రోడ్డున పడ్డ ‘ప్రియదర్శిని’ కార్మికులు

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

సదాశివపేట ప్రాంతంలో 1980లో ప్రారంభమైన ప్రియదర్శిని స్పిన్నింగ్‌ మిల్లు పరిశ్రమ ఓ వెలుగు వెలిగింది.

రోడ్డున పడ్డ ‘ప్రియదర్శిని’ కార్మికులు
ధర్నాలో కూర్చున్న కార్మికులు

తట్టా బుట్టా సర్దుకున్న యాజమాన్యం 

ఉపాధి కోల్పోయిన మూడు వేల మంది 

న్యాయం కోసం వంద కార్మిక కుటుంబాల ధర్నా

 సదాశివపేట, డిసెంబరు 1: సదాశివపేట ప్రాంతంలో 1980లో ప్రారంభమైన ప్రియదర్శిని స్పిన్నింగ్‌ మిల్లు పరిశ్రమ ఓ  వెలుగు వెలిగింది. దాదాపు మూడు వేల మందికి ఉపాధి కల్పించి గొప్ప పేరు సంపాదించింది. రెండున్నర దశాబ్దాల కాలం సజావుగా సాగిన పరిశ్రమను యాజమాన్యం నష్టాల సాకును చూపుతూ కార్మికులను వదిలించుకునే యత్నాలను ప్రారంభించింది.  కాంట్రాక్టు, శాశ్వత కార్మికుల్లో దాదాపు సగం మందిని తొలగించింది. వేలాది మంది కార్మికులను మభ్యపెట్టి ఓ మోస్తరు నష్టపరిహారం ఇచ్చి పక్కకు జరిపింది. పరిశ్రమ యాజమాన్యం తీరుతో తమకు అన్యాయం జరుగుతున్నదని ఆరోపిస్తూ వందమంది కార్మికులు కోర్టు మెట్లు ఎక్కి న్యాయ పోరాటం చేస్తున్నారు. మరో 100 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు కంపెనీ గేటు ముందే ధర్నాలు చేస్తున్నారు. 


 పరిశ్రమను వేలం వేసిన బ్యాంకులు

ఓవైపు వారి పోరాటం కొనసాగుతుండగానే, మరోవైపు పరిశ్రమ తీసుకున్న అప్పుల కారణంగా బ్యాంకులు పరిశ్రమను వేలం వేశాయి. చూస్తుండగానే వేలం పాడిన వ్యక్తులు అక్కడ కొత్త కంపెనీ పేరుతో బోర్డును పెట్టి పాత పరిశ్రమ రూపురేఖలు లేకుండా సన్నాహాలు చేస్తున్నారు. మూడు దశాబ్దాలు కష్టపడి పని చేసినా.. ఎలాంటి పరిహారం లేకుండానే వీధుల్లో పడడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా నష్టపరిహారం వస్తుందనే ఆశతో గేటు ముందు పోరాటం చేస్తున్నారు. కోర్టులో కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మిక శాఖల వైఫల్యం కారణంగానే కార్మికుల నోట్లో మట్టి కొట్టి యాజమాన్యం వెళ్లిపోయిందని కార్మికులు, వారి కుటుంబాలు ఆరోపిస్తున్నారు. దాదాపు వృద్ధాప్య దశకు చేరిన కార్మికులు మరో పని చేసుకునే స్థితిలో లేరు. పరిశ్రమను వేలంపాట ద్వారా కొనుగోలు చేసిన కొత్త సంస్థ లీగల్‌గా బ్యాంకుల ద్వారా పరిశ్రమను కొనుగోలు చేశామని కార్మికులు ధర్నా కేంద్రాన్ని ఎత్తివేయాలని హుకూం జారీ చేశారు. అంతేగాకుండా పరిశ్రమలో 30 ఏళ్లుగా ఉంటున్న క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని చెప్పారు. ఇప్పటికే పోలీసు ల నుంచి తమకు బెదిరింపులు ప్రారంభమయ్యాయని ధర్నాలో ఉన్న కార్మికులు ఆరోపిస్తున్నారు.   

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST