Abn logo
Aug 9 2020 @ 02:06AM

చేప పిల్లల పంపిణీకి సర్వం సిద్ధం

Kaakateeya

  • జిల్లాలో 1.22 కోట్ల లక్ష్యం
  • మిడ్‌ మానేరులోకి 28.50 లక్షల చేప పిల్లలు  
  • జిల్లాలో 402 చెరువుల గుర్తింపు 
  • రెండు మూడు రోజుల్లో చెరువుల్లోకి  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, కాళేశ్వరం జలాలు రావడంతో చెరువులు, రిజర్వాయర్‌లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి  చెరువులు, జలాశయాల్లోకి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను  వదులుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ సారి 402 చెరువులను గుర్తించారు. 1.22 కోట్ల చేపపిల్లల లక్ష్యంగా వంద శాతం సబ్సిడీతో 88 మత్స్య పారిశ్రామిక సంఘాలకు పంపిణీ చేయనున్నారు. 


రెండు రోజుల్లో చెరువుల్లోకి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 666 చెరువులు ఉన్నాయి. ఇందులో మత్స్య శాఖ 402 చెరువుల్లోకి చేపపిల్లలను వదలనుంది. మత్స్య శాఖ పరిధిలో 71 చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కౌలు ప్రకారం సహకార సంఘాలకు ఇవ్వనున్నారు.  310 గ్రామ పంచాయతీల చెరువులు, మిడ్‌ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ల్లో చేప పిల్లలను వదలనున్నారు. ఈ సారి 1.22 కోట్ల చేపపిల్లలను వదిలే లక్ష్యంగా పెట్టుకున్నారు. 35-40 ఎంఎం సైజు 68,88,780 పిల్లలు, 80-100 ఎంఎం సైజు 53,47,176 చేప పిల్లలను వదలనున్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోనే 28.50 లక్షలు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 10.50 లక్షలు పిల్లలను వదలనున్నారు. మిగతా చెరువుల్లో 68.88 లక్షల చేప పిల్లలతోపాటు నిత్యం నీటి సాంద్రత ఉండే 19 చెరువుల్లో 14.47 లక్షల చేపపిల్లలను వదలనున్నారు. 


జిల్లాలో 5,538 మంది మత్స్య సహకార సభ్యులు 

జిల్లాలో 90 సంఘాలు రిజిస్టరయ్యాయి. ఇందులో 88 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. రెండు మహిళా సహకార సంఘాలు, ఒకటి ప్రాథమిక మత్స్య మార్కెటింగ్‌ సొసైటీ ఉన్నాయి. వీటిల్లో 5,538 మంది సభ్యులు ఉన్నారు. మిడ్‌ మానేరులో చేపలు పట్టుకోవడానికి 2,722 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 116 మందికి లైసెన్స్‌లను జారీ చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏటా చేపపిల్లను వదులుతున్నారు. 2020-21 సంవత్సరానికి 1.22 కోట్లు చేపపిల్లలను లక్ష్యంగా పెట్టుకోగా 2016- 17లో 90 చెరువుల్లో 30.5 లక్షలు, 2017- 18 సంవత్సరంలో 66 చెరువుల్లో 20 లక్షలు, 2018- 19లో 95 చెరువుల్లో 57.48 లక్షలు, 2019- 20లో 1.09 కోట్లు చేపపిల్లలను వదిలారు. గతేడాది మిడ్‌ మానేరులో 17.63 లక్షల చేపపిల్లలను వదలగా ఈ సారి 28.50 లక్షల చేపపిల్లలను వదలనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement