Abn logo
Sep 12 2021 @ 02:17AM

కోర్టుల్లో మహిళకు మరింత పాత్ర!

సమ్మిళిత ఆదర్శాల సాధనకు తప్పనిసరి 

సుప్రీంలో ఒకేసారి ముగ్గురు మహిళా జడ్జిల నియామకం చరిత్రాత్మక సందర్భం: రాష్ట్రపతి 

శిథిల భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయి

బ్రిటిషర్లు వెళ్లాక సౌకర్యాల వృద్ధిలో విఫలం

పరిస్థితి మార్చేందుకే మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళలు సహా ఒకేసారి 9 మంది న్యాయమూర్తుల నియామకం న్యాయ వ్యవస్థలోనే చరిత్రాత్మక సందర్భమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండటం కూడా ఇదే ప్రథమమని గుర్తు చేశారు. ఈ నియామకాలతో భవిష్యత్తులో సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తి నియామకానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. రాజ్యాంగ సమ్మిళిత ఆదర్శాలను సాధించడానికి న్యాయ వ్యవస్థలో మహిళల పాత్రను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రపతి ప్రయాగరాజ్‌లో నూతన న్యాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి, అలహాబాద్‌ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ సహా అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరిగినపుడే న్యాయపూర్వకమైన సమాజం ఏర్పాటు సాధ్యమవుతుందని చెప్పారు. 


సమర్థవంతంగా పని చేయలేక పోతున్నారు

సరైన సౌకర్యాలు లేకపోవడం, పాతబడిన, శిథిలావస్థలో ఉన్న భవనాలలో న్యాయం అందించాల్సి రావడం వంటి దుస్థితి నుంచి న్యాయవ్యవస్థను రక్షించేందుకు జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఏర్పాటుకు అత్యంత  సమగ్ర ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటించారు. బ్రిటిష్‌ వారు ఈ దేశం నుంచి వెళ్లిపోయాక దేశంలో న్యాయస్థానాలకు మంచి మౌలిక సదుపాయాలు అందించడంలో మనం విఫలమయ్యామని వ్యాఖ్యానించారు. అలహాబాద్‌ హైకోర్టులో బహుళ అంతస్తుల పార్కింగ్‌, న్యాయవాదుల ఛాంబర్ల సముదాయం నిర్మించడాన్ని ఆయన ప్రశంసించారు. మహిళ లు, దివ్యాంగుల అవసరాలను కూడా గుర్తించినందుకు అభినందించారు. అలహాబాద్‌ హైకోర్టులో సుదీర్ఘ కాలం క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉండడంపై జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తపరిచారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఇక్కడి బార్‌ చెరగని ముద్ర వేసిందన్నారు. రాజ్యాం గ ముసాయిదా రూపకల్పనలో పాత్ర పోషించిందని చెప్పారు. ఒకప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఆమెను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జగమోహన్‌ లాల్‌ సిన్హా అత్యంత సాహసంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని జస్టిస్‌ రమణ గుర్తు చేసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆర్బిట్రేషన్‌(మధ్యవర్తిత్వం)కు సంబంధించిన బిల్లును  ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఆర్బిట్రేషన్‌ కార్యకలాపాలలో ప్రపంచస్థాయిలో భారత్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.