‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T05:12:38+05:30 IST

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్దమైంది.

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
ఆమనగల్లులో హాల్‌టికెట్‌ నెంబర్లు వేస్తున్న సిబ్బంది

  • నేటి నుంచి వచ్చేనెల ఒకటో తేది వరకు ఎగ్జామ్స్‌ 
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ


రంగారెడ్డి అర్బన్‌, మే 22: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్దమైంది. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. స్కూళ్లలో ఫ్యాన్లు, లైట్లతో పాటు విద్యుత్‌ సమస్య లేకుండా చేసుకుంటున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరిగే పది పరీక్షకు 282 కేంద్రాల్లో 47,560 విద్యార్థులు హాజరు కానున్నారు. 


పటిష్ట బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాల తరలింపు

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన సమస్య ఉత్పన్నమైన దృష్ట్యా ఇకక్కడ అలాంటి అస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిలత్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. 31 పోలీస్టేషన్లలో భద్రపర్చిన పదో తరగతి ప్రశ్న పత్రాలను పటిష్ఠ బందోబస్తు మధ్య తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.  


ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌

పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుకుంటున్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, క్యాలుక్యులేటర్‌ వంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌లను ఇన్విజిలేటర్లు కానీ.. విద్యార్థులు కాని తీసుకువెళ్లడం నిషేధం. 


144 సెక్షన్‌ అమలు

పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి వేస్తారు. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపుకార్డు ధరించి ఉండాలి. 


ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బస్‌పాస్‌, లేదా పదో తరగతి హాల్‌ టికెట్‌ చూపించి బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే రూట్‌ మ్యాపింగ్‌ ప్రణాళికను తయారు చేసింది. 


విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాసే వాతావరణం కల్పించాం. తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడి చేయవద్దు. విద్యార్థులు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశాన్ని ఇన్విజిలేటర్లు కల్పించాలి. చూచిరాతలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. పరీక్ష కేంద్రం బాధ్యులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే అలాంటి వారిపై విద్యాచట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఏదైనా సమస్య ఉంటే సంప్రదించడం కోసం పరీక్ష కేంద్రాల వద్ద ఎంఈవోలు, సంబంధిత అధికారుల ఫోన్‌ నెంబర్లను ప్రదర్శిస్తున్నాం. పాఠశాలకు ఇప్పటికే విద్యార్థుల హాల్‌ టికెట్లను పంపాం. హాల్‌టికెట్లు పొందని విద్యార్థులు సంబంధిత బోర్డు వెబ్‌సైట్‌ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చు. 

- సుశీందర్‌రావు, జిల్లా విద్యాధికారి 


విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే 

సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు

జిల్లా కేంద్రం టోల్‌ ఫ్రీ నెంబర్‌ : 9666162092

జిల్లా విద్యాధికారి : 7995087604

జిల్లా పరీక్ష నిర్వహణాధికారి : 9440219992



Updated Date - 2022-05-23T05:12:38+05:30 IST