బోరిస్‌ మెడపై ఉద్వాసన కత్తి?

ABN , First Publish Date - 2022-01-15T08:54:32+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో 10 డౌన్‌ స్ట్రీట్‌లోని

బోరిస్‌ మెడపై ఉద్వాసన కత్తి?

  • కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మందు పార్టీలు 
  • ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలకు గంటల ముందూ 
  • ప్రధాని కార్యాలయ సిబ్బంది డ్రింక్‌ పార్టీ 
  • పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాల ఒత్తిళ్లు 
  • సొంత పార్టీ నుంచీ వ్యతిరేకతతో ఉక్కిరిబిర్కిరి 
  • ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రుషి సునక్‌ 


లండన్‌, జనవరి 14: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో 10 డౌన్‌ స్ట్రీట్‌లోని అధికారిక నివాసంలో సహచరులతో కలసి మందు పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. స్వయంగా ప్రధానమంత్రే ఆంక్షలు ఉల్లంఘించినట్లు వెలుగు చూడటంతో బోరిస్‌ పదవి నుంచి తక్షణం దిగిపోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీతో పాటు సొంత కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల నుంచీ ఒత్తిళ్లు పెరగడంతో చివరకు ఆయన దీనిపై హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అది కార్యాలయ నిర్ణయాలపై చర్చ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ మాత్రమేనని, ఉద్దేశ పూర్వకంగా పెట్టుకున్న పార్టీ కాదని బోరిస్‌ వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగానే 2021 ఏప్రిల్‌లో ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు జాన్సన్‌ సిబ్బంది మద్యం సేవించిన ఘటన శుక్రవారం వెలుగుచూడటంతో వ్యవహారం మరింత ముదిరింది.


వరుస ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం బోరిస్‌ తన రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. కాగా, జాన్సన్‌ క్షమాపణలు చెప్పిన తర్వాత లండన్‌లో స్థానిక వార్తా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పది మంది పౌరుల్లో ఆరుగురు బోరిస్‌ పదవి నుంచి దిగిపోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బోరిస్‌ దిగిపోతే తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ రేసులో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు అయిన భారత సంతతికి చెందిన రుషి సునక్‌ ముందు వరుసలో ఉన్నారు. 

Updated Date - 2022-01-15T08:54:32+05:30 IST