జగన్ హామీ నెరవేరిస్తే మాకు కష్టాలుండవ్.. : వరద బాధితులు

ABN , First Publish Date - 2020-10-19T02:48:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజి వద్ద ఐదు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతోంది.

జగన్ హామీ నెరవేరిస్తే మాకు కష్టాలుండవ్.. : వరద బాధితులు
file photo

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజి వద్ద ఐదు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో వేల నివాసాలు ముంపునకు గురి కావడంతో నదీ పరివాహక ప్రజలు నిరాశ్రయిలయ్యారు. వీరిలో కొంతమందికి ఇందిరాగాంధీ స్టేడియంలో.. మరికొంత మందికి కట్ట పైనే గుడారాలతో పునరావాసం ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ సాయంత్రం ఉన్నట్టుండి పునరావాస శిబిరం ఖాళీ‌ చేయాలని పోలీసులు ఆదేశించారు. వరద తగ్గకుండా ఎలా వెళ్తాం..? ఎక్కడికి వెళ్తాం..? అని పోలీసులను బాధితులు ప్రశ్నించారు. ఇలా ఇరు‌వర్గాల మధ్య వాదనలు జరిగాయి.‌ మరో శిబిరం‌ చూపించాలని పోలీసులను కోరినా వారుగానీ, అధికారులు గానీ మాత్రం స్పందించలేదు.


జగన్ హమీ నెరవేరిస్తే..!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరద బాధితులు కంటతడి పెడుతున్నారు. ఈ నెల 21 పోలీసు అమరవీరుల దినోత్సవం కోసం ఖాళీ‌ చేయాలని‌ బెదిరిస్తున్నారని వారు చెబుతున్నారు. తమ ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయని‌ చెప్పినా వినకుండా‌ బెదిరిస్తున్నారని.. మరో చోట పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకుండా పిల్లలు, వృద్దులతో ఎక్కడికెళ్లాలని వారు అధికారులను బెదిరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం‌ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తే తమకు ఈ కష్టాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. మరి వైఎస్ జగన్ ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో..? ఎప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మిస్తారో వేచి చూడాల్సిందే.


మళ్లీ భారీ వర్షాలు!

ఇదిలా ఉంటే.. కృష్ణా నదికి వరద పెరుగుతోంది. ఈ క్రమంలో నదీపరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బెజవాడలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలో ఉన్నాయి. కృష్ణలంక, రాణీగారితోట, తారకరామనగర్‌లో వరదనీరు ఇంకా అలానే ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - 2020-10-19T02:48:15+05:30 IST