అమాత్యులకు సమస్యల సవాల్‌

ABN , First Publish Date - 2022-04-13T05:44:17+05:30 IST

మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో మళ్లీ స్థానం దక్కించుకున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం ఉమ్మడి జిల్లాలో సమస్యలు వెంటాడుతున్నాయి.

అమాత్యులకు సమస్యల సవాల్‌

  1. నిధుల లేమితో కదలని ప్రాజెక్టుల పనులు
  2. పీఎంకేఎస్‌వై గ్రాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
  3. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఏది..? 
  4. పునాదులకు కూడా నోచుకోని మెడికల్‌ కళాశాలలు
  5. పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక అవసరం


 మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో మళ్లీ స్థానం దక్కించుకున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం ఉమ్మడి జిల్లాలో సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్లలో సాధారణ ఎన్నికలు రాబోతున్న వేళ అమాత్యులకు అవి సవాల్‌ విసురుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో కరువు తీరాలంటే అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టాలి.  రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద చేపట్టిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన  (పీఎంకేఎస్‌వై) గ్రాంట్‌ మంజూరు చేయించాలి. పారిశ్రామిక ప్రగతికి కృషి చేయాలి. మెడికల్‌ కళాశాలలను నిర్మించాలి. కొత్త జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంత్రులు దృష్టి సారించాల్సిన సమస్యలపై ఆంధ్రజ్యోతి కథనం..


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): కర్నూలు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల జనాభాకు సాగునీటి అందించాలని వేదావతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. రూ.1,94.80 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు హైదరాబాదుకు చెందిన మెగా సంస్థ చేపట్టింది. ఇందుకు భూ సేకరణ సమస్య వేధిస్తోంది. మూడేళ్లలో 6.48 శాతం పనులు చేసి రూ.104 కోట్లు ఖర్చు చేశారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, 1.20 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంగా ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు చేపట్టారు. పశ్చిమ ప్రాంతం కరువు శాశ్వత నివారణ కోసం రూ.1,985.42 కోట్ల నిధులు కేటాయించారు. హైదరాబాదుకు చెందిన ఎనసీసీ సంస్థ పనులు చేపట్టింది. నిధులు లేక పనులు ఆగిపోయాయి. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలనే గుండ్రేవుల జలాశయం కోసం రూ.2,980 కోట్లు మంజూరు చేస్తూ గత టీడీపీ ప్రభుత్వంలోనే జీవో ఇచ్చారు. రూ.44 కోట్లతో పునాది రాయి వేసి గాజులదిన్నె సామర్థ్యం పెంపు భూ సేకరణ పూర్తి కాలేదు.


  నంద్యాల: రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద చేపట్టిన పలు ప్రాజెక్టులు నంద్యాల జిల్లాలోనే ఉన్నాయి. ప్రధానంగా పోతిరెడ్డిపాడు హడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బీసీఆర్‌ వరకు ప్రధాన కాలువ అప్‌గ్రేడేషనకు రూ.570.45 కోట్లు, బానకచర్ల నుంచి గోరుకల్లు వరకు ఎస్‌ఆర్‌బీసీ/జీఎనఎస్‌ఎస్‌ లైనింగ్‌కు రూ.939.65 కోట్లు, గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు ఎస్‌ఆర్‌బీసీ/జీఎనఎస్‌ఎస్‌ లైనింగ్‌కు రూ.1,457 కోట్లు, అవుకు - గండికోట రిజర్వాయరు వరకు జీఎనఎస్‌ఎస్‌ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఇంప్రూవ్‌మెంట్‌ రూ.633 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా ఢిల్లీలో నీతి అయోగ్‌ సభ్యుడు అవినాష్‌మిశ్రాను ఒప్పించి ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) ద్వారా గ్రాంట్‌ మంజూరు చేయించాలి. ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో 21,300 ఎకరాలకు సాగునీరు అందించే సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే రూ.50 కోట్ల నిధులు ఇవ్వాలి. డోన, పత్తికొండ నియోజకవర్గాల్లో హంద్రీ నీవా నుంచి 68 చెరువుల నింపే ప్రాజెక్టు పనులు రూ.224.31 కోట్లతో టీడీపీ ప్రభుత్వంలో చేపట్టారు. మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.140.86 కోట్లే. 


నిధులు లేక పునాదులకు నోచుకోని మెడికల్‌ కళాశాలలు: 

కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు ఏ చిన్న జబ్బు చేసినా కర్నూలు సర్వజన వైద్యశాలకు రావాల్సిందే. 75-125 కి.మీలకు పైగా ప్రయాణం తప్పడం లేదు. ఆదోనిలో మెడికల్‌ కళాశాల నిర్మిస్తామంటే ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆనందించారు. ఆదోని మండలం ఆరేకల్లు సమీపంలో 58.44 ఎకరాలు ఎకరం రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. రూ.475 కోట్లు మంజూరు చేసి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర కావస్తున్నా పునాది తీయలేదు. నిర్మాణాలు మొదలు పెడుతారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కార్మిక శాఖ మంత్రి బుగ్గన దృష్టి సారించాలి.

