‘పోతురాజుబాబు’ నిధులు పక్కదారి

ABN , First Publish Date - 2021-09-01T06:30:48+05:30 IST

పోతురాజుబాబు.. నిధులు పక్కదారి

‘పోతురాజుబాబు’ నిధులు పక్కదారి

జాతర సమయంలో వచ్చిన నిధులు స్వాహా?

రెండేళ్లుగా డిపాజిట్లు నిల్‌...అన్నీ విత్‌డ్రాలే!!

దేవదాయ శాఖ అధికారులకు భక్తుల సంఘం ఫిర్యాదు

డీసీ విచారణలో నోరు విప్పని ఈఓ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఏటా మహా శివరాత్రికి ఆ ఆలయం వద్ద భారీ జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు వస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. స్వామికి కానుకలు సమర్పిస్తారు. ఆ ఒక్కరోజే లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. దాన్ని గత రెండేళ్లుగా ఆలయ పర్యవేక్షకులు దిగమింగేస్తున్నారు. ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేయగా సమాధానం చెప్పాల్సిన ఆలయ అధికారి మౌనం వహించారు. ఇదంతా రావికమతం మండలం చీమలపాడులోని కల్యాణ పోతురాజుబాబు ఆలయంలో జరిగిన బాగోతం...


శివరాత్రి వస్తే జాతరే!!

పోతురాజుబాబు ఆలయంలో మహా శివరాత్రి రోజు జాతర నిర్వహిస్తారు. ఆ ముందురోజు, మరుసటిరోజు అక్కడ సందడిగా ఉంటుంది. పక్కనే వున్న కల్యాణపులోవ రిజర్వాయర్‌లో భక్తులు స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు దేవదాయ శాఖ చేస్తుంది. ఆలయ ఈఓ టెంట్లు వేయించి, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి మరుగు ఏర్పాటుచేస్తారు. అలాగే దర్శనాలకు క్యూలు పెడతారు. జాతర పర్యవేక్షణకు వచ్చే పోలీసు, రెవెన్యూ సిబ్బందికి భోజనాలు ఏర్పాటుచేస్తారు. ఆలయానికి విద్యుద్దీపాలు పెడతారు. వీటన్నింటికీ సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వ్యయం అవుతుంది. భక్తులు సమర్పించే కానుకల ద్వారా రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తుంది.


అందులో ప్రతి లక్ష రూపాయలకు రూ.20 వేలు చొప్పున కంట్రిబ్యూషన్‌ కింద దేవదాయ శాఖకు బ్యాంకులో జమ చేయాలి. మిగిలిన దాంట్లో ఖర్చులు తీసేసి, సిబ్బంది జీతభత్యాలకు కొంత మొత్తం వుంచుకొని మిగిలిన రూ.4 లక్షలు-రూ.6 లక్షల వరకు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి. ఏటా ఆ విధంగానే జరుగుతోంది. రెండున్నరేళ్ల క్రితం ఈ ఆలయానికి టీఎన్‌ శర్మ ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చాక రెండేళ్లుగా బ్యాంకులో ఎటువంటి డిపాజిట్లు చేయడం లేదు. ఆయన ఈఓగా బాధ్యతలు చేపట్టక ముందు 2019లో రూ.9 లక్షల ఆదాయం వస్తే, రూ.2 లక్షలు కంట్రిబ్యూషన్‌గా చెల్లించి, రూ.4 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. 2018లో రూ.8.5 లక్షలు ఆదా యం వస్తే రూ.1.8 లక్షలు కంట్రిబ్యూషన్‌ కట్టి, బ్యాంకులో రూ.4 లక్షలు డిపాజిట్‌ చేశారు.


ఆ తరువాత శర్మ వచ్చాక 2020లో రూ.11 లక్షలు, 2021లో రూ.15 లక్షలు ఆదాయం రాగా బ్యాంకులో ఎటువంటి డిపాజిట్లు చేయలేదని స్థానిక ఆలయ భక్తుల సంఘం దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. పైగా ఈ రెండేళ్లలో వివిధ ఖర్చుల కోసమంటూ సుమారుగా 20 చెక్కుల ద్వారా బ్యాంకులో సొమ్ము విత్‌డ్రా చేశారని వారు ఫిర్యాదుచేశారు. దీనిపై డీసీ పుష్పవర్దన్‌ ఇటీవల ఈఓల సమావేశం నిర్వహించి, శర్మను దీనిపై ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. దాంతో అధికారులు ఆలయ రికార్డులను పరిశీలించి, ఆ వివరాలు నమోదు చేశారు. 


అభివృద్ధి శూన్యం

ఈ ఆలయాన్ని 2001లో దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎమ్మెల్యే ధర్మశ్రీ టీటీడీ వారితో మాట్లాడి అక్కడ మరో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గత కొన్నేళ్లుగా సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న వంజంగి గంగరాజు పంచాయతీ నిధులతో ఆలయానికి రోడ్డు వేయించి, చావిడి నిర్మించారు. భక్తులు సమర్పించిన ఆదాయాన్ని తీసుకుపోవడం తప్పితే, దేవదాయ శాఖ ఏమీ చేయడం లేదని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పుడు బ్యాంకులో సొమ్ములు కూడా తినేయడం, దానికి కొందరు అధికారులు సహకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2021-09-01T06:30:48+05:30 IST