బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం... ప్రియాంక గాంధీ ఆగ్రహం...

ABN , First Publish Date - 2021-04-02T17:33:27+05:30 IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై జాతీయ పార్టీలు

బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం... ప్రియాంక గాంధీ ఆగ్రహం...

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై జాతీయ పార్టీలు మరోసారి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కోరారు. అస్సాంలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఓ ఈవీఎంను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్ళడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇటువంటి సంఘటనలపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


అస్సాం శాసన సభ రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత ఓ ఈవీఎంను ఎన్నికల అధికారులు పత్తర్‌కండి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్ కారులోతీసుకెళ్తున్నట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. బారక్ లోయలో ఈ సంఘటన జరిగింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతోపాటు లాఠీఛార్జ్ చేసి, నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఈవీఎం భద్రంగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఎన్నికల అధికారులు అంతకుముందు ఉపయోగించిన కారు చెడిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ కారును ఆపారని, ఆ కారు బీజేపీ నేతకు చెందినదని ఆ తర్వాత తెలిసిందని మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఈవీఎంలను ప్రైవేటు వాహనాల్లో తీసుకెళ్లే సంఘటనలు ప్రతిసారీ దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఆశ్చర్యానికి తావులేని కొన్ని అంశాలు వీటిలో సామాన్యంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వాహనాలు సాధారణంగా బీజేపీ అభ్యర్థులకు, వారి సహచరులకు చెందినవై ఉంటుండటంలో ఆశ్చర్యం లేదన్నారు. ఇటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను ఏదో ఒకసారి జరిగిన సంఘటనలుగా కొట్టిపారేస్తున్నారని, ఆమోదయోగ్యం కానివాటిగా తోసిపుచ్చుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వీడియోలను బయటపెట్టేవారిని ఓటమి దుఃఖంలో ఉన్నవారిగా చిత్రీకరించేందుకు బీజేపీ తన మీడియా యంత్రాంగాన్ని వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ దృఢ నిశ్చయంతో చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీలన్నీ ఈవీఎంల వాడకంపై మరోసారి తీవ్రంగా ఆలోచించాలని కోరారు. 


Updated Date - 2021-04-02T17:33:27+05:30 IST