-  ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల నిర్మాణంలో భాగంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)కు చెందిన వంద ఎకరాల్లో 50 ఎకరాలు మెడికల్‌ కళాశాలకు కేటాయించారు. రూ.475 కోట్లతో నిర్మించే ఈ కళాశాల నిర్మాణానికి సీఎం జగన వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేస్తే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పునాది రాయి వేశారు. నిధుల సమస్య కారణంగా పునాది కూడా తీయలేదు. స్వాతంత్య్రం తరువాత రాష్ట్రంలో 11 మెడికల్‌ కళాశాలలు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం 16 మెడికల్‌ కళాశాలలు నిర్మిస్తోంది. అందులో ఒకటి నంద్యాలలో అంటూ సీఎం జగన గొప్పగా చెప్పారు. ఈ మేరకు నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత బుగ్గనపై ఉంది. 

  ప్రారిశ్రామిక ప్రగతి పట్టాలెక్కెనా..?:

 కర్నూలు నగరంలో పలు పరిశ్రమలు మూత పడ్డాయి. ఆదోని కేంద్రంగా పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలు 125కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పోత్సాహకం లేక పలు జిన్నింగ్‌ పరిశ్రమలు మూత దశలో ఉన్నాయి. ప్రభుత్వం రాయితీ కూడా ఇవ్వడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఓర్వకల్లు దగ్గర ఇండసి్ట్రయల్‌ హబ్‌కు గత టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమి కేటాయించింది. ఐరన పరిశ్రమ ఒక్కటే నిర్మాణంలో ఉంది. జగన ప్రభుత్వం వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం పరిశ్రమల శాఖ మంత్రితో చర్చించి పలు పరిశ్రమలు వచ్చేలా చూడాలి.


 నంద్యాల: కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ హబ్‌ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ సమయంలో వచ్చిన ఓ సిమెంట్‌ పరిశ్రమ తప్పా ఈ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఆ దిశగా కృష్టి చేయలేదనే చెప్పాలి. డోన, బేతంచర్ల కేంద్రంగా ఉన్న పలు గ్రానైట్‌, పల్వరైజర్‌ పరిశ్రమలు మూత పడి పలువురు కార్మికులు రోడ్డున పడుతున్నారు. పాణ్యం దగ్గర 3,500 ఎకరాల్లో నిర్మించదలిచిన పైపు స్టోరేజ్‌ సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిశ్రామిక ప్రగతికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

  రైతన్నకు ప్రోత్సాహం ఏదీ..?:

 ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల రైతులకు మెట్ట వ్యవసాయమే ఆధారం. ఆదోని కేంద్రంగా శాశ్వత పత్తి బోర్డు ఏర్పాటు చేయాలి. టమోటా, ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్లు, మిరప మార్కెట్‌, జొన్న, సజ్జ, కొర్ర, సాములు వంటి చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకం అందించేందుకు మిల్లెట్‌ బోర్డు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

  నంద్యాల: కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువల ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ ప్రాంతం కరువు సీమలో  కోనసీమలా ఉంటుంది. ఈ ప్రాంతంలో సీడ్‌ హబ్‌ ఏర్పాటు చేసి రైతులను భాగస్వామ్యం చేయాలి. గత టీడీపీ ప్రభుత్వం నందికొట్కూరు నియోజకవర్గం తంగడంచ దగ్గర 623 ఎకరాల్లో మెగా సీడ్‌ హబ్‌కు శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిని రద్దు చేసి ఆ భూములు విత్తనోత్పత్తి కేంద్రానికే అప్పగించింది. దీనిపై పునరాలోచించాలి. 8న నంద్యాల సభలో సీఎం జగన ఇచ్చిన హామీ మేరకు నంద్యాల కేంద్రంగా మిర్చి మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. రెండు జిల్లాల్లో ఉల్లి, మిరప శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. 

   త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

వేదవతి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. రెండేళ్లు గడిచినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. వేదవతి పనులు పూర్తి చేస్తే పంటలకు సాగునీటితో పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే పంటలకు నీరందక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ప్రతి ఏటా పంటలు పండక తీవ్రంగా నష్టపోయి అప్పులపాలవుతున్నాం. వేదవతి పూర్తయితే పంటలకు సాగునీరంది రైతులు పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది.

-మల్లయ్య, రైతు నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం


  వేదవతి నిర్మాణ పనుల్లో జాప్యం తగదు

ఆర్భాటంగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వర్షంపై ఆధారపడి ఉన్న రైతులు ప్రతి ఏటా పంటలు పండక నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో రైతులు పంటలు పండక వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వేదవతి ప్రాజెక్టు పూర్తైతే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 

-నారాయణరెడ్డి, తెలుగురైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి, ఆలూరు:


పంటలకు నీటి తడులు అందించేందుకు అవస్థలు 

  సిద్దాపురం చెరువు బ్రాంచ కెనాల్స్‌కు అనుసంధానంగా పంట కాలువలు లేకపోవడంతో పొలాలకు నీటి తడులు అందించేందుకు అవస్థలు పడుతున్నాం. ప్రాజెక్టు పూర్తయి నాలుగేళ్లవుతున్నా ఇంత వరకు పంట కాలువల ఏర్పాటు జరగలేదు. దీంతో ప్రధాన కాల్వల్లో మోటార్ల ద్వారా పంటలకు నీరందించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన కాల్వలకు దూరంగా ఉండే పంటలకు నీరందించాలంటే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫీల్డ్‌ చానల్స్‌ ఏర్పాటు చేస్తే పంటలకు పుష్కలంగా నీరందించే అవకాశం ఉంటుంది.

- రాంబాబునాయక్‌, ముష్టపల్లి గ్రామ రైతు


 




Updated Date - 2022-04-13T05:44:17+05:30 IST