం ప్రారంభించింది, అతను ధ్యానంలో మునుగుతున్నాడు. మనసు కూడా శాంతించడం ప్రారంభించింది. ఒక సంవత్సరం గడిచింది. ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వెళ్లాడు. అతనిని చూసిన బుద్ధుడు.. ‘ఇప్పుడు మీరు మీ ప్రశ్నలన్నింటినీ అడగవచ్చు’ అని అన్నాడు. ఈ మాటవినగానే..ఆ వ్యక్తి నవ్వుతూ.. ‘ఏడాది క్రితం నా మనసులో చాలా ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ మాయమయ్యాయి’ అని చెప్పాడు. ‘ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ప్రశ్నలే లేవు’ అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తితో.. ‘మనస్సు ప్రశాంతంగా లేనంతకాలం అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’ అని చెప్పాడు. ‘అజ్ఞానం, గందరగోళం కారణంగా మన మనస్సు ప్రశ్నలకు సమాధానాలను కనుక్కోలేకపోతుంది. ఇటువంటి సందర్భంలో మనం కొంతకాలం మౌనంగా ఉంటూ, పరిస్థితిని అర్థం చేసుకుంటే, మనసు నుంచే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రావడం ప్రారంభమవుతుంది’ అని అన్నారు. ‘ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు అన్ని ప్రశ్నలూ అంతమైపోతాయని’ బుద్ధుడు అతనికి బోధించాడు. 

Updated Date - 2021-11-21T13:16:10+05:30 IST