ముందుంది ధరల భగభగ

ABN , First Publish Date - 2022-01-21T07:56:54+05:30 IST

కరోనా రాకముందు.. రూ.100 లోపు ఉన్నవంట నూనెల ధరలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల దాహానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ మైలురాయిని అధిగమించాయి!! పప్పు, ఉప్పు,..

ముందుంది ధరల భగభగ

ఇప్పటికే ధరల భగభగ.. సెగలు కక్కుతున్న చమురు ధర

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రజల నడ్డి విరగడం ఖాయం!

కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కల్లో నిత్యావసరాల ధరలు

ఇంకా పెరిగే ప్రమాద సూచన.. సొంతిల్లు మరింత ప్రియం

వణికిస్తున్న ఒమైక్రాన్‌.. ఆర్థికరంగానికి అన్నదాతేఆలంబన


కరోనా రాకముందు.. రూ.100 లోపు ఉన్నవంట నూనెల ధరలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల దాహానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ మైలురాయిని అధిగమించాయి!! పప్పు, ఉప్పు, చింతపండు... ఇలా నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఈ ధరల దెబ్బకే కుదేలవుతున్న సామాన్యులకు దుర్వార్త. ఇది ఇక్కడితో ఆగదని.. ద్రవ్యోల్బణం కోరలు చాస్తోందని, అంతర్జాతీయ విపణిలో పెట్రో ధరలు పెరుగుతున్నాయని.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న పెట్రో ధరలు.. ఎన్నికలు ముగియగానే ఒక్కసారిగా పడగ ఎత్తి బుసలు కొడతాయని, అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతాయని, సొంతిల్లు కలగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వాహనాల ధరలు, కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కారుచీకట్లో కాంతిపుంజంలా వ్యవసాయ రంగం ఒక్కటే ఆశానకంగా కనిపిస్తోందని, రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకోబోతున్నాడని చెబుతున్నారు!!


(‘ఆంధ్రజ్యోతి’ బిజినెస్‌ డెస్క్‌)

ఒక పక్క కొవిడ్‌. మరో పక్క ధరల సెగ. ఈ రెండింటి దెబ్బకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే వణికిపోతున్నారు. బియ్యం, పప్పు దినుసులు మొదలుకుని నిత్యావసరాల ధరలన్నీ చుక్కలంటుతున్నాయి. ధాన్యం దిగుబడులు పుష్కలంగా ఉన్నా.. కిలో సన్న బియ్యం మార్కెట్లో రూ.45కి తక్కువ దొరకడం లేదు. కిలో పప్పుల ధర ఎప్పుడో శతకం కొట్టేసింది. దిగుమతి సుంకాల తగ్గింపుతో పామాయిల్‌ వంట నూనె సెగ మాత్రమే కొద్దిగా తగ్గింది. మధ్య తరగతి ఎక్కువగా ఉపయోగించే పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్‌) నూనె మంట ఇంకా చల్లార లేదు. పండగ ఆఫర్లలోనూ సూపర్‌ మార్కెట్లలో ఐదు కిలోల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ డబ్బా రూ.710 నుంచి రూ.750 వరకు పలుకుతోంది. వేరుశనగ నూనెదీ ఇదే పరిస్థితి. టమోటా, దోస తప్ప మిగతా కూరగాయల ధరలూ ఇంకా చుక్కల్లోనే ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే సబ్బుల నుంచి మొదలుకుని అన్ని ఉత్పత్తుల ధరలను పెం చాయి. ఇప్పుడు ముడి సరుకుల ధరల పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో వీటి ధరలు ఇంకా పెంచక తప్పదని సంకేతాలిస్తున్నాయి. ఇక కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలు కూడా ఎఫ్‌ఎంసీజీ సంస్థలబాటలోనే న డుస్తున్నాయి. ఈ సంస్థలు కూడా ఇప్పటికే టీవీలు, ఫ్రి జ్‌లు, వాషింగ్‌ మెషీన్ల ధరలను 10ు వరకు పెంచాయి. మున్ముందు ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కలగానే సొంతిల్లు..

సిమెంట్‌, స్టీల్‌ ధరల భారంతో నిర్మాణ రంగమూ కష్టాల్లో పడింది. 2020 జనవరిలో రూ.350 ఉన్న 50 కిలోల సిమెంట్‌ బస్తా ఇప్పుడు రూ.430 నుంచి రూ.450 పలుకుతోంది. టన్ను స్టీలు ధర సైతం రూ.40,000 నుంచి రూ.60,000కు చేరింది. టన్ను ఇసుక ధరా రూ.3,000 నుంచి రూ.3,500 వరకు పలుకుతోంది. ఇటుకల ధర గత ఏడాది కాలంలో 30 నుంచి 40 శాతం పె రిగింది. దీంతో హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 30 శాతం వరకు పెంచక తప్పదని బిల్డర్లు చెబుతున్నారు. ఇక, కొవిడ్‌ తర్వాత చాలా మంది ప్రజా రవాణా కంటే.. సొంత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఇదే సమయంలో ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో కంపెనీలు వాహనాల ధరలు పెంచేశాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ధరలను 10 శాతం పెంచినా, ఇంకా నష్టాలు తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం లేకపోవడంతో ఈ నెలాఖరు లేదా మార్చిలోగా మరో విడత ధరల పెంపుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.


