ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

ABN , First Publish Date - 2020-10-24T12:09:05+05:30 IST

దసరా పండగ వేళ.. ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది దసరా సీజన్‌లో..

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

 దసరా డిమాండ్‌ నేపథ్యంలో దందా

ఇష్టానుసారంగా టిక్కెట్ల ధరలు పెంపు

ప్రయాణికులపై అదనపు భారం


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): దసరా పండగ వేళ.. ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది దసరా సీజన్‌లో పరిమితంగానే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ అసలు జిల్లా నుంచి తెలంగాణకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ వెళ్లే బస్సుల్లో టిక్కెట్‌ ధరలు బాగా పెంచేశారు. దసరా పండగ రద్దీ నేపథ్యంలో.. అదనపు భారం మోపుతున్నారు. 


ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు దసరా పండగ పేరిట దందాకు పాల్పడుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని.. టిక్కెట్ల ధరలు పెంచేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ఆరు నెలలు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు సాగించారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌కు డిమాండ్‌ తగ్గిపోయింది. ప్రభుత్వం విడతల వారీ లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రస్తుతం జనాలు రాకపోకలు సాగిస్తున్నారు. వలసకూలీలు స్థానికంగా ఉపాధి లేక తిరుగు పయనమవుతున్నారు. దసరా సందర్భంగా కొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్లేవారు... ఉద్యోగరీత్యా వలసబాట పట్టేవారు ప్రయాణాలు సాగిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాలకు అధిక మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. లాక్‌డౌన్‌ నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా.. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటికీ శ్రీకాకుళం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేవు.


మరోవైపు రైళ్లలో కూడా రిజర్వేషన్లు లభ్యం కాకపోవడంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు లాక్‌డౌన్‌ కాలంలో నష్టాలను పూడ్చుకునేందుకు ప్రస్తుతం టిక్కెట్‌ ధరలను పెంచేశారు. ఓ వైపు దసరా పండగ డిమాండ్‌.. మరోవైపు శానిటైజేషన్‌, రక్షణ చర్యల పేరుతో టిక్కెట్‌పై అదనంగా రూ.200  నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు టిక్కెట్‌ చార్జీ ఏకంగా రూ.500 వరకు పెంచారు. వోల్వో సర్వీసులకు రూ.700 నుంచి రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. స్లీపర్‌ బస్సు ఏసీ అయితే రూ. 1700 నుంచి రూ. 2వేలు.., నాన్‌ ఏసీ అయితే రూ.1400 నుంచి రూ.1700కు పెంచేశారు. ఇక సాధారణ బస్సులకైతే.. ఏసీ అయితే రూ.1500.. నాన్‌ఏసీ బస్సులకు రూ. 1300 చొప్పున పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారు. దీనిపై ప్రయాణికులు ప్రశ్నించగా.. పండగ తర్వాత హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు టిక్కెట్ల ధరలు   తగ్గుతాయని.. ట్రావెల్స్‌ యజమానులు, ఏజెంట్లు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు.  ట్రావెల్స్‌ ధరల నియంత్రణపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-10-24T12:09:05+05:30 IST