మృతురాలికి ఆరోగ్యశ్రీ చికిత్స!

ABN , First Publish Date - 2021-05-19T05:53:41+05:30 IST

చనిపోయిన వ్యక్తికి ఆరోగ్యశ్రీ కింద..

మృతురాలికి ఆరోగ్యశ్రీ చికిత్స!
మోసం జరుగుతుందంటూ విలేకరులకు వివరిస్తున్న గణేష్‌

ఆరోగ్యశ్రీ నుంచి మెసేజ్‌లు

ఆస్పత్రి సిబ్బందిని నిలదీసిన మృతురాలి కుమారుడు


మంగళగిరి(గుంటూరు): చనిపోయిన వ్యక్తికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ నుంచి వచ్చిన మేసేజ్‌లు మంగళవారం గందరగోళానికి దారితీశాయి. మృతురాలి కుమారుడు గణేష్‌ మంగళవారం సదరు ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులకు వివరించారు. గణేష్‌ చెప్పిన కథనం ప్రకారం.. విజయవాడ విద్యాధరపురానికి చెందిన నిమ్మల సామ్రాజ్యం(64)కు కరోనా సోకడంతో ఆమె కుమారుడు గణేష్‌ ఈ నెల రెండో తేదీ మంగళగిరిలోని ఓ ప్రైవేటు జనరల్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మూడో తేదీన ఆమెకు ఆరోగ్యశ్రీ కింద బెడ్‌ కేటాయించారు. అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో గణేష్‌ తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లాడు.


తమ ఇష్టప్రకారమే ఇంటికి తీసుకువెడుతున్నట్టు గణేష్‌చేత ఓ పత్రాన్ని ఆస్పత్రి సిబ్బంది రాయించుకున్నారు. ఇంటివద్దే వైద్యం చేయిస్తుండగా ఆమె ఈనెల ఎనిమిదో తేదీన మృతిచెందారు. అయితే ఆమెకు చికిత్స చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నుంచి గణేష్‌ సెల్‌ఫోన్‌కు మేసేజ్‌లు వస్తూ వున్నాయి. 17వ తేదీన సామ్రాజ్యం ఆరోగ్యం బాగుపడిందని, ఆమెను డిశ్చార్జి చేస్తామని తన ఫోన్‌కు మేసేజ్‌ రావడంతో గణేష్‌ అవాక్కయ్యాడు. మంగళవారం ఆసుపత్రికి వచ్చి తనకు వచ్చిన మెసేజ్‌ల గురించి ఆస్పత్రి సిబ్బందిని నిలదీశాడు. దీంతో వారు నాలుక కరుచున్నారు. దీని గురించి విలేకరులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ షేక్‌ మస్తాన్‌ను వివరణ కోరగా... సామ్రాజ్యం ఈనెల మూడున ఆసుపత్రి ఓపీకి వచ్చినమాట నిజమేనని.. ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్‌ ఇచ్చి వార్డుకు వెళ్లమని చెప్పగా...ఆమె దుస్తులు తీసుకుని వస్తానంటూ వార్డుకు రాకుండానే అటునుంచి అటే ఇంటికి వెళ్లిపోయారన్నారు.


ఇది తమ సిబ్బందికి తెలియకపోవడంతో 24 గంటల్లో ఆరోగ్యశ్రీ అప్రూవల్‌ అయిపోయిందన్నారు. సామ్రాజ్యం కుటుంబీకులు టెలిఫోన్‌ కన్సల్టేషన్‌ వాళ్లకు అసలు విషయాన్ని చెప్పకుండా దాచి వాళ్లని తప్పుదారి పట్టించడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని డాక్టర్‌ మస్తాన్‌ చెప్పారు. గణేష్‌ వద్దనుంచి ఏ రూపేణా డబ్బు వసూలు చేయలేదన్నారు. 

Updated Date - 2021-05-19T05:53:41+05:30 IST