Abn logo
Apr 15 2021 @ 23:47PM

జొన్నల కొనుగోలుకు సన్నాహాలు

జిల్లాలో 17 కొనుగోలు కేంద్రాలు

గ్రేడ్‌-1 రకం మద్దతు క్వింటా ధర రూ.2,620

దాణా రకం రూ.1,850

19వ తేది నుంచి కొనుగోళ్లకు శ్రీకారం

కడప, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు పండించిన జొన్నల కొనుగోలుకు ప్రభుత్వవ సన్నాహాలు చేస్తోంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా ఈ నెల 19వ తేది నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో జమ్మలమడుగు, పెద్దముడియం, ముద్దనూరు, రాజుపాలెం, మైలవరం, దువ్వూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో రబీ పంటగా జొన్న విస్తారంగా సాగు చేస్తున్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో నల్లరేగడి నేలల్లో 25 వేల హెక్టార్లలో జొన్న సాగుచేశారు. గత ఏడాది క్వింటా రూ.2,500 నుంచి రూ.3 వేలకుపైగా పలికింది. ఆ ఏడాది దిగుబడి కూడా ఎకరాకు 25 నుంచి 35 క్వింటాళ్లు వచ్చింది. ఈ ఏడాది అధిక వర్షాలకు దిగుబడి సగానికి పైగా పడిపోయింది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లకు మించి రాలేదని రాజుపాలెం మండలం టంగుటూరుకు చెందిన కౌలురైతు పసల మునెయ్య ఆంధ్రజ్యోతికి వివరించారు. పంట ఇల్లు చేరగానే ధరలు పతనమయ్యాయి.

ప్రైవేటు వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ.1,400 నుంచి రూ.1,800లకు మించి ఇవ్వడం లేదు. దళారులకు అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. మనిషి ఆహారంగా ఉపయోగించే మహేంద్ర, రాయచూరు రకానికి చెందిన జొన్నలు మద్దతు ధర రూ.2,620, పశువుల దాణా, కార్మాగారాలకు వాడే శ్రీనిధి మొదలైన హైబ్రీడ్‌ రకం జొన్నలు క్వింటా రూ.1,850 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులు పండించిన జొన్నలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ఆర్‌బీకే కేంద్రాల్లో ఈ-క్రాప్‌ నమోదు చేసి పేర్లు రిజిసే్ట్రషన చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజరు బి.నాగరాజు గురువారం ఆంధ్రజ్యోతికి వివరించారు. ఇప్పటికే జిల్లాలో 578 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
Advertisement