సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-10-25T05:14:48+05:30 IST

కరోనా కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్‌ పస్టియర్‌ వార్షిక పరీక్షలను తిరిగి సోమవారం నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సర్వం సిద్ధం
ఏర్పాట్లను పూర్తిచేసిన జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు

నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

హాజరుకానున్న 9,930 మంది విద్యార్థులు

కొవిడ్‌ నిబంధనలతో పరీక్షల నిర్వహణ

ఆదిలాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్‌ పస్టియర్‌ వార్షిక పరీక్షలను తిరిగి సోమవారం నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగానే నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరించనున్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొవిడ్‌ కారణంగా నెలల తరబడి ప్రత్యక్ష తరగతులకు దూరం కావడంతో విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాక పోవడంతో విషయ పరిజ్ఞానం లేక పరీక్షల పై బెంగ పెట్టుకుంటున్నారు. 

జిల్లాలో 9,930 మంది విద్యార్థులు..

జిల్లా వ్యాప్తంగా 9,930 మంది విద్యార్థులు ఇంట ర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 8,891 మంది కాగా వొకేషనల్‌ విద్యార్థులు 1039 మంది ఉన్నారు. నిమిషం నిబంధన నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను 40 నిమిషాల ముందు నుంచే అనుమతిస్తారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను విధిస్తారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జిరాక్స్‌ సెంటర్లను తెరిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 47 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 47 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఏడుగురు కస్టోడియల్‌ అధికారులు, ముగ్గురు ప్లయింగ్‌ స్క్వాడ్‌ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు..

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 47 పరీక్ష కేంద్రాలలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ కొంత తగ్గుముఖం పట్టినా కొవిడ్‌ నిబంధనల ప్రకారమే పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల అనంతరమే విద్యార్థులను పరీక్ష సెంటర్‌లోకి అనుమతిస్తారు. గదికి 20 మంది చొప్పున విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. ప్రతీ విద్యార్థి తప్పని సరిగా మాస్కు ధరించి పరీక్ష సెంటర్‌లోకి రావాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా 70 శాతం సెలబస్‌తోనే ఈ సారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్‌లో ఏఎన్‌ఎంను నియమించారు.

40 నిమిషాల ముందే చేరుకోవాలి..

- రవీందర్‌కుమార్‌ (జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి)

నిమిషం నిబంఽధన అమలవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 40 నిమిషాల ముందే చేరుకోవాలి. ఆలస్యమైతే పరీక్షకు అనుమతి ఉండదు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది.


Updated Date - 2021-10-25T05:14:48+05:30 IST