ప్రచారం చేయకుండా రాహుల్‌ను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-03-05T11:48:43+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొనకుండా అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కోరింది. ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించారని ఆరోపించింది. అంతేగాక యువతను

ప్రచారం చేయకుండా రాహుల్‌ను అడ్డుకోండి

ఎన్నికల నియామవళి ఉల్లంఘించారు

యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు

ఈసీకి తమిళనాడు బీజేపీ శాఖ వినతి


చెన్నై, మార్చి 4: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొనకుండా అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కోరింది. ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించారని ఆరోపించింది. అంతేగాక యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించిన రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి విన్నవించింది. గురువారం తమిళనాడు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యవ్రత సాహూకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ వ్యవహారాల బాధ్యుడు వి.బాలచంద్రన్‌ మాట్లాడుతూ.. ఈ నెల 1న కన్యాకుమారి జిల్లాలో ములగుమూడులోని సెయింట్‌ జోసెఫ్‌ మ్యాట్రిక్‌ ఉన్నత విద్య పాఠశాల సముదాయంలో రాహుల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల నియామవళికి విరుద్ధమన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాలని యువతను రెచ్చగొట్టేలా రాహుల్‌ ప్రసంగించారని, ఆయనపై 109, 124ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని స్వాతంత్య్రం రాకమునుపు బ్రిటీష్‌ పాలనతో పోల్చారని విమర్శించారు. బ్రిటీష్‌ వారితో పోరాడినట్టుగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాల్సిన అవసరముందని రాహుల్‌ వ్యాఖ్యానించారని తెలిపారు. దేశ ప్రజల్లో భయం, ఆగ్రహం నెలకొందని.. నిర్భయంగా, సుఖసంతోషాలతో భారత్‌ ఉండేలా చేసేందుకు పోరాడాలని రాహుల్‌ యువతను ఉద్దేశించి మాట్లాడారని వి.బాలచంద్రన్‌ విమర్శించారు. రాహుల్‌ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. 

Updated Date - 2021-03-05T11:48:43+05:30 IST