గ్రేటర్‌ Hyderabad‌లో రోజుకు రూ.3.5 కోట్లు నష్టం..

ABN , First Publish Date - 2022-01-02T19:05:29+05:30 IST

విద్యుత్‌ చౌర్యం అరికట్టడంలో ఆ శాఖ చేతులేత్తేసింది. చౌర్యం అరికట్టేందుకు ప్రత్యేక విజిజెన్స్‌...

గ్రేటర్‌ Hyderabad‌లో రోజుకు రూ.3.5 కోట్లు నష్టం..

  • లెక్కలోకి రాని 50 లక్షల యూనిట్లు 
  • సౌత్‌సర్కిల్‌ 3 డివిజన్లలో రికార్డు స్థాయిలో..
  • చౌర్యం కట్టడిలో విద్యుత్‌శాఖ వైఫల్యం

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ జోన్‌ను విద్యుత్‌ సరఫరా నష్టాలు ముంచేస్తున్నాయి. రోజుకు రూ. 3.5 కోట్ల మేరకు నష్టాలు వస్తుండటంతో డిస్కం కుదేలవుతోంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ గ్రేటర్‌జోన్‌ తొమ్మిది సర్కిళ్లలో రోజూ సాధారణ వినియోగం 56 మిలియన్‌ యూనిట్లు కాగా, 51 మిలియన్‌ యూనిట్లు మాత్రమే లెక్కలోకి వస్తోంది. రోజూ 50 లక్షల యూనిట్లు (5ఎంయూ) నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. టీఎస్ఎస్పీడీసీఎల్‌ ఇటీవల మొదటిసారి వెల్లడించిన త్రైమాసిక ఎనర్జీ ఆడిట్‌లో నష్టాల జాబితా వెల్లడైంది.


సౌత్‌ సర్కిల్‌లో భారీగా నష్టాలు.. 

గ్రేటర్‌ జోన్‌ పరిధిలో గతేడాది జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మూడు నెలల్లో చేపట్టిన ఎనర్జీ ఆడిట్‌ వివరాలను విద్యుత్‌శాఖ ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం గ్రేటర్‌ జోన్‌ తొమ్మిది సర్కిళ్లు 26 డివిజన్లలో 5,092 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తే 4,619 మిలియన్‌ యూనిట్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయి. 473 మిలియన్‌ యూనిట్లు లెక్కలోకి రాలేదు. ప్రధానంగా సౌత్‌ సర్కిల్‌లోని నాలుగు డివిజన్లలో 225 మిలియన్‌ యూనిట్లు లెక్కలోకి రాకుండా పోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.


ప్రత్యేక విభాగం ఉన్నా..

విద్యుత్‌ చౌర్యం అరికట్టడంలో ఆ శాఖ చేతులేత్తేసింది. చౌర్యం అరికట్టేందుకు ప్రత్యేక విజిజెన్స్‌ విభాగం ఉన్నా నామ మాత్రపు చర్యలతో కేసులు నమోదు చేస్తున్నారే తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. గ్రేటర్‌లో శివారు ప్రాంతాల్లో పలు పారిశ్రామిక కంపెనీలు, ఇండస్ర్టియల్‌ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ కొంతమంది విద్యుత్‌చౌర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇండస్ర్టియల్‌ ప్రాంతాల్లో కొంతమంది విద్యుత్‌సిబ్బంది పరిశ్రమల నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకుంటూ బిల్లింగ్‌ రాకుండా చూసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు.  


క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం..

సర్కిల్‌, డివిజన్‌, సబ్‌డివిజన్‌, సెక్షన్ల వారీగా విద్యుత్‌ కనెక్షన్లను విభజిస్తున్న విద్యుత్‌శాఖ యూనిట్లను అదే తరహాలో పూర్తిస్థాయిలో మ్యాపింగ్‌ చేయగలితే ఎక్కడ ఎక్కువ నష్టాలు వస్తున్నాయో గుర్తించి అరికట్టే అవకాశముంటుందని విద్యుత్‌రంగ నిపుణులు సూచిస్తున్నారు. చార్మినార్‌, ఆస్మాన్‌గఢ్‌, మెహిదీపట్నం, బేగంబజార్‌, సైఫాబాద్‌ డివిజన్లలో పెద్దఎత్తున విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నా క్షేత్రస్థాయి అధికారులు తమకేమి తెలియదనే తరహాలో వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-01-02T19:05:29+05:30 IST