సామాజిక మాధ్యమంలో పోస్టు కలకలం

ABN , First Publish Date - 2022-06-26T06:09:40+05:30 IST

ఓ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు వివాదంగా మారి ఎస్‌ఐ బదిలీకి దారి తీసింది.

సామాజిక మాధ్యమంలో పోస్టు కలకలం
చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌

- చొప్పదండి ఎస్‌ఐపై బదిలీ వేటు

చొప్పదండి, జూన్‌ 25: ఓ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు వివాదంగా మారి ఎస్‌ఐ బదిలీకి దారి తీసింది. జాతీయస్థాయిలో రెండుసార్లు ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఎంపికై అందరి ప్రశంసలను అందుకున్న పోలీస్‌ ఠాణా వివాదాల్లో చిక్కుకుంది. వివరాల్లోకి  వెళితే... చొప్పదండి మండలం రుక్మాపూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు తొంటి పవన్‌ కుమార్‌ ఈ నెల 22న ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టాడు. గ్రామంలో ఇటీవల జరిగిన బీరప్ప ఉత్సవాలను రెండు వర్గాలు వేర్వేరుగా జరుపుకోగా ఎమ్మెల్యే సహా పలువురు ప్రజాప్రతినిధులు ఒక వర్గం నిర్వహించిన ఉత్సవాలకు హాజరయ్యారు. దీనిపై గ్రామశాఖ అధ్యక్షుడు పెట్టిన పోస్టింగ్‌ వివాదాస్పదం కాగా ఈ నెల 23న టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రాజేశ్‌ పవన్‌కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి కేసు పెట్టాడు.  ఎస్‌ఐ తనను తీవ్రంగా కొట్టాడని పవన్‌కుమార్‌ 24న సీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశాడు. తనను ఉదయం స్టేషన్‌కు తీసుకుపోయి కొట్టారని, ఫిర్యాదు సాయంత్రం తీసుకున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపించి ఎస్‌ఐపై చర్యలు  తీసుకుంటానని, విచారణ అధికారిగా రూరల్‌ ఏసీపీని నియమించినట్లు సీపీ ప్రకటించారు. ఈ అంశం శనివారం రాజకీయ రంగు పులుముకుంది. ఎస్‌ఔ రాజేశ్‌ను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. 

 మాజీ ఎమ్మెల్యే పరామర్శ...

మండలంలోని రుక్మాపూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు తొంటి పవన్‌ కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ శనివారం పరామర్శించారు. పవన్‌ను చితకబాదిన ఎస్‌ఐ రాజేశ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తప్పు చేస్తే కేసులు పెట్టాలని, థర్డ్‌ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారని ఆమె ప్రశ్నించారు. 

 చొప్పదండి ఎస్‌ఐ రాజేష్‌ కమిషనరేట్‌కు అటాచ్డ్‌

కరీంనగర్‌ క్రైం: చొప్పదండి ఎస్‌ఐ రాజేష్‌ కమిషనరేట్‌కు అటాచ్డ్‌ చేస్తూ పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ శనివారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. చొప్పదండి ఎస్‌ఐ రాజేష్‌ తనను అకారణంగా ఠాణాకు పిలిపించి హింసించారని, దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ చొప్పదండి మండలం రుక్మాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తొంటి పవన్‌కుమార్‌ శుక్రవారంి సీపీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయనకు తగిలిన గాయాలను  సీపీకి చూపించాడు. సామాజిక మాద్యమాల్లో అభ్యంతకరమైన పోస్ట్‌పై ఎస్‌ఐ ఠాణాకు పిలిపించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ టి కరుణాకర్‌రావును విచారణ జరిపి నివేదికను అందించాలని సీపీ ఆదేశించారు. విచారణను నిష్పక్షపాతంగా జరిపించేందుకు కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తున్నామని సీపీ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ నివేదిక అందిన తరువాత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. చొప్పదండి స్టేషన్‌ ఇన్‌చార్జిగా చొప్పదండి సీఐకి అదనపు బాద్యతలు అప్పగించారు. ఎవరైనా తప్పుచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, వారిని శారీరకంగా భాదించరాదని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని అన్నారు. అసభ్యకరమైన, విద్వేషపూరితంగా సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌లు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. చొప్పదండిలో సామాజికమాద్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినందుకు తొంటి పవన్‌కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-06-26T06:09:40+05:30 IST