అకాల వర్షం.... రైతుకు నష్టం

ABN , First Publish Date - 2021-05-13T04:47:22+05:30 IST

మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అకాల వర్షం.... రైతుకు నష్టం
ప్రొద్దుటూరు : తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు -

ప్రాద్దుటూరు రూరల్‌, మే 12: మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రొద్దుటూరు మండలంలో  1900 ఎకరాల్లో రైతులు కేసీ కెనాల్‌, బోర్ల కింద రబీ సీజన్‌లో వరి పంటను సాగుచేశారు. అందులో వెయ్యి ఎకరాలకుపైగా ప్రస్తుతం రైతు లు నూర్పిళ్లు చేశారు. అయితే కొందరు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడం, మరికొందరు గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నిలువ చేసుకున్నారు. మరికొంతమంది రైతుల ధాన్యం కలాల్లోనే ఉన్నాయి. కలాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో బుధవారం ఉదయం రైతులు తడిసిపోయిన ధాన్యాన్ని ఆరబోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వరికోత కోయని ప్రాంతాల్లో గాలీ వాన ధాటికి వరి పంట నేలవాలింది. నేలవాలిన వరి పంట వరికోత మిషన్‌ ద్వారా నూర్పిళ్లు చేయాలంటే కష్టమని, ఎకరాకు గంట సమయంలో నూర్పిళ్లు కావాల్సిన పైరుకు రెండు గంటల సమయం పడుతుందని, దీంతో కోత ఖర్చులు డబుల్‌ అవుతాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన పంటను కొనుగోలు చేయడంతోపాటు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.


మిరప రైతు లబోదిబో....


మైలవరం, మే 12 : మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షం మిరపరైతును నట్టేటముంచింది. వారం రోజుల క్రితం మిరప పంటను కోసి కాయలను పొలంలో ఆరబెట్టుకున్న రైతుకు అకాలవర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. అదే చేనిలో కుప్పగా పోసిన వేరుశనగ కాయలు సైతం నీట మునిగి ముద్దయిపోయాయి. మండలంలోని వద్దిరాల, ముర్రపంది, చిన్నకొమెర్ల, తొర్రివేముల తదితర పంచాయతీల్లో రైతులకు అకాలవర్షం అపారనష్టాన్ని మిగిల్చింది. మండలంలోని వద్దిరాల గ్రామానికి చెందిన మైల సూర్యుడు నాలుగున్నర ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. ఈ యేడాది మంచి దిగుబడి రావడంతో వారం రోజుల క్రితం కోసిన కోతలో 20 క్వింటాళ్ల మిరపకాయలు దిగుబడి రాగా పక్క పొలంలోనే ఆరబోశాడు. బుధవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పొలాల్లో నీరు పారడంతో తెల్లారే సరికి ఆరబోసిన మిరపకాయల కుప్పలు నీటిపై తేలియాడాయి. అలాగే మరికొందరి రైతులు సాగుచేసిన వేరుశనగ కాయలు తడిసిపోయాయి. మైల సూర్యుడి రైతుకు అకాల వర్షంతో దాదాపు 3 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. 



వరి రైతు విలవిల...

జమ్మలమడుగు రూరల్‌, మే 12: జమ్మలమడుగు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎండకారు రబీ సాగు సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కొంచెం ముందుగా సాగు చేసిన రైతులు వరి పంటను కోశారు. ఆ ధాన్యాన్ని సలివెందుల గ్రామం వద్ద నుంచి రోడ్డు పొడవునా రైతులు వరిధాన్యాన్ని ఆరబోశారు. మరికొందరు ఆలస్యంగా సాగు చేసిన వరి రైతులు నాలుగైదు రోజుల్లో పంటను కోయడానికి సిద్ధంగా ఉన్నారు.  ఉన్నట్లుండి మంగళవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆరబోసిన వరి రైతులు వరి ధాన్యం తడిసి నష్టపోయారు. ఉదయాన్నే ఆరబోసిన వరి ధాన్యాన్ని ఎండకు ఆరబోశారు.  కొందరు ఏకంగా మళ్లీ రాత్రి వర్షం కురుస్తుందేమోనని వరి ధాన్యం ట్రాక్టర్లకు నింపుకుని తీసుకెళ్లారు. తడిసిన ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేయరని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 


నేలవాలిన నువ్వు, వరి పంటలు


రాజుపాళెం, మే 12: ఆరుగాలం కష్టించే రైతన్నకు ఎటుచూసినా నష్టాలు తప్పడంలేదు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి పంట  తడిసి ముద్దయింది. దీంతోపాటు కొర్ర, నువ్వు పంటలు నేలవాలాయి.  మండల పరిధిలోని కుందూ నది ప్రాంతం వెంబడి టంగుటూరు, తొండలదిన్నె, వెలువలి, కొట్టాలు, పగిడాల గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 300 ఎకరాలు పైబడి వరి పంటను సాగు చేశారు. గత అయిదు రోజులుగా జోరుగా వరి పంట నూర్పిళ్లు జరుగుతున్నాయి. దీంతో పంట పొలాల్లోని ధాన్యా న్ని రోడ్లపైకి ఆరబెట్టుకునేందుకు వడ్లను తోలారు. మంగళవారం రాత్రి భారీ వర్షం పడటంతో ధాన్యమంతా తడిసిపోవడంతోపాటు చెల్లాచెదురుగా పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కో రైతుకు మూడు నుంచి పది బస్తాల వరకు నష్టం వాటిల్లింది. నష్టంతోపాటు వరి ధాన్యం పూర్తిగా తడవడంతో వడ్లు రంగు మారుతాయని, దీంతో మార్కెట్‌లో రేటు కూడా తక్కువ పలుకుతుందని రైతులు వాపోతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని మద్ధతు ధరతో కొనుగోలు చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయా గ్రామాల రైతులు పేర్కొన్నారు.




Updated Date - 2021-05-13T04:47:22+05:30 IST