సమస్యల్లో వసతి!

ABN , First Publish Date - 2022-07-11T05:09:50+05:30 IST

పెచ్చులూడుతున్న పైకప్పులు.. రెక్కలు విరిగిన కిటికీలు.. విరిగిపోయిన తలుపులు.. మాసిన గోడలు.. ఎటు చూసినా పిచ్చిమొక్కలు.. పందులు, శునకాల స్వైరవిహారం.. ఇవండీ మన సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు.

సమస్యల్లో వసతి!
సంగం మండలం కొరిమెర్లలో శిథిలమైన రేకుల షెడ్డులో నడుస్తున్న ఎస్సీ బాలుర వసతిగృహం

సంక్షేమ హాస్టళ్లు.. నరకానికి నకళ్లు!

మరమ్మతులకు నోచుకోని భవనాలెన్నో!

కనీస సదుపాయలు లేక విద్యార్థుల అవస్థలు

మూడేళ్లుగా పైసా విదల్చని ప్రభుత్వం

అధికారులూ చేతులెత్తేశారు!


నెల్లూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పెచ్చులూడుతున్న పైకప్పులు.. రెక్కలు విరిగిన కిటికీలు.. విరిగిపోయిన తలుపులు.. మాసిన గోడలు.. ఎటు చూసినా పిచ్చిమొక్కలు.. పందులు, శునకాల స్వైరవిహారం.. ఇవండీ మన సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు. వీటిలోనే మన విద్యార్థులు ఏడాది పొడవునా గడపాలి. అట్టడుగు వర్గాల విద్యార్థులు ఉండే హాస్టళ్లు అనుకున్నారో,  లేదా వాళ్ల అమ్మానాన్నలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా.. సర్దుకుంటారులే అనుకున్నారో..!! తెలియదు కాని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్టళ్ల మరమ్మతులకు పైసా విడుదల చేయలేదు. ప్రభుత్వం ఎలాగూ ఇవ్వడం లేదు అడగడం ఎందుకని అధికారులు కూడా మిన్నకుండిపోయారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు హాస్టళ్లు మూతపడ్డాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇప్పటికే అత్యంత భయంకరంగా ఉన్న ఈ హాస్టళ్లలో ఉన్న పాపానికి ఎంతో మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యేవారు. అయితే ఈ ఏడాది ఆ ప్రమాదం తప్పేలా లేదు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో హాస్టళ్లు తెరుచుకొంటున్నాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే హాస్టళ్లలో చేరబోతున్నారు. కనీస వసతులు, భద్రత లేని భవనాల్లో పిల్లలు ఎలా ఉండగలరనేదే ప్రశ్న. 


నరకానికి నకళ్లివి...!!

కలిగిరి మండలం సిద్దనకొండూరు వసతి గృహం స్లాబ్‌ ఎప్పడు నెత్తినపడుతుందో తెలియని పరిస్థితి. కిటికీలు, తలుపులకు, గేట్లు అన్ని శిఽథిలమైపోయినవే. లింగసముద్రం బీసీ బాలుర హాస్టల్‌ పరిస్థితీ ఇంతే. కావలి మండలం సర్వాయపాలెం బీసీ హాస్టల్‌ (అద్దె భవనం) బందలదొడ్డి కన్నా దారుణంగా ఉంది. గుడ్లూరు బీసీ బాలుర హాస్టల్‌ మరుగుదొడ్లకు తలుపులు లేవు. దాదాపుగా శిఽథిలావస్థకు చేరుకున్న ఉలవపాడు ఎస్సీ హాస్టల్‌, ఆత్మకూరు బీసీ కాలేజీ బాయ్స్‌ హాస్టళ్ళలో పందుల సంచారం.. గోదామును తలపిస్తున్న సంగం కొరిమెర్ల ఎస్సీ హాస్టల్‌.. ఇలా ఒకటేమిటి జిల్లావ్యాప్తంగా దాదాపుగా మెజారిటీ హాస్టళ్లు ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి.


పైసా విదల్చని ప్రభుత్వం 

సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు దుర్భరంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హాస్టళ్ల మరమ్మతులకు పైసా విదల్చలేదని హాస్టళ్ల నిర్వాహకులు అంటున్నారు. 2019 ముందు వరకు హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల కోసం ప్రతి ఏటా నిధులు విడుదలయ్యేవి. అయితే ఆ తరువాత ఆగిపోయాయి. నాడు-నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం అట్టడుగు వర్గాల విద్యార్థులు ఉండే హాస్టళ్లను గాలికి వదిలేయడం ఎక్కడి న్యాయమని విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు. 


తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య: 

 జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో 85 వసతిగృహాలు ఉండగా వీటిలో 20 కళాశాల వసతిగృహాలు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 77 ఫ్రీ మెట్రిక్‌ 20 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో 18 ఫ్రీ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఐదారేళ్ల క్రితం దాదాపుగా ప్రతి హాస్టల్‌లో 70 నుంచి 80 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మూడేళ్ల క్రితం సగటున హాస్టల్‌కు 30 నుంచి 40 మందికి మించి చేరలేదు. దీనికి ప్రధాన కారణం హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడమే. మూడేళ్లతో పోల్చితే ఇప్పుడు హాస్టళ్లు మరీ దారుణంగా మారాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వసతిగృహాల బాగోగులకు నిధులు విడుదల చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. 





Updated Date - 2022-07-11T05:09:50+05:30 IST