ఆరని పెట్రో మంట

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. నిన్నగాక మొన్న బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు 87.7 డాలర్లతో ఏడేళ్ల గరిష్ఠ స్థాయిని తాకింది. త్వరలోనే ఇది సెంచరీ కొట్టే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడిన భారత్‌ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బే. గత నెలన్నర రోజుల్లోనే బ్యారెల్‌ చమురు ధర 25ు పెరిగిపోయింది. బ్యారల్‌ ధర 10 డాలర్లు పె రిగితే భారత ద్రవ్య లోటు 0.10 శాతం పెరుగుతుందని అంచనా. అమెరికాతో సహా పలు దేశా లు తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి పెద్ద మొత్తంలో చమురు బయటికి తీసినా.. చమురు ధర చుక్కలనంటుంతుండటం విశేషం. చమురు ధర ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరినా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు గత రెండున్నర నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచలేదు. ప్రభుత్వ ఒత్తిడే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం కంపెనీలు వరసపెట్టి రోజూ ధరలు పెంచుకుంటూ పోయి ప్రజల నడ్డి విరగ్గొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ మరింత తగ్గిస్తే తప్ప.. ఈ బాదుడు తప్పక పోవచ్చు.  


’ఆర్థికం’ తలకిందులు

కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. కొన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఒమైక్రాన్‌ విజృంభణతో అది కూడా ప్రమాదంలో పడింది. పన్నుల వసూళ్లు తగ్గటంతో కేం ద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజుకారోజు అప్పులు చేసి నె ట్టుకొస్తున్నాయి. దీంతో 2025 కల్లా భారత్‌ను ఐదు లక్ష ల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్మమూ మరో ఐదేళ్లు వెనక్కి పోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. బ్రిటన్‌లోనూ 30 ఏళ్ల గరిష్ఠ స్థాయిని తాకింది. భారత్‌లోనూ 2021 డిసెంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ఠ స్థాయి 5.59 శాతానికి చేరింది. ఈ నెలలో ఇది ఆరు నుంచి ఆరున్నర శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా.


ఆర్‌బీఐకి కత్తిమీద సామే.. 

గత నాలుగేళ్లుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4-6 శాతం మధ్య కట్టడి చేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌.. ఈ సంవత్సరం మూడుసార్లు వడ్డీ రేట్లు పెంచబోతోంది. యూరోపియన్‌ సెం ట్రల్‌ బ్యాంక్‌దీ ఇదే పరిస్థితి. ఈ ప్రభా వం ఆర్‌బీఐపైనా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రారంభమైతే భారత్‌తో పాటు అన్ని వర్థమాన దేశాల మార్కెట్లలో ఎఫ్‌పీఐల అమ్మకా లు మరింత జోరందుకుంటాయని భావిస్తున్నారు. అదే జరిగితే 2013లోలా భారత స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ పెద్ద దిద్దుబాటుకు (కరెక్షన్‌) లోనయ్యే అవకాశం ఉందని అంచనా. 


వ్యవ‘సాయ’మే..

ధరల పెరుగుదల, ఒమైక్రాన్‌ భ యాలతో దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశ పరుస్తున్నాయి. అయితే వరుణుడి కరుణతో వ్యవసాయ రంగం ఒక్కటే ఆశాజనకంగా కనిపిస్తోంది. అనేక పంటలకు మద్దతు ధర ఎండమావుల్లా కనిపిస్తున్నా, రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకోబోతోతున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల దిగుబడులు పెరిగాయి. దీంతో ఆహార ద్రవ్య్లోల్బణానికి చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.


ద్రవ్యోల్బణం అదుపులో ఉండబట్టే, ఆర్‌బీఐ గత రెండేళ్లుగా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉంచగలిగింది.

- రఘురామ్‌ రాజన్‌, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌

చమురు ధర 10 శాతం పెరిగితే మూలధన ఖాతా లోటు (సీఏడీ) 1,500 కోట్ల డాలర్ల మేర (జీడీపీలో 0.4 శాతం) పెరుగుతుంది. అది రూపాయి మారకం రేటునీ దెబ్బతీస్తుంది.

- మదన్‌ సబ్నవిస్‌, ఆర్థికవేత్త, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

కొవిడ్‌ మూడో ఉధృతి, ఏటీఎఫ్‌ ధరల పెంపుతో దేశీయ విమానయాన సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువ. 

- క్రిసిల్‌ 

ఒమైక్రాన్‌తో బ్యాంకు రుణాల చెల్లింపు, వాటి లాభాలు దెబ్బతినటంతో పాటు వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది.

 - అనిల్‌ గుప్తా, ఇక్రా రేటింగ్స్‌

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ద్రవ్య లోటు తగ్గించడం కంటే.. వినియోదారులు చేతు ల్లో నాలుగు డబ్బులు పెట్టడంపై దృష్టి పెట్టాలి.

- సంజీవ్‌ మెహతా, సీఎండీ, హెచ్‌యూఎల్‌

Updated Date - 2022-01-21T07:56:54+05:30 IST