పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-03T04:43:32+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
పేట ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎంఈవో కార్యాలయం ముందు ధర్నా

నారాయణపేట/రూరల్‌, జూలై 2 : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్‌ నుంచి ఎంఈవో కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కాశీ అధ్యక్షతన నిర్వహించిన ర్యాలీలో జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ విద్యార్థులకు అందని పరిస్థితి దాపురించిందన్నారు. అదే విధంగా పాఠశాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్కావెంటజర్లు, నీటి వసతి సమస్యలను పరిష్కరించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతీ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను, పూర్థి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ ఎంఈవోలు లేక పాఠశాలలపై పర్యవేక్షణ లోపించిందని వెంటనే వారిని నియమించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌,  కార్యదర్శి కాశీ, ఉపాధ్యక్షుడు శశికిరణ్‌, మండల నాయకులు శివకుమార్‌, బాలకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

దామరగిద్ద : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకుల ఆధ్వర్యంలో ఎంఈవో ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్‌ మాట్లాడుతూ మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ రాలేదన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వచ్చి హాజరై పోవల్సిన దుస్థితి నెలకొందన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపు చూడడం సరికాదని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అం దించాలన్నారు.  పెండింగ్‌లో ఉన్న వంటషెడ్లను పూర్తి చేయాలని, మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే అందించాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలు అభివృద్ధి చేయాలన్నారు.  కార్యక్రమంలో మండల నాయకులు మహేష్‌, నవీన్‌, రాధిక, అనిత, సునిత, అఖిల్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-07-03T04:43:32+05:30 IST