కోతలతో.. వాత

ABN , First Publish Date - 2022-05-20T05:43:53+05:30 IST

జిల్లాలోని ఒక కాటన్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు ఒక్క నెలలో కోటి రూపాయల నష్టపోయింది.

కోతలతో.. వాత

పవర్‌ హాలిడేతో కుదేలైన రంగం

వేలాది పరిశ్రమలపై ప్రభావం

పడిపోయిన ఉత్పత్తి- తగ్గిన ఉపాధి 

వందల కోట్లు నష్టపోయిన కార్మికులు

లక్షల్లో పనిదినాలు కోల్పోయిన కార్మికులు

హాలిడే రద్దయినా వీడని భయం

 

గుంటూరు, మే 19(ఆంధ్రజ్యోతి):  జిల్లాలోని ఒక కాటన్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు ఒక్క నెలలో కోటి రూపాయల నష్టపోయింది. దీనికి కారణం పవర్‌ హాలిడే! రూ. 50 కోట్ల మూలధనంతో రెండు యూనిట్లు ఉన్న ఆ మిల్లులో పవర్‌ హాలిడే కారణంగా ఒక యూనిట్‌ను పూర్తిగా మూసేశారు. అయినప్పటికీ నిర్వహణ వ్యయం, పెరగిన కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు వెరసి రూ. 50 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఉత్పత్తి ఆగిపోయిన కారణంగా మరో 50 లక్షలు నష్టం వచ్చింది. 200 మంది కార్మికుల్లో సగం మందికి పనిలేకుండా పోయింది.

10 మంది స్నేహితులు కలిసి స్టీలు పళ్లాలు తయారు చేసే ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకున్నారు. కేవలం 20 లక్షల పెట్టుబడితో నడిచే ఈ చిన్న యూనిట్‌కు కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. పవర్‌ హాలిడే పుణ్యమా అంటూ వారంలో రెండు రోజులు మూసుకోవాల్సి వచ్చింది. దీంతో వారికి పని లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయి నష్టాల పాలవడంతో వారు ఆర్థికంగా చితికిపోయారు. కరోనా కష్టాల నుంచి కోలుకోక ముందే ప్రభుత్వ పవర్‌ హాలిడే పిడుగు వేయడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. - ఇది పవర్‌ హాలిడే కారణంగా జిల్లాలోని భారీ, సూక్ష్మ పరిశ్రమల పరిస్థితి.


కుదేలైన పరిశ్రమల రంగం

కరోనా, లాక్‌డౌన్‌తో దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పవర్‌ హాలిడే కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పవర్‌ హాలిడే పేరిట పరిశ్రమలకు భారీగా కరెంటు కోత విధించడంతో జిల్లాలోని పరిశ్రమల పరిస్థితి తలకిందులైపోయింది. ఒక్క నెలరోజుల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల నష్టాలు మూటగట్టుకున్నాయి. పరిశ్రామిక ప్రాధాన్యం ఉన్న జిల్లా కావడంతో ఈ ప్రభావం జిల్లా ఆర్థిక వ్యవస్థపైనా పడనుంది. ఇది ఇప్పుడు ఆందోళనకు దారితీస్తోంది. 


ఆహార పరిశ్రమలు మినహా అన్నీ బంద్‌

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 81 భారి పరిశ్రమలు, 15,938 సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 25 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తులు తయారవుతుంటాయి. ఇంత భారీ మొత్తంలో ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం ఈ ఏడాది కరెంట్‌ షాక్‌ ఇచ్చింది. విద్యుత్‌ కొరత ఉందన్న కారణంగా కరెంటు వినియోగంపై ప్రభుత్వం ఏప్రిల్‌ 8 నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చింది. రోజువారి ఉత్పత్తి చేసే పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని, వారంలో ఒకరోజు సాధారణ సెలవుతోపాటు అదనంగా ఒకరోజు పవర్‌ హాలిడే ఇవ్వాలని డిస్కమ్‌లకు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఏప్రిల్‌ 22 వరకే ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత దీన్ని పొడిగిస్తూ ఈనెల 18 వరకూ కొనసాగించారు. కరోనా కష్ట, నష్టాల నుంచి కోలుకుంటున్న పరిశ్రమలకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. పవర్‌ హాలిడేతో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా పరిశ్రమలన్నీ కుదేలైపోయాయి. అయితే డెయిరీలు, మిల్క్‌ చిల్లింగ్‌ ప్లాంట్లు, కోల్డ్‌ స్టోరేజీలు, ఇతర ఆహార పరిశ్రమలకు ప్రభుత్వం పవర్‌ హాలిడే నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇలాంటి పరిశ్రమలు జిల్లాలో 200 కంటే ఎక్కువ ఉండవు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా జిల్లాలోని 16000 పరిశ్రమలు కొన్ని వందల కోట్లు నష్టపోయాయి. ఇది మూడు జిల్లాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. 


 లక్షల పనిదినాలు రద్దు

జిల్లాలో ఉన్న సున్నం, సిమెంటు, పొగాకు, కారం, పసుపు, కాఫీ, స్పిన్నింగ్‌, జిన్నింగ్‌, టెక్స్‌టైల్‌ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు స్టీలు, ఆటోమొబైల్‌, బ్రిక్స్‌, క్రష్షింగ్‌, చేనేత పరిశ్రమలతోపాటు, ఇతర సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో లక్ష మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ, పవర్‌ హాలిడే కారణంగా వీరికి వారంలో రెండు రోజులు పూర్తిగా పనిలేకుండా పోయింది. రోజువారీ విద్యుత్‌ వినియోగంలో 50 శాతం వినియోగానికే అనుమతి ఇవ్వడంతో మిగిలిన రోజుల్లో సగం మందికే పని దొరికింది. ఇలా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది కార్మికులు, లక్షల పనిదినాలను కోల్పోయారు. ఫలితంగా వారి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. కరోనా కాలంలో అప్పులపాలై, తిరిగి గాడిన పడుతున్న సంసారాలు పవర్‌ హాలిడే షాక్‌తో తలకిందులైపోయాయి. 20 లక్షలలోపు పెట్టుబడితో నడిచే సూక్ష్మ పరిశ్రమలు మూసివేత బారిన పడ్డాయి. 


వీడని కోతల భయం.. 

ప్రభుత్వం గురువారం నుంచి  పవర్‌ హాలిడే ఉండదని ప్రకటించింది. అయినప్పటికీ యాజమాన్యాలు, కార్మికులను భయం మాత్రం వీడడం లేదు. రాష్ట్ర అవసరాలకు తగిన విద్యుత్‌ను సేకరించడానికి బదులుగా విద్యుత్‌ వినియోగం తగ్గిన కారణంగా పవర్‌ హాలిడేను తగ్గించడమే వీరి ఆందోళనకు కారణం. గడిచిన వారం రోజుల్లో అసని తుఫాను, వాతావరణంలో మార్పుల కారణంగా గృహ విద్యుత్‌ వినియోగం కొంచెం తగ్గింది. దీన్ని ఆధారం చేసుకుని పవర్‌ హాలిడేని రద్దు చేసిన ప్రభుత్వం, తిరిగి ఎండలు ముదిరి, గృహ విద్యుత్‌ వినియోగం పెరిగితే మళ్లీ పవర్‌ హాలిడేకి వెళుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. అవసరానికి తగిన విద్యుత్‌ను కొనుగోలు చేసి పవర్‌ హాలిడేని రద్దు చేస్తే మేలని వారంతా కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-05-20T05:43:53+05:30 IST