ప్రమాదంలో ప్రాథమిక విద్య

ABN , First Publish Date - 2022-05-15T06:39:32+05:30 IST

పాలకుల నిర్ణయంతో ప్రాథమిక విద్యకు తీవ్ర విఘాతం కలిగేలా ఉంది.

ప్రమాదంలో ప్రాథమిక విద్య

ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విలీనం ప్రక్రియ కొనసాగింపు

తాజాగా కిలోమీటరు పరిధిలో గల 310 పాఠశాలలు గుర్తింపు

గత విద్యా సంవత్సరం అర కిలోమీటరు పరిధిలో గల 170 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు విలీనం

హైస్కూళ్లలో ఇప్పటికే వసతి కొరత

చాలాచోట్ల వరండాల్లో కూడా తరగతులు నిర్వహణ

 ఇప్పుడు అదనంగా పిల్లలు వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్న ఉపాధ్యాయులు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పాలకుల నిర్ణయంతో ప్రాథమిక విద్యకు తీవ్ర విఘాతం కలిగేలా ఉంది. ఇప్పటివరకూ ఇంటి సమీపంలో గల పాఠశాలల్లో చదువుకున్న పిల్లలు ఇకపై దూరానున్న ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలు పేరిట ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను వాటికి అర కిలోమీటరు దూరంలో గల ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే విలీనం చేసేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కిలోమీటరు పరిధిలో గల ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను కూడా హైస్కూల్లో కలిపేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో ఉన్న 310 ప్రాథమిక పాఠశాలలను అధికారులు గుర్తించి జాబితాను పాఠశాల విద్యా శాఖకు పంపించారు. 

ప్రాథమిక పాఠశాలలను దశల వారీగా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిలో భాగంగా తొలివిడత గత విద్యా సంవత్సరం ఉన్నత పాఠశాలలకు అర కిలోమీటర్‌ దూరంలో గల 170 ప్రాఽథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఉన్నత పాఠశాలల్లో వసతి లేకపోవడంతో..గత ఏడాది ప్రాథమిక పాఠశాలల్లోనే బోధన కొనసాగించారు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల్లో ఒకరిద్దరు  మాత్రం ఉన్నత పాఠశాల యాజమాన్యం పరిధిలోకి వెళ్లిపోయారు. రెండో విడతలో ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో గల వాటిని గుర్తించాలన్న విద్యా శాఖ ఆదేశాల మేరకు 310 పాఠశాలలతో జాబితాను రూపొందించారు. గత ఏడాది ఎంపిక చేసిన 170తో కలిపితే మొత్తం 480 పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్టవుతుంది. అయితే విలీనం వల్ల ఎదురుకానున్న సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదనే వాదన ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో వసతి కొరత ఉంది. కొన్నిచోట్ల వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నగరంలోని తోటగరువు, గోపాలపట్నం, గాజువాక, ఆనందపురం వంటి ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క తరగతి గదిలో 50 నుంచి 80 వరకు విద్యార్థులు ఉంటున్నారు. చంద్రంపాలెంలో అయితే 100 మందికి మించి ఉంటున్నారు. ఇప్పుడు 3,4,5 తరగతి విద్యార్థులను కూడా ఉన్నత పాఠశాలలకు పంపితే...తరగతులు ఎక్కడ నిర్వహించాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంకా మూడు నుంచి పది వరకు మొత్తం ఎనిమిది తరగతుల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఉండడంతో బోధన, నిర్వహణ కష్టంగా మారనున్నది. విలీనంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం అయినా వసతి సమస్య కారణంగా కొన్ని ప్రాథమిక పాఠశాలలు అదేచోట కొనసాగవచ్చునని అంటున్నారు. కేవలం 3,4,5 తరగతులకు సంబంధించి బోధన, పాలన  ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పరిధిలోకి వెళతాయని కొందరు టీచర్లు చెబుతున్నా...మొత్తం ఈ విధానమే గందరగోళానికి దారితీస్తోందనే వాదన వినిపిస్తోంది. 


ఉన్నత పాఠశాలలకూ ఒత్తిడే...

గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 1,000 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. గతంలో నిర్మించిన గదులు కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్నత పాఠశాలకు ఒక కిలోమీటరు పరిధిలో గల గోపాలపట్నం వార్డు-1 ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థులు 150 మంది, ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో గల 100 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. రెండు ప్రైమరీ పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళితే  వసతి సరిపోతుందా? లేదా? అనే విషయం అధికారులు పరిశీలించలేదు. ఇప్పటికే ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత ఉంది. 

కొత్తపాలెం ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మూడు గదులు కావాల్సి ఉంది. ఈ సమయంలో కొత్తపాలెం ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల నుంచి 100 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళితే...వారందరికీ వసతి ఎక్కడన్నది ప్రఽధాన సమస్య. దీనికితోడు ఉన్నత పాఠశాల గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో పొలాల్లో ఉంది. గ్రామం నుంచి 3,4,5 తరగతి విద్యార్థులు అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. 

పెదగంట్యాడ మండలం నడుపూరు ఉన్నత పాఠశాలకు కిలోమీటరు దూరంలో ఉన్న నెల్లిముక్కు, బాలచెరువు, దుర్గవానిపాలెం, సీతానగరం, పెదకోరాడ, నడుపూరు, పెదగంట్యాడ, రామచంద్రపురం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఒకేసారి ఎనిమిది ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల పిల్లలు సుమారు ఆరేడు వందల మంది ఉన్నత పాఠశాలకు వెళితే అక్కడ వసతి, బోధన, నిర్వహణ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


నాడు నేడు-2లో అదనపు గదులకు ప్రతిపాదన 

నాడు-నేడు రెండో దశలో వసతి కొరత గల ఉన్నత పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. గదులు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలంటే కనీసం ఏడాది పడుతుంది. అందువల్ల వసతి సమకూర్చుకునే వరకు ప్రాథమిక పాఠశాలల విలీనంపై వేచి చూస్తే మంచిదని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. 


అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 323...

అనకాపల్లి జిల్లాలో ఎక్కువ ప్రాథమిక పాఠశాలలు...ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో ఉన్నాయి. ఆ జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 122, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 35 ప్రాథమిక పాఠశాలలు కిలోమీటరు దూరంలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి.

Updated Date - 2022-05-15T06:39:32+05:30 IST