ఏఆర్‌టీకు సుస్తీ

ABN , First Publish Date - 2022-05-28T06:16:05+05:30 IST

ఏఆర్‌టీకు సుస్తీ

ఏఆర్‌టీకు సుస్తీ

పాత, కొత్త ప్రభుత్వాసుపత్రుల్లోని ఏఆర్‌టీ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది కొరత

వైద్యసేవలు అందక హెచ్‌ఐవీ బాధితుల ఇక్కట్లు 

స్టాఫ్‌నర్సుల పోస్టులూ ఖాళీ

సరిపడా మందులు లేక ఇబ్బందులు

కౌన్సెలింగ్‌ ఇచ్చే నాథుడూ లేడు

రెండేళ్లుగా పట్టించుకోని ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారులు 


కొత్త, పాత ప్రభుత్వాసుపత్రుల్లోని ఏఆర్‌టీ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత హెచ్‌ఐవీ బాధితుల పాలిట శాపంగా మారింది. మహమ్మారి బారినపడి, ప్రాణాపాయంతో ఆసుపత్రులకు వస్తున్న పేద రోగులకు సేవలందించేందుకు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, డేటా మేనేజర్లు, ఫార్మాసిస్టులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌ఐవీ రోగులకు కీలకమైన కౌన్సెలింగ్‌ ఇచ్చేవారు లేక, ఖరీదైన మందుల కొరత కారణంగా బాధితులు భయంతోనే కాలం గడుపుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఎన్టీఆర్‌, కృష్ణాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చే హెచ్‌ఐవీ బాధితులకు కూడా మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 2006లో విజయవాడ కొత్త, పాత ప్రభుత్వాసుపత్రుల్లో యాంటీ రెట్రోవైరల్‌ ట్రీట్‌మెంట్‌ (ఏఆర్‌టీ) సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజూ దాదాపు 600 మంది వరకు ఇక్కడకు వచ్చి, ఉచితంగా మందులు తీసుకెళ్తుంటారు. ఈ బాధితుల్లో 14 ఏళ్లలోపు పిల్లలు మొదలు, యుక్తవయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి ధైర్యం చెబుతూ, కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు సిబ్బంది, మందులను వినియోగించడంలో కీలకమైన సలహాలు ఇచ్చేందుకు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, డేటా మేనేజర్లు, ఫార్మాసిస్టులను నియమించారు. ఈ సెంటర్లకు వచ్చే బాధితులకు హెచ్‌ఐవీ వైరస్‌ సోకిందా? లేదా? తెలుసుకుని, తగిన చికిత్స అందించడంలో వీరందరి పాత్ర అత్యంత కీలకం. కానీ, జీజీహెచ్‌లోని ఏఆర్‌టీ సెంటర్లలో తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో బాధితులకు అంతంతమాత్రంగానే సేవలందుతున్నాయి. 

పాత ప్రభుత్వాసుపత్రిలో..

పాత ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటరులో ముగ్గురు డాక్టర్లు ఉండేవారు. వారిలో ఇద్దరు కరోనాకు బలైపోయారు. ఇంకో మహిళా డాక్టర్‌ ఉద్యోగాన్నే వదిలి వెళ్లిపోయారు. దీంతో ఈ సెంటరుకు వచ్చే హెచ్‌ఐవీ బాధితులను పరీక్షించి, వ్యాధి తీవ్రతను గుర్తించి తగిన సలహాలు ఇచ్చేందుకు వైద్యులు అందుబాటులో లేకుండాపోయారు. కనీసం బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే కౌన్సిలర్లు, మందులు ఇచ్చే ఫార్మాసిస్టు పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెంటరులో ముగ్గురు స్టాఫ్‌ నర్సులే హెచ్‌ఐవీ బాధితులకు సేవలందిస్తున్నారు. దీంతో కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌ నుంచి ఒక వైద్యురాలిని తాత్కాలిక ప్రాతిపదికన పాత ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటరుకు పంపించారు. వందల మంది బాధితులకు ఆ ఒక్క డాక్టర్‌ పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వస్తున్న హెచ్‌ఐవీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు నెలకు సరిపడా మందులు ఇవ్వాల్సి ఉండగా, కొరత కారణంగా15 రోజులకే ఇచ్చి పంపిస్తున్నారు. దీంతో నెలలో రెండుసార్లు మందుల కోసం రావాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. 

కొత్త ప్రభుత్వాసుపత్రిలో..

కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటరులో కూడా పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇక్కడకు వస్తున్న హెచ్‌ఐవీ బాధితులకు కూడా అరకొరగానే సేవలందుతున్నాయి. ఈ సెంటరులో ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నా ఒకరిని పాత ఆసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటరుకు పంపించడంతో ప్రస్తుతం ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. డేటా మేనేజర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా, ఒకరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు కౌన్సిలర్లకు గానూ ఒక్కరే ఉన్నారు. రోజూ 300 నుంచి 500  మంది బాధితులు వస్తున్నప్పటికీ, కౌన్సెలింగ్‌ ఇచ్చేవారు లేరు. అరకొరగా ఉన్న వైద్యులు, సిబ్బందిపై పనిభారం పెరిగిపోవడంతో హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. వచ్చిన బాధితులకు మందులు ఇస్తున్నారు గానీ, వాటిని వినియోగించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండట్లేదు. మందుల వినియోగం గురించి పదేపదే అడుగుతుంటే, సిబ్బంది బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

పోస్టులు భర్తీ చేయాలి

జిల్లాలో హై లోడ్‌ సెంటర్లుగా ఉన్న పాత, కొత్త ప్రభుత్వాసుపత్రుల్లోని ఏఆర్‌టీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు రెండేళ్లుగా హెచ్‌ఐవీ బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏఆర్‌టీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీచేసి హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన సేవలందించాలని ఎయిడ్స్‌ కంట్రోల్‌ (ఏపీ సాక్స్‌) అధికా రులను కోరుతున్నా ఫలితం లేదని ఈ సెంటర్లలోని వైద్యాధి కారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులైనా చొరవ తీసుకుని ఏఆర్‌టీ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఐవీ బాధితులు కోరుతున్నారు. 



Updated Date - 2022-05-28T06:16:05+05:30 IST