ములాఖత్‌ ప్రారంభమయ్యేనా..?

ABN , First Publish Date - 2020-10-28T09:45:46+05:30 IST

కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేశారు

ములాఖత్‌ ప్రారంభమయ్యేనా..?

ఏడు నెలలుగా ఖైదీల ఎదురుచూపు 

యోగక్షేమాలపై కుటుంబసభ్యుల్లో ఆందోళన 

వీడియో, ఫోన్‌ కాల్‌ సదుపాయంతో కొంతమేర ఊరట 


సైదాబాద్‌, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని ఎదురుగా చూసుకోలేక, మనస్సు విప్పి మాట్లాడలేక ఆవేదనతో గడుపుతున్నారు ఖైదీలు. ఆన్‌లైన్‌ ములాఖత్‌ సౌకర్యం ఏర్పాటు చేసినా కొందరు వినియోగించుకోలేకపోతున్నారు. 


ఖైదీలకు ఫోన్‌ సదుపాయం.. 

ప్రైవేట్‌ టెలీకాం కంపెనీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో జైళ్లలో ఖైదీలకు ఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. మొదట శిక్షపడ్డ ఖైదీలకు, ఆ తర్వాత రిమాండ్‌లో ఉన్న నిందితులకు ఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫోన్‌ సౌకర్యం ద్వారా జైళ్లలో ఉన్న తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.  చంచల్‌గూడ జైల్లో ఏర్పాటు చేసిన 14 ఫోన్ల నుంచి రోజుకు 80నుంచి 100మంది, మహిళా జైలులో ఉన్న మూడు ఫోన్లలో రోజుకు 30-40 మంది వరకు మహిళా ఖైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.  


వీడియో కాల్‌ సౌకర్యంతో.. 

ఖైదీలతో కుటుంబసభ్యులు నేరుగా వీడియో కాల్‌ మాట్లాడే అవకాశాన్ని జైళ్లశాఖ కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వీడియో కాల్‌ మాట్లాడాలనుకునే ఖైదీల కుటుంబసభ్యులు జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్‌ అయి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం జైలు అధికారులు వాటిని పరిశీలించి ఏ సమయంలో మాట్లాడాలనే వివరాలు వారి ఫోన్‌కు పంపిస్తారు. అధికారుల సమక్షంలో కేవలం 10 నిమిషాలు మాత్రమే, వారంలో రెండుసార్లు  మాట్లాడాల్సి ఉంటుంది. దీనిపై చాలామందికి అవగాహన లేకపోవడంతో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్‌ కేంద్ర కారాగారాలలో కేవలం 50లోపు ఖైదీల కుటుంబసభ్యులు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు. 


ములాఖత్‌లను ప్రారంభించండి

ములాఖత్‌ అవకాశం కల్పించాలని ఖైదీల కుటుంబసభ్యులు కోరుతున్నారు.  మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు అమలు చేస్తూ ములాఖత్‌ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఫోన్‌, ఆన్‌లైన్‌ ములాఖత్‌లో మాట్లాడుకునే అవకాశం ఉన్నా సమయం తక్కువగా ఉండటం వల్ల మాట్లాడినట్లు ఉండటం లేదని, ఎదురుగా చూస్తూ మాట్లాడుకుంటే బాగుంటుందని కొందరు అంటున్నారు. జైలు అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు పోతామని చెబుతున్నారు. ములాఖత్‌లపై సానుకూల నిర్ణయం వస్తే తేదీ, సమయాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - 2020-10-28T09:45:46+05:30 IST