పంజాబ్‌లో ప్రధాని భద్రత లోపం కేసు.. సుప్రీం లాయర్లకు బెదిరింపులు

ABN , First Publish Date - 2022-01-18T06:52:30+05:30 IST

పంజాబ్‌లో ఈ నెల 5న ప్రధాని మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్న కేసులో.. వాదోపవాదాలు

పంజాబ్‌లో ప్రధాని భద్రత లోపం కేసు.. సుప్రీం లాయర్లకు బెదిరింపులు

  • విచారణ కమిటీ చైర్మన్‌ ఇందూ మల్హోత్రాను కూడా 
  • వదిలేది లేదంటూ  ఎస్‌ఎ్‌ఫజే హెచ్చరికలు

న్యూఢిల్లీ, జనవరి 17: పంజాబ్‌లో ఈ నెల 5న ప్రధాని మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్న కేసులో.. వాదోపవాదాలు వినిపించకూడదంటూ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థల నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఆ కాల్స్‌లో ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్‌, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూమల్హోత్రా పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల 10న కొందరు న్యాయవాదులకు బెదిరింపు కాల్స్‌ రాగా.. విష్ణు శంకర్‌ జైన్‌ అనే అడ్వొకేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


‘‘మీరు ఈ వివాదంలో జోక్యం చేసుకోవొద్దు. ఇది సిక్కులు-ప్రధానికి నడుమ జరుగుతున్న వివాదం. ఫోన్‌కాల్స్‌పై కేసులు పెట్టినవారు అందుకు మూల్యం చెల్లించుకుంటారు’’ అంటూ ఆగంతుకుడు బెదిరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. ‘‘ఈ నెల 26న గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకుంటాం. సిక్కు రైతుల మృతికి కారణమైన ప్రధాని మోదీకి ఎవరూ సహాయం చేయొద్దు’’ అంటూ హెచ్చరించినట్లు తెలిపారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని ఎస్‌ఎ్‌ఫజే ఆరోపించినట్లు వెల్లడించారు. ఈ బెదిరింపులపై న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది.


కాగా.. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌ఎ్‌ఫజేపై భారత్‌లో 2019 నుంచి నిషేధం ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను బ్యాన్‌ చేసింది.  కాగా.. అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చే శారు. రాజకీయ పార్టీ తన అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. 

Updated Date - 2022-01-18T06:52:30+05:30 IST