నితీశ్‌కు వ్యతిరేకంగా మొదటి పావు కదిపిన ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2020-02-21T17:22:17+05:30 IST

బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జేడీయూ బహిష్కృత నేత, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొట్టమొదటి పావు కదిపారు.

నితీశ్‌కు వ్యతిరేకంగా మొదటి పావు కదిపిన ప్రశాంత్ కిశోర్

పాట్నా : బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జేడీయూ బహిష్కృత నేత, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొట్టమొదటి పావు కదిపారు. బిహార్‌లోని వివిధ ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలతో పీకే భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధ్యక్షుడు జితిన్ రాం మాంఝీ, ఆర్‌ఎస్‌ఎల్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహాతో పీకే భేటీ అయ్యారు. అయితే ఈ రెండు పక్షాలు కూడా మహా గట్ బంధన్‌లో భాగస్వాములు. కాంగ్రెస్ కూడా భాగస్వామే. అయితే ఆర్జేడీని మాత్రం పీకే కలుసుకోలేదు.


అంతకు పూర్వం పీకే మాట్లాడుతూ... తాను రాజకీయ పార్టీని స్థాపించడం లేదని, అయితే బిహార్‌లో అద్భుతమైన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తున్న వారికి మాత్రం ఓ ఉమ్మడి వేదికను సృష్టించడానికి మాత్రం ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. అంతేకాకుండా గురువారం ‘బాత్ బిహార్ కీ’ అనే క్యాంపైన్‌ని కూడా పీకే ప్రారంభించారు. ఇందులో యువకులకు స్థానం కల్పించారు. ఇప్పటికే ఇందులో సభ్యత్వ నమోదు కూడా ప్రారంభమైంది.


దేశంలోనే బిహార్‌ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ వేదికను సృష్టించామని తెలిపారు. అయితే బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగానే ఓ యూత్ ఆర్మీని సృష్టించడంలో పీకే బిజీగా ఉన్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నేత ఒకరు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల కల్లా పీకే ఓ ప్రత్యామ్నాయ వేదికను సృష్టిస్తున్నారన్నది తేలిపోయిందని కొందరు భావిస్తున్నారు. ఓ ప్రత్యామ్నాయం సృష్టించడదానికి కొంత సమయం పడుతుందని పీకేకు తెలసని, అందుకే యువతను ముందుకు తీసుకొచ్చి బిహార్ రూపురేఖలను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని సదురు నేత వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-02-21T17:22:17+05:30 IST