సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2022-08-16T06:00:54+05:30 IST

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ తెలిపారు.

సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట
జాతీయజెండాకు వందనం చేస్తున్న మంత్రి మహమూద్‌ అలీ, అధికారులు

సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు

సీఎం హామీ మేరకు రూ.527 కోట్లు మంజూరు

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రూ.4,427 కోట్ల కేటాయింపు

శరవేగంగా మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులు

స్వాతంత్య్ర వేడుకల్లో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్ని జాతీయ పతాకావిష్కరణ కావించారు. అనంతరం జిల్లా ప్రజలనుఉద్దేశిం, హోంశాఖ మంత్రి మహ మూద్‌ అలీ మాట్లాడుతూ సైబర్‌ నేరాల దర్యాప్తు కోసం జిల్లాలో సైబర్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో 784 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

నారాయణఖేడ్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు రూ.527 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో పనులు పురోగతిలో ఉన్నాయి. 

సింగూరు ప్రాజెక్టుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ప్రభుత్వ రూ.4,427 కోట్లు కేటాయించింది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే జిల్లాలో మూడు లక్షల ఎకరాల సాగుకు నీరందనున్నది. 

సంగారెడ్డి జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు మరణించిన 5,372 మంది రైతులకు బీమా పథకం ద్వారా రూ.268.60 కోట్లను వారి నామినీ ఖాతాల్లో జమ చేశాం. 

జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్‌ కాలేజీలను ఈ ఏడాది నుంచే ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.510 కోట్లు మంజూరు చేసింది. కాలేజీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేశాం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులతో సేవలందిస్తున్నాం. జిల్లాలో 13 బస్తీ దవాఖానాలతో ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నాం. 

సంగారెడ్డిలో డయాగ్నస్టిక్‌ హబ్‌ను ఏర్పాటు చేసి, 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. 

కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా మన బడి-మనబస్తీ కార్యక్రమం ద్వారా 441 పాఠశాలలను ఎంపిక చేశాం. వీటి మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.172 కోట్లు మంజూరయ్యాయి. 

57 ఏళ్లకే పెన్షన్‌ను ఈ రోజు నుంచే అమలు చేస్తుండడం వల్ల జిల్లాలో కొత్తగా 41,981 మందికి ఆసరా లభించనున్నది. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 345 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ.29 కోట్లు మంజూరు చేశాం. మహిళలకు బ్యాంక్‌ రుణాల మంజూరులో జిల్లా రాష్ట్రంలో మెదటి స్థానంలో నిలిచింది. 

అంతకు ముందు మంత్రి మహమూద్‌ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు కవాతును పరిశీలించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి,  ఎంపీ బీబీ పాటిల్‌, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, ఆర్డీవో మెంచు నగేశ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌ తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


అంబరాన్నంటిన వేడుకలు

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ హాజరై మాట్లాడారు. అనంతరంస్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను శాలువాలు, పూలమాలలతో సన్మానించా, జ్ఙాపికలను అందజేశారు. వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయా పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేశభక్తిని చాటి చెప్పే జాతీయ గీతాలతో విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ, జిల్లా పంచాయతీ, అటవీశాఖ, పురపాలక, ఎన్‌సీ అభివృద్ధిశాఖ, మహిళా శిశుసంక్షేమ, అగ్నిమాపక తదితర శాఖలకు చెందిన పలు శకటాలను ప్రదర్శించారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఎంపీ బీబీపాటిల్‌, కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయ, మట్టి నమూనాలు, ఎస్‌సీ అభివృద్ధి, అటవీ, మత్స్యశాఖ తదితర శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించి, అధికారులను అభినందించారు.  ప్రభుత్వం కొత్త గా మంజూరు చేసిన ఆసరా లబ్దిదారులకు  మంత్రి    మహమూద్‌అలీ ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు.  

   కలెక్టర్‌   నివాసంలో  తేనీటి విందు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌ తన నివాసంలో సోమవారం సాయం త్రం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ నివాసంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తేనీటి విందుకు హాజరైన ప్రముఖులకు కలెక్టర్‌ శరత్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్‌డీవో శ్రీనివా్‌సరావు, వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, ఆర్‌డీవో మెంచు నగేశ్‌, ఎస్‌సీ అభివృద్ధి శాఖ అధికారి బాబురావు, డీఈవో రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

జెండా పండుగ నాడు విషాదం 

ఏర్పాట్లు చేస్తుండగా ఘటన


పటాన్‌చెరు, ఆగస్టు 15: జెండా పండుగ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పటాన్‌చెరు పారిశ్రామి వాడ ఇంద్రేశం ఆనంద్‌నగర్‌ కాలనీలో సోమవారం జాతీయ పతాకావిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఇద్దరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన పూజారి అనిల్‌కుమార్‌గౌడ్‌(40) పొట్టకూటి కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ఏటీఎం ఇంజనీర్‌గా పనిచేస్తూ రెండేళ్ల క్రితం ఇంద్రేశం ఆనంద్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. అతడికి భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కడప జిల్లాకు చెందిన తిరుపతి(42) ఉపాధి నిమిత్తం ఇంద్రేశం వచ్చాడు. ఆయనకు ఇంకా వివాహం కాలేదని తెలిసింది. ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు చేరదీసి ప్లంబింగ్‌ పని ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం ఆనంద్‌నగర్‌లో జెండాను ఎగురవేసేందుకు స్థానికులతో కలిసి అనిల్‌కుమార్‌గౌడ్‌, తిరుపతి ఏర్పాట్లు చేస్తున్నారు. జెండాను కట్టిన ఇనుప పైప్‌ను అనిల్‌కుమార్‌, తిరుపతితో పాటు ధనుంజయ్‌  పైకి ఎత్తే ప్రయత్నం చేస్తుండగా.. పై నుంచి వెళ్లిన 11కేవీ విద్యుత్‌వైర్లకు తగిలింది. విద్యుత్‌ వైర్లకు పైపు తగులుతుండడాన్ని స్థానికులు గమనించి హెచ్చరిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే స్థానికుల హెచ్చరికతో ధనుంజయ్‌ జెండా పైప్‌ను వదిలివేయడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. విగతజీవులుగా పడిపోయిన అనిల్‌కుమార్‌గౌడ్‌, తిరుపతిలను పటాన్‌చెరు మార్కెట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, డీఎస్పీ భీంరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాఽధత కుటుంబ సభ్యులను ఓదార్చారు. 



Updated Date - 2022-08-16T06:00:54+05:30 IST