వంట నూనె ధరల మంటకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-09-12T08:08:03+05:30 IST

ధరల పెరుగుదలతో సలసలా కాగుతూ సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్న వంట నూనెలు కొంత చల్లారనున్నాయి.

వంట నూనె ధరల మంటకు అడ్డుకట్ట

ముడి పామాయిల్‌, సన్‌ ఫ్లవర్‌, సోయా నూనెలపై 5.5ు కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు

రిఫైన్డ్‌ ఆయిల్స్‌పైనా అంతే మొత్తంలో కుదింపు

లీటరు రూ.5 వరకు తగ్గనున్న ధర.. సామాన్యుడికి రూ.2-3 మాత్రమే..!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ధరల పెరుగుదలతో సలసలా కాగుతూ సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్న వంట నూనెలు కొంత చల్లారనున్నాయి. గత ఏడాది కొవిడ్‌ కాలంలో ఒక్కసారిగా 50ు పెరిగిన వంటనూనెల ధరలు కొంత మేర తగ్గనున్నాయి. ఈ మేరకు పామాయిల్‌, సొయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ముడి, రిఫైన్డ్‌ నూనెలపై సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రకాల నూనెలపై బేసిక్‌ డ్యూటీని 5-7.5ు వరకు తగ్గించి, ఒక్క ముడి పామాయిల్‌పైన మాత్రం అగ్రిసె్‌సను 2.5ు పెంచి.. మొత్తంగా ఒక్కోదానిపై 5.5ు మేర కుదింపును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు శనివారం నుంచే అమలవుతాయని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో ముడి పామాయిల్‌పై మొత్తం పన్ను 30.25ు నుంచి 24.75 శాతానికి దిగి వచ్చింది. అదేవిధంగా క్రూడ్‌ సొయాబీన్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై సుంకం 30.25ు నుంచి 24.75శాతానికి, రిఫైన్డ్‌ పామాయిల్‌, సొయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 41.25ు నుంచి 35.75శాతానికి సుంకాలు తగ్గాయి.


వాస్తవానికి కొన్ని నెలలుగా వంట నూనెలపై దిగుమతి సుంకాలను కేంద్రం కుదిస్తూ వస్తోంది. రూ.11 వేల కోట్లతో ప్రత్యేకంగా ‘పామాయిల్‌ మిషన్‌’ను ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం తీసుకున్న చర్యల ఫలితాన్ని విశ్లేషించి.. సెప్టెంబరు నెల తర్వాత దిగుమతి సుంకాల తగ్గింపును కొనసాగించాలా? వద్దా? నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. నూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపుతో కేంద్రం రూ.14,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో సగటున లీటరుకు నూనెపై రూ. 18 దాకా ధర తగ్గే అవకాశాలున్నాయి. అయితే.. సామాన్య వినియోగదారులకు తగ్గే ధర కొంతమేరే ఉంటుందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ముడి, రిఫైన్డ్‌ నూనెలను దిగుమతి చేసుకునే వ్యాపారుల గోదాముల అద్దెలు, ప్యాకేజీ ఖర్చులు, లేబర్‌ కూలీలు.. ఇలా అన్నీ కలుపుకొని, కొంత మార్జిన్‌ చూసుకుని, హోల్‌సేలర్లకు విక్రయాలు జరుపుతారు. దానిపై జీఎస్టీ ఉంటుంది. హోల్‌సేలర్లు తమ మార్జిన్‌ను చూసుకుని రిటైలర్లకు.. రిటైలర్లు తమ లాభాలను చూసుకుని, వినియోగదారులకు విక్రయిస్తారు. మొత్తమ్మీద ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే లీటరుపై రూ.5 దాకా తగ్గే అవకాశాలున్నాయని సాల్వెంట్‌ ఎస్ట్ర్కాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీవీ మెహతా విశ్లేషిస్తున్నారు. వినియోగదారుడి విషయంలో రూ.2 నుంచి రూ.3 దాకా తగ్గింపు ఉండొచ్చంటున్నారు. ఆవ నూనెపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోండి

తాజా చర్యల నేపథ్యంలో టోకు వ్యాపారులు, మిల్లర్లు, రిఫైనర్లు, నిల్వదారుల నుంచి నూనెలు, నూనె గింజల వివరాలను తెలుసుకుంటూ సమీక్ష చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వినియోగదారుల ప్రయోజనార్థం.. రిటైల్‌ దుకాణాల వద్ద అన్ని రకాల వంట నూనెల ధరల పట్టికను ప్రముఖంగా ప్రదర్శించేలా చూడాలని నిర్దేశించింది. దీనికితోడు టోకు వర్తకులు, మిల్లర్లు, రిఫైనర్లు అక్రమంగా నిల్వ చేయకుండా చూడాలని పేర్కొంది. రాష్ట్రాల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన భేటీలో ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే సూ చించారు. వ్యాపారులకు నిల్వ పరిమితిని విధించాలని.. నూనెల గరిష్ఠ చిల్లర ధరను నిర్ణయించాలని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-12T08:08:03+05:30 IST