Abn logo
Aug 8 2020 @ 00:49AM

సీఎం కేసీఆర్‌ పాలనలో బీసీలకు ప్రాధాన్యం

ఆత్మగౌరవంతో జీవిస్తున్న వెనుకబడిన వర్గాలు

40 కులసంఘాలకు 82 ఎకరాల స్థలం కేటాయింపు

రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి ‘గంగుల’


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 7: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో వెనుకబడిన కులాల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర బీసీసంక్షేమ, ఆహార పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో 40 కుల సంఘాలకు అంత్యంత ఖరీదైన 82ఎకరాల స్థలాన్ని ఆయా సంఘాల భవన నిర్మాణాలకు కేటాయించడంతోపాటు నిధులను కూడా మంజూరీ చేశారని తెలిపారు. స్థలం కేటాయించిన ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల కల్పన పనులను హెచ్‌ఎండీ చేపడుతుందని, ఆ పనులు పూర్తయిన వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి గంగుల వెల్లడించారు. ఈ విషయంలో కొంత మంది విషపూరిత ప్రచారాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు చెప్పారు. బీసీల్లోని సంచార జాతు లను గుర్తించి వారి అభ్యున్నతికి 100కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.


పేదలకు పెద్దన్న సీఎం కేసీఆర్‌..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని పేద ప్రజలకు పెద్దన్నగా వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని 184మంది లబ్దిదారులకు రూ.కోటి80లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందిన ప్రతిఒక్కరూ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మేయర్‌ వై.సునీల్‌రావు, పెద్దపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ పుట్టమధు, కార్పొరేటర్లు వి.రాజేందర్‌రావు, దిండిగాల మహేశ్‌, కంసాల శ్రీనివాస్‌, గందె మాధవి, వాల రమణారావు, జయశ్రీ, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


ప్రభుత్వం..పార్టీ రెండు కళ్లలాంటివి..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): రాష్ట్రానికి ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు కళ్ళలాంటివని, కన్నతల్లిలాంటి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతంచేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర బీసీసంక్షేమ, ఆహారపౌరసరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌  పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్యతో కలిసి త్వరలో ఏర్పాటు చేయనున్న కమిటీలపై చర్చించారు.


ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈనెల 14వరకు జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే జిల్లా పార్టీకి అనుబంధంగా మహిళా, యువత, విద్యార్థి, మైనార్టీ విభాగాల కమిటీలను కూడా నియమిస్తామని చెప్పారు. చింతకుంట గ్రామసమీపంలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement