రాష్ట్రపతి పాలన?

ABN , First Publish Date - 2022-06-27T09:01:23+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోందా? అంటే..

రాష్ట్రపతి పాలన?

మహారాష్ట్రలో శాంతిభద్రతల సాకుతో విధించే అవకాశం!

ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు

బలగాలను సిద్ధం చేయాలంటూ కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్‌ కోష్యారీ లేఖ

ఇప్పటికే నవీముంబైలోని తలోజాబేస్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి: బీజేపీ వర్గాలు

రాష్ట్రపతి పాలన అవకాశమే లేదు: పవార్‌

‘మహా’ సర్కారు 2, 3 రోజుల్లో కూలుతుంది

కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దాన్వే జోస్యం

షిండే శిబిరానికి చేరిన మరో మంత్రి

అనర్హతపై సుప్రీంకు షిండే.. నేడు విచారణ!


ముంబై, జూన్‌ 26: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోందా? అంటే.. జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో శాంతిభద్రతలను సాకుగా చూపి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. నిఘా వర్గాల సూచన మేరకు 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలకు

వైప్లస్‌ కేటగిరీ భద్రత, వారి కుటుంబాలకు రక్షణ కల్పి స్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. ‘కేంద్ర బలగాల ను సిద్ధం చేయండి’ అంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ లేఖ రాయడం వంటివి అందులో  భాగమేనని వారంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై దాడు లు జరుగుతుంటే మహారాష్ట్ర పోలీసులు మౌనం గా నిలబడ్డారని, పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర బలగాలను పంపాలని గవర్నర్‌ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. శివసేనకు చెందిన 38 మంది(రెబెల్‌) ఎమ్మెల్యేలు, ప్రహార్‌ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి 25వ తేదీన తనకు ఒక లేఖ అందిందని, తమ కుటుంబాల భద్రత గురించి వారంతా ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో 4 రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న గవర్నర్‌ ఆదివారం ఇంటికి చేరుకున్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీ రజనీష్‌ సేథ్‌కు కూడా కోష్యారీ లేఖ రాశారు. కాగా, గవర్నర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాసే సమయానికే కేంద్ర బలగాలు నవీముంబైలోని తలోజా బేస్‌కు చేరుకున్నట్టు బీజేపీకి చెందిన అగ్రనేత ఒకరు తెలిపారు. ఏక్‌నాథ్‌ షిండే, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు గువాహటి నుంచి ముం బైకి చేరుకోగానే వారిని రాజ్‌భవన్‌ దాకా తీసుకెళ్లేందుకే ఆ బలగాలు ముంబైలో దిగినట్టు ఆయన వివరించారు. కాగా.. కేంద్రం వై ప్లస్‌ భద్రత కల్పించిన నేతల్లో అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ షిండే లేకపోవడం గమనార్హం. నిఘా వర్గాల ప్రకారం భద్రత అవసరమైన ఎమ్మెల్యేలకే ఆ రక్షణ కల్పించినట్టు హోం శాఖ అధికారులు తెలిపారు. వారు గువాహటి నుంచి ముంబైకి చేరుకున్న మరుక్షణం నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నలుగురైదుగురు చొప్పున సీఆర్పీఎఫ్‌ కమాండోలు రక్షణగా ఉంటారని వెల్లడించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న వాదనను ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కొట్టిపారేశారు. మహావికాస్‌ అఘాడీ కూటమి నేతలతో ఆదివారం రహస్య భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటును కోరుకుంటారు. రాష్ట్రపతి పాలన విధిస్తే అంతమంది ఎమ్మెల్యేలను ఒక చోటు నుంచి మరోచోటుకు తిప్పడంలో అర్థమేముంది’’ అన్నారు. ‘‘రెబెల్‌ ఎమ్మెల్యేలకు అంత సంఖ్యాబలమే ఉంటే గువాహటిలో ఉండడం ఎందుకు? ముంబైకి వచ్చి ప్రజాస్వామిక విధానంలో తమ బలం నిరూపించుకోవాలి’’ అని పవార్‌ సవాల్‌ చేశారు. రెబెల్స్‌పై చర్యలు తీసుకునే అధికారాన్ని కూటమి తరఫున ఠాక్రేకు అప్పగించామని, ఒకట్రెండు రోజుల్లో చర్యలుంటాయని వివరించారు. ఠాక్రే నాయకత్వంపై కూటమి భాగస్వాములందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందని, చివరిదాకా తమ మద్దతు ఆయనకే ఉంటుందని పవార్‌ స్పష్టం చేశారు.    


మరో మంత్రి జంప్‌..

