మట్టి తవ్వకం.. ఇంతింత.. కాదయా!

ABN , First Publish Date - 2021-07-29T05:49:06+05:30 IST

ప్రత్తిపాడు నియోజకపరిధిలోని గుంటూరు రూరల్‌ మండలం అక్రమ మట్టి తవ్వకాలకు అడ్గాగా మారింది.

మట్టి తవ్వకం..   ఇంతింత..  కాదయా!
నాయుడుపేట వద్ద జరుగుతున్న మట్టి తవ్వకాలు

ఇన్‌కమ్‌ కోసం అడ్డగోలుగా మట్టి తవ్వకాలు

పట్టపగలే పరుగులు పెడుతున్న లారీలు

నోరు మెదపని మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు

నాయుడుపేట వద్ద దర్జాగా సాగుతున్న అక్రమ మైనింగ్‌


మట్టి తవ్వకాలతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. అధికారం అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కోట్లాది రూపాయల ఇన్‌కమ్‌ కోసం నాయుడుపేట వద్ద పెద్దగండే పెడుతున్నారు. ఇక్కడంతా మా దయే అన్నట్లు.. ఎవ్వరినీ అడుగు పెట్టనీయకుండా తమ కనుసన్నల్లో జాతీయ రహదారిపై మట్టి లారీలను వరుసగా పరుగులు పెట్టిస్తున్నారు.   

 

ప్రత్తిపాడు, జూలై 19: ప్రత్తిపాడు నియోజకపరిధిలోని గుంటూరు రూరల్‌ మండలం అక్రమ మట్టి తవ్వకాలకు అడ్గాగా  మారింది. ఇక్కడ జరిగే మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఉండవు.. నిబంధనలు పాటించరు... ఎంతవరకు మట్టి తీయడానికి అవకాశం ఉందో అంత లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరుగుతున్న మట్టి దోపిడీ కాదు... గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో నాయుడుపేట వద్ద పవర్‌ప్లాంట్‌ ఎదురుగా డంపింగ్‌ యార్డు సమీపంలో దర్జాగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల బాగోతం ఇది. ఇంత బాహాటంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు నోరు మెదపకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. రెండు పొక్లెయిన్లతో 40, 50 అడుగుల లోతుకు మించి తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు క్వారీల్లోకి చేరిన నీటికి అడ్డుకట్ట వేసి మరీ మట్టిని తవ్వుతున్నారు. 


ఎవరన్నా అడుగు పెడితే అంతే..

ఇక్కడ తవ్వితే మేమే తవ్వాలి.. ఎవరైనా పొరబాటున అడుగు పెడితే వారి పని గోవిందే అన్నట్టుగా ఉంది ఇక్కడి తీరు. ఇందుకు గతంలో జరిగిన సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఇటీవల పక్క నియోజకవర్గానికి చెందిన వారు మట్టి తవ్వకాలు చేస్తుంటే రాత్రికి రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి టిప్పర్లతో పాటు పొక్లయిన్ల తీసుకొచ్చారు. ఈ విషయంలో ఎవరు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర స్థాయికి ఈ పంచాయితీ వెళ్లినట్టు సమాచారం. సుమారు నెలపాటు లారీలతో పాటు పొక్లయిన్లు ప్రత్తిపాడులోనే ఉన్నాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టడానికైనా భయపడుతున్నారు. 


సమీపంలోనే జగనన్న ప్లాట్లు..

 ప్రస్తుతం జరిగే మట్టి తవ్వకాల సమీపంలోనే ఇటీవల జగనన్న కాలనీని ఏర్పాటు చేసి ప్లాట్లు కూడా పంపిణీ చేశారు. గృహ నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్వారీ గుంతల్లో పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్లాట్లకు కూతవేటు దూరంలో జరుగుతున్న క్వారీయింగ్‌ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. సాక్షాత్తు హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉండడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2021-07-29T05:49:06+05:30 IST