విద్యుత్‌ బకాయి.. రూ.423 కోట్లు

ABN , First Publish Date - 2022-07-30T05:42:29+05:30 IST

విద్యుత్‌ పం పిణీ డిస్కంలకు బకాయిలు గుదిబండలా మారాయి. నెలల తరబడి పేరుకు పోయిన విద్యుత్‌ బిల్లులు రూ.కోట్లకు చేరాయి.

విద్యుత్‌ బకాయి.. రూ.423 కోట్లు
గురజాల ఆర్డీవో కార్యాలయం విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తున్నఅధికారులు

నెలల తరబడి చెల్లించని అధికారులు

విద్యుత్‌ సంస్థకు గుదిబండలా వసూళ్లు

పేరుకుపోయిన ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు 

కార్యాలయాల కనెక్షన్లు తొలగిస్తున్న విద్యుత్‌ శాఖ

ఉన్నతాధికారుల హెచ్చరికలతో బకాయిల వసూళ్లకు స్పెషల్‌  డ్రైవ్‌


ప్రభుత్వ కార్యాలయాల కరెంట్‌ బిల్లులు కట్టడం లేదు.. నెలల తరబడి బకాయిలు పేరుకు పోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా, సీఆర్‌డీఏ సర్కిల్స్‌ పరిధి లో విద్యుత్‌ సంస్థకు రూ.423 కోట్లకుపైగానే బిల్లులు రావాల్సి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వీటిలో అత్యధికం ప్రభుత్వ కార్యాల యాలకు సంబంధిం చినవే. ఒక్కో కార్యాలయం నుంచి రూ.లక్షల్లో బిల్లులు రావాల్సి ఉంది. దీంతో వీటి వసూళ్లు విద్యుత్‌ సంస్థ అధికారుల కు తలనొప్పిగా మారింది. చివరకు నోటీసులు జారీ చేసి గడువు ఇచ్చి బిల్లులు కట్టకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తామన్నా ఆయా కార్యాలయాల అధికారులు స్పందిం చడంలేదు. తమకు నిధులు వస్తేనే కరెంట్‌ బిల్లులు కట్టగలమని లేదంటే చేసేది లేదని వారు తేల్చి చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల విద్యుత్‌ అధికా రులు పలు ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్‌ కనెక్ష న్లు కట్‌ చేయడంతో అటు సిబ్బంది.. ఇటు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  బకాయిల చెల్లింపుల గురించి ప్రశ్నిస్తే నిధులు రానిదే తాము ఏమీ చేయలేమని ఆయా శాఖల అధికారులు చెప్తున్నారు.   ఉన్నతాధికా రుల హెచ్చరికలతో  బకాయిల వసూళ్లకు స్పెషల్‌  డ్రైవ్‌ చేపట్టారు. 


 గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, వినుకొండటౌన్‌, జూలై 29: విద్యుత్‌ పం పిణీ డిస్కంలకు బకాయిలు గుదిబండలా మారాయి. నెలల తరబడి పేరుకు పోయిన విద్యుత్‌ బిల్లులు రూ.కోట్లకు చేరాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా, సీఆర్‌ డీఏ సర్కిల్స్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి రూ.423 కోట్లకు పైనే బకాయిలు పేరుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌ ప్రకారం ప్రభుత్వమైనా , ప్రైవేటు అయినా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిం చేందుకు అవకాశముంది. కానీ సాటి ప్రభుత్వ శాఖలు కావడంతో విద్యుత్‌ శాఖ కొంత సంయమనంగా పాటిస్తోంది. తొలుత ప్రభుత్వ శాఖల విషయంలో విద్యుత్‌ శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడం కూడా బిల్లులు కొండలా పేరుకుపోవ డానికి కారణంగా కనబడుతోంది. గుంటూరు సర్కిల్‌లో గుంటూరు-1, బాపట్ల, తెనాలి, మాచర్ల, నరసరావుపేట డివిజన్లు, సీఆర్‌డీఏ సర్కిల్‌ పరిధిలో అమరావతి, గుంటూరు-2 డివిజన్లు ఉన్నాయి. ఆయా సర్కిల్స్‌లో వివిధ శాఖల ప్రభుత్వ కార్యా లయాలు, వీధి లైట్లు, వాటర్‌ వర్క్స్‌, ఇక ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. గుంటూరు సర్కిల్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.183 కోట్లు, ప్రైవేటు సంస్థలవి రూ.157 కోట్లు ఉన్నాయి. సీఆర్‌డీఏ సర్కిల్‌లో ప్రభుత్వ కార్యాలయాలవి రూ.50 కోట్లు, ప్రైవేటు సంస్థలవి రూ.31 కోట్లు బకాయిలున్నాయి. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంబంధించిన బకాయిలు రూ.423 కోట్లు ఉన్నట్లు విద్యుత్‌ శాఖ గణాంకాలు తెలియజేస్తోన్నాయి.  బాపట్ల జిల్లా వ్యాప్తంగా సర్‌చార్జితో కలిపి రూ.54.76 కోట్లు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. అగ్రికల్చరల్‌, యానిమల్‌ హజ్బెండరీ, బీసీ వెల్ఫేర్‌, విద్య, సివిల్‌ సప్లయిస్‌ ఇలా దాదాపు 28 ప్రభుత్వ విభాగాల కు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలకు నిధుల కొరత ఉంటే మరి కొన్నింటికి నిధులు పుష్కలం గా ఉన్నప్పటికీ బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో బకాయిల వసూళ్లపై విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిం చారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిం చిన బకాయిల వసూళ్లపై కూడా విద్యుత్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నోటీసులు జారీ చేసి నిర్ణీత గడు వులోగా విద్యుత్‌ బిల్లులు చెల్లించని ప్రభుత్వ సర్వీసులను తొలగిస్తున్నారు.  