ఉద్ధవ్‌ క్యాబినెట్‌లోని మరో మంత్రి ఉదయ్‌ సామంత్‌.. షిండే గూటికి చేరారు. గువాహటికి చేరిన తొమ్మిదో మంత్రి ఆయన. గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, సందీపన్‌ భుమ్రే, సహాయమంత్రులు శంభూరాజే దేశాయ్‌, అబ్దుల్‌ సత్తార్‌(వీరంతా శివసేన ఎమ్మెల్యేలు), బచ్చు కాడు (ప్రహార్‌ జనశక్తి పార్టీ), రాజేంద్ర యడ్రావర్కర్‌ (ఇండిపెండెంట్‌, శివసేన కోటా మంత్రి) ఇప్పటికే షిండే గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇక.. షిండే స్వయంగా క్యాబినెట్‌ మినిస్టర్‌. దీంతో అసమ్మతి శిబిరంలో 9 మంది మంత్రులు ఉన్నట్టయింది. దీంతో ఉద్ధవ్‌ క్యాబినెట్‌లో శివసేన నుంచి మంత్రిగా ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఆదిత్య ఠాక్రే నిలిచారు. 


నయాన.. భయాన..

రెబెల్‌ ఎమ్మెల్యేలపై శివసేన త్రిముఖవ్యూహంతో ముందుకెళ్తోంది. అసమ్మతి నేతలపై ఒకవైపు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పరుష పదజాలంతో విరుచుకుపడుతుండగా.. పార్టీ శ్రేణులు రెబెల్స్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయా నేతల భార్యలను బుజ్జగించడానికి ఉద్ధవ్‌ భార్య రష్మి ఠాక్రే రంగంలోకి దిగారు. ఇంకోవైపు.. రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతోపాటు, మంత్రులను పదవుల నుంచి తొలగించడానికిపార్టీపరమైన, ప్రభుత్వపరమైన చర్యలను వేగవంతం చేశారు. ఆదివారం పార్టీశ్రేణులతో మాట్లాడిన సంజయ్‌ రౌత్‌, ఆదిత్య ఠాక్రే.. షిండే శిబిరంపై నిప్పులు చెరిగారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు ఇంకా ఎన్నాళ్లు గువాహటిలో దాక్కుంటారని రౌత్‌ ప్రశ్నించారు. అసమ్మతి నేతల ఆత్మ, మనసు చనిపోయాయని, వట్టి శరీరాలు మిగిలాయని.. 40 దేహాలు అసోం నుంచి వస్తాయని, వాటిని నేరుగా పోస్ట్‌మార్టమ్‌కు పంపుతామని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రెబెల్స్‌కు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి ప్రజాతీర్పు కోరాలి’’ అని సవాల్‌ చేశారు. ఇక.. రెబెల్‌ ఎమ్మెల్యేలకు విపరీత లక్ష్యాలున్నాయని, పార్టీ తలుపులు వారికి మూసుకుపోయాయని ఆదిత్య ఠాక్రే ధ్వజమెత్తారు. గువాహటికి ఎమ్మెల్యేలను ఖైదీలుగా తీసుకెళ్లారని.. ఇప్పటికీ 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆదిత్య తెలిపారు. తిరుగుబాటు చేసిన మంత్రుల్లో ఏక్‌నాథ్‌ షిండే, గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసేతోపాటు, అబ్దుల్‌ సత్తార్‌, శంభూరాజ్‌ దేశాయ్‌ తమ మంత్రి పదవులు కోల్పోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. ఉద్ధవ్‌ ఠాక్రే భార్య రష్మి ఠాక్రే తిరుగుబాటు నేతల భార్యలతో మాట్లాడేందుకు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్క రెబెల్‌ ఎమ్మెల్యే భార్యకూ ఫోన్‌ చేసి.. ఎలాగైనా నచ్చజెప్పి వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా రష్మి ఠాక్రే వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. కారణాలేవైనాగానీ, ప్రస్తుతం రెబెల్‌ ఎమ్మెల్యేల్లో 20 మంది వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే రాష్ట్రపతి పాలన విధించడం కష్టమవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇక.. తనకు, మరో 15 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులపై షిండే సుప్రీంను ఆశ్రయించారు.  


బాంబు దాడులతో అమాయకులైన ముంబైవాసులను చంపిన దావూద్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నవారికి.. హిందూ హృదయసామ్రాట్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే శివసేన ఎలా మద్దతిస్తుంది? అలా చేయడాన్ని వ్యతిరేకించేందుకే మేం ఇలా చేశాం. ఇది మమ్మల్ని మృత్యువు సమీపానికి తీసుకెళ్లినా మాకు బాధ లేదు.     

   - తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే

Updated Date - 2022-06-27T09:01:23+05:30 IST