కేడర్‌ను ఉత్తేజపరచాలంటే ప్రియాంక గాంధీ అలా చేయాల్సిందే : కార్తి చిదంబరం

ABN , First Publish Date - 2021-03-05T22:40:50+05:30 IST

కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన

కేడర్‌ను ఉత్తేజపరచాలంటే ప్రియాంక గాంధీ అలా చేయాల్సిందే : కార్తి చిదంబరం

చెన్నై : కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. వచ్చే నెలలో కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి వినతి పత్రం సమర్పించారు. ఆయన ఈ డిమాండ్ చేయడం ఇది రెండోసారి. 


తమిళనాడు శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. అదే రోజు కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. కాంగ్రెస్ నేత, సిటింగ్ ఎంపీ వసంత కుమార్ కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కార్తి చిదంబరం గత ఏడాది నవంబరులో కూడా డిమాండ్ చేశారు. తమిళనాడు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలంటే పార్టీ ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 


కార్తి చిదంబరం మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ, తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ వాద్రా కన్యాకుమారి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం కలుగుతుందని చెప్పారు. ఆమెను అభ్యర్థినిగా ప్రకటించాలని తాను రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి వినతిపత్రం సమర్పించానని తెలిపారు. 



Updated Date - 2021-03-05T22:40:50+05:30 IST