పోలీసు చేయూత....

ABN , First Publish Date - 2020-03-29T10:23:08+05:30 IST

పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలు, ఆర్థిక ఇబ్బందులతో భిక్షాటన చేస్తున్న భిక్షగాళ్లు

పోలీసు చేయూత....

వలస కూలీలు, భిక్షగాళ్లకు..

కడప, మైదుకూరులో ప్రత్యేక విడిది కేంద్రాలు, ఉచిత భోజనం

ప్రతి పట్టణంలో ఏర్పాటుకు సన్నాహాలు


కడప, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలు, ఆర్థిక ఇబ్బందులతో భిక్షాటన చేస్తున్న భిక్షగాళ్లు కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆకలి తీరక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి పోలీసు యంత్రాంగం చేయూతగా నిలిచింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచిత భోజనాలు, విడిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఆ కేంద్రాల్లో నుంచి భోజన, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు.


ఎస్పీ ప్రోత్సాహంతో కడప డీఎస్పీ సూర్యనారాయణ బిహార్‌ నుంచి వచ్చిన 84 మంది వలస కూలీలు, భిక్షగాళ్లకు ప్రత్యేక షెల్టరు ఏర్పాటు చేసి అక్కడే భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆర్తీ హోం సహకారంతో ఉచిత భోజనాలు అందిస్తున్నారు. పట్టణంలో ఎవరైనా అనాథలు ఉంటే అక్కడికి చేరవచ్చు. అలాగే మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ 35 మంది వలస కూలీలు, భిక్షగాళ్లను గుర్తించి వారికి విడిది ఏర్పాటు చేశారు.


లాక్‌డౌన్‌ వల్ల అభాగ్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసు యంత్రాంగం చేయూతగా నిలిచింది. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కోరుతోంది. ప్రతి పట్టణంలో వలస కూలీలు, భిక్షగాళ్లను గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ అన్బురాజన్‌ వివరించారు. కడప, మైదుకూరు డీఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు.


Updated Date - 2020-03-29T10:23:08+05:30 IST