Abn logo
Aug 6 2020 @ 15:20PM

ఒక్క పూటలోనే ముర్మూ రాజీనామా... ఎందుకింత మార్పు అంటే...!

శ్రీనగర్ : గిరీశ్ చంద్ర ముర్ము. ముక్కుసూటిగా దూసుకుపోయే అధికారి అని పేరుంది. అంతేకాకుండా నిక్కచ్చిగా కూడా వ్యవహరిస్తారని అంటుంటారు. 1985 బ్యాచ్ అధికారి. గుజరాత్ కేడర్‌కు చెందినవారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో సమర్థవంతమైన పాత్ర పోషించారు. దీని దృష్ట్యా ఆయన్ను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.


అయితే సంవత్సరం తిరగకుండానే ఆ పదవికి గిరీశ్ చంద్ర ముర్మూ హుటా హుటిన రాజీనామా సమర్పించారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. తరువాతి ఎల్జీగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కేవలం ఒక్క పూటలోనే ఇదంతా జరిగిపోయింది. ఎందుకిలా జరిగిందనేదే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


మామూలుగా అయితే... బుధవారం మధ్యాహ్నం వరకూ ఈయన రాజీనామా అంశం తెరపైకే రాలేదు. ఆ రోజు వరకూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో యథావిథిగానే పాల్గొన్నారు. అయితే... సాయంత్రం నుంచే పరిణామాలు వేగంగా మారిపోయాయి. సాయంత్రం షెడ్యూల్ అయిన... ఆ సమావేశాలన్నీ రద్దయ్యాయి. గురువారం ఉదయమే... ఢిల్లీకి చేరుకున్నారు. రాజీనామా చేసేశారు. ఇంత హడావుడిగా జరిగిన పరిణామాలపై అందరూ తీవ్ర ఉత్కంఠతకు లోనవుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎల్జీగా ఇన్ని రోజుల పాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (ముర్మూ) ఉండేవారు. ఇప్పుడు మనోజ్ సిన్హా. పక్కా రాజకీయ నేత. జమ్మూ కశ్మీర్ లో ఎప్పుడూ రాజకీయాలు వేడి వేడిగానే ఉంటాయి. వీటిని హ్యాండిల్ చేయడం ఓ బ్యూరోక్రాట్‌కు సాధ్యమయ్యే పని కాదని, పూర్తి రాజకీయ వేత్త అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలడని కేంద్రం భావించి... ఈ మార్పును చేసినట్లు సమాచారం.


ఇటు ప్రజలకు దగ్గరగా ఉంటూనే, మరోవైపు పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి ఉంటుందని, ఈ రెంటి మిళితమే మనోజ్ సిన్హా అని.. అందుకే మనోజ్ సిన్హాను నియమించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ‘‘ఇప్పుడు మనోజ్ సిన్హాతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపా. ఇటు రాజకీయం... అటు పరిపాలన... రెండూ మిళితమైన వ్యక్తి.’’ అని ఆయన పేర్కొన్నారు.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌ను కాస్త డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలని మోదీ,షా తలపోశారు. అందుకే అటు పరిపాలన, ఇటు రాజకీయం రెండూ.. .పోతపోసిన వ్యక్తిని తెరపైకి తెచ్చారు. ఇక.... దీంతో పాటు ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీన్ని పూరించడానికి కూడా మనోజ్ సిన్హా ఉపయోగపడతారని కేంద్రం భావిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. 


అంతేకాకుండా లోయలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడంపై మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ముర్మూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘‘ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ ను ఎలా ఉపయోగించుకుంటారో అని నేను భయపడుతున్నా’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర హోంశాఖకు అంతగా రుచించలేవని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.


జమ్మూ కశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ముర్ము రాజీనామాకు దారి తీశాయని ఢిల్లీ వర్గాల సమాచారం. అంతేకాకుండా ముర్ము ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. స్థానికంగా ఉండే సీనియర్ ఐఏఎస్‌లతో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ముర్ముపై కుప్పలు తెప్పలుగా కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయని అధికారులు వెల్లడించారు.


‘‘ముర్మూ కారణంగా అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరినొకరు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. ఈ అభిప్రాయ భేదాలు పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.’’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా ముర్మును రాజీనామా చేయించి.... వారి స్థానంలో మనోజ్ సిన్హాను నియమించినట్లు సమాచారం. 


Advertisement
Advertisement
Advertisement