ప్రైవేటు ఉపాధ్యాయులూ.. 15లోగా వివరాలు అందించాలి

ABN , First Publish Date - 2021-04-10T05:55:17+05:30 IST

ఈనెల 15లోగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌ నుంచి ఆమె పౌర

ప్రైవేటు ఉపాధ్యాయులూ.. 15లోగా వివరాలు అందించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, డీఈవో, అధికారులు

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం 

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, డీఈవో

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 9: ఈనెల 15లోగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌ నుంచి ఆమె పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, విద్యాశాఖ డీఈవోలు, పౌర సరఫరాల శాఖ డీఎస్‌వోలు, డీఎంలతో వీడీయో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతీ ఒక్కరికి రూ.2వేలతో పాటు 25 కేజీల బియ్యం అందించడానికి ప్రతీఒక్కరు సీరియస్‌గా పనిచేయాలన్నారు. ఈనెల 10నుంచి 15వరకు ఎంఈవోల ద్వారా డేటా సేకరించాలని, ఏప్రిల్‌ 28లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 2వేలు  ఆర్థిక సహాయంతో పాటు ప్రతి కుటుంబానికి 25కిలోల బియ్యాన్ని రేషన్‌ షాప్‌ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలు 450 ఉన్నాయని బోధన, బోధనేతర సిబ్బంది.. వారి వివరాలు, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా ఇతర వివరాలను వెంటనే సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. ఈ వీసీలో డీఈవో దుర్గాప్రసాద్‌, సివిల్‌ సప్లై అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-10T05:55:17+05:30 IST