పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-17T07:16:45+05:30 IST

కనిగిరిలో ