భూముల రీ సర్వేకు సిద్ధం

ABN , First Publish Date - 2020-06-05T09:23:16+05:30 IST

గత ప్రభుత్వాల హయాంలో భూవివాదాలకు ముగింపు పలికేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.

భూముల రీ సర్వేకు సిద్ధం

అమలుపై రెవెన్యూలోనే సందేహాలు 

సీవోఆర్‌పీఎస్‌ టెక్నాలజీపై అవగాహన శూన్యం

గతంలో చేపట్టిన వాటిలో ఏదీ సంపూర్ణంగా జరగిన వైనం 

కిందటి ఏడాది చేపట్టిన భూమి రికార్డుల స్వచ్ఛీకరణ ఏమైనట్ల్లో?


భూమి రికార్డుల స్వచ్ఛీకరణ.. చుక్కల భూములు.. భూధార్‌.. మీ ఇంటికి మీ భూమి.. మీభూమి.. కార్యక్రమాలు ఏమయ్యాయో తెలియదు. ఈ సారి భూముల రీ సర్వే అని ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఎప్పుడో బ్రిటీష్‌ పరిపాలనలో జరిగిన భూముల సర్వే ప్రక్రియని తిరిగి రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. అయితే ఈ నిర్ణయం అమలు పైనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. రెవెన్యూకు సంబంధించి వివిధ సంఘాలు, విశ్రాంత అధికారుల సలహాలు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వం రీ సర్వే నిర్ణయాన్ని ప్రకటించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


గుంటూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వాల హయాంలో భూవివాదాలకు ముగింపు పలికేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఏ ఒక్కటి కూడా సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. ప్రజలకు ఆధార్‌ వలే భూమికి కూడా భూధార్‌ ఇచ్చే ప్రక్రియ కూడా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. వాస్తవానికి ఆ ప్రక్రియ ఈ ఏడాది మే నెలతో పూర్తి కావాల్సి ఉన్నది. అయితే గత ఏడాది ఆఖరులోనే ఆ కార్యక్రమానికి మంగళం పాడేశారు. ఆ తర్వాత పేదలందరికి ఇళ్ల పట్టాల పంపిణీ, కరోనా లాక్‌డౌన్‌లో అధికారులు నిమగ్నమైపోయారు. ఇదిలావుంటే హఠాత్తుగా భూముల రీ సర్వే ఉత్తర్వులను వెలువరించడంపై పలు సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. గతంలో టోటల్‌ స్టేషన్‌, డిజిటల్‌ విధానాలను అవలంభించారు. ఈ దఫా సీవోఆర్‌పీఎస్‌ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోన్నది. దీనిపై రెవెన్యూవర్గాలకు ఎలాంటి అవగాహన లేదు.


భూముల రీసర్వే అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, అందుకోసం సన్నద్ధత ఎంతో ముఖ్యమని చెబుతోన్నారు. అదేమి లేకుండా జీవో ఇచ్చేయడాన్ని చూస్తుంటే మమ అనిపించడం లానే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోన్నది. గతంలో భూమి రికార్డుల స్వచ్ఛీకరణ, చుక్కల భూములు, భూధార్‌, మీ ఇంటికి మీ భూమి, మీభూమి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటిల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకొన్న భూముల రీసర్వే విషయంలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఖాతాదారులు కోరుతున్నారు. 


యథాతథంగానే భూ వివాదాలు 

జిల్లాలో రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌), వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌కు మధ్యన భారీగానే వ్యత్యాసం ఉన్నది. జిల్లాలోని 727 గ్రామాల్లో వెబ్‌ల్యాండ్‌ ప్రకారం మొత్తం 24,59,534 సర్వే నెంబర్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ భూమి 3,89,253 ఎకరాలు ఉన్నది. పట్టాభూమి 20,20,492 ఎకరాలుగా ఉన్నది. ఇనాం భూమి 11,812 ఎకరాలు, ఇతర కేటిగిరీలకు చెందినవి 80,079 ఎకరాలు ఉన్నది. మొత్తం కలిపి 25,01,638 ఎకరాల భూమి ఉన్నది. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌లో మాత్రం 24,23,947 ఎకరాలు మాత్రమే ఉన్నది. 77,690 ఎకరాల భూమి వ్యత్యాసం ఉన్నది. ఈ కారణంగానే భూ వివాదాలు నిత్యం తలెత్తుతున్నాయి. స్పందనకు వచ్చే అర్జీల్లో సింహభాగం ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. సర్వేకు సంబంధించి ఎఫ్‌లైన్‌ పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉండటానికి కారణం సరైన లెక్కలు తేలకపోవడమే. 

Updated Date - 2020-06-05T09:23:16+05:30 IST