 బకాయిలు ఉన్నా కార్యాలయాలకు నోటీసులు జారీ చేసి మూడు రోజుల గడువు ఇస్తున్నారు. గడువులోగా విద్యుత్‌ బిల్లులు చెల్లించని కార్యాలయాల కనెక్షన్ల ను  

తొలగిస్తున్నారు. ప్రత్యక్ష చర్యలు దిగ డంతో మొండి బకాయిలు వసూలవుతున్న ట్లు సదరు అధికారులు తెలిపారు. నరసరా వుపేట మున్సిపాల్టీ రూ110.03 లక్షల బకాయికి రూ.40 లక్షలు చెల్లించింది. మిగిలిన రూ.70.03 లక్షల చెల్లించేం దుకు వారం రోజులు గడువు కోరింది.  గ్రామాల్లో తాగునీటి పథకాలకు సంబంఽధించి జలవన రుల శాఖ రూ.17.27 లక్షలు బకాయి ఉండ టంలో కొన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఇటీవల తొలగించారు. నరసరావుపేట పెదచెరువు లోని పంచాయతీరాజ్‌ శాఖ శివ అతిథి గృహం విద్యుత్‌ బకాయి రూ.16.09 లక్షల కు చేరింది. ఈ అతిథిగృహాన్ని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం, నివా సానికి కేటాయించారు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు ఎవరూ చెల్లిం చాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


కార్యాలయాలకు పవర్‌ కట్‌

వినుకొండ, ఈపూరు తహసీల్దారు కార్యాలయాల బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వినుకొండ కార్యాలయానికి సంబంధించి సుమారు రూ.17 లక్షల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. పలుమార్లు విద్యుత్‌ అధికారులు బకాయిలపై హెచ్చరించినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు. దీంతో మంగళవారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో కంప్యూటర్లు పనిచేయక అధికారులు అత్యవసర పనులను సెల్‌ వెలుతురులో చేయాల్సి వచ్చింది. అయితే ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కలెక్టర్‌ ఆదేశాలతో   శుక్రవారం విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌కు కూడా విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్‌ శాఖ ఏడీఈ కిరణ్‌ తెలిపారు. ఈపూరు తహసీల్దారు కార్యాలయం రూ.8 లక్షల 3 వేలు చెల్లించాల్సి ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్‌ శాఖ  ఏఈ రఫీ తెలిపారు. కరెంట్‌ కట్‌తో కార్యాలయంలో పనులన్నీ నిలిచిపోయాయి.


బకాయిలు చెల్లిస్తామని లేఖలు 

పిడుగురాళ్ల: బకాయిలు పేరుకుని పోవడంతో దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల తహసీల్దారు కార్యాలయాలు, గురజాల ఆర్డీవో, విద్యాశాఖ కార్యాలయాలకు, దాచేపల్లి మోడల్‌ స్కూల్‌, గురజాల, దాచేపల్లి ఆర్‌అండ్‌బీ బంగ్లా, పిడుగురాళ్ల ఐసీడీఎస్‌ కార్యాలయానికి అధికారులు ఇటీవల విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కొన్ని సచివాలయాలకు, వాటర్‌ స్కీమ్‌లకు కూడా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో నిధులు విడుదల కాగానే విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తామని అప్పటి దాకా విద్యుత్‌ను పునరుద్ధారించాలని కోరుతూ ఆయాశాఖల అధికారులు  విద్యుత్‌శాఖకు లేఖలు అందజేశారు. దీంతో తిరిగి విద్యుత్‌ను పునరుద్ధరించారు. మాచవరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.74.50 లక్షలు, గురజాలలో రూ.85.50 లక్షలు, దాచేపల్లిలో రూ.1.64కోట్లు పిడుగురాళ్ల పట్టణం, రూరల్‌లో రూ.4.50 కోట్లకుపైగా విద్యుత్‌బకాయిలు ఉన్నాయి. 

 

నోటీసులు జారీచేశాం

బకాయిలు చెల్లించాలని ఇప్పటకే ప్రైవేటుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశాం. బకాయిలు సకాలంలో చెల్లించాలని ఇప్పటికే ఆయా కార్యాలయాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. బిల్లులు చెల్లించకుంటే ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తాం.

- మురళీకృష్ణయాదవ్‌  గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ 


Updated Date - 2022-07-30T05:42:29+05:30 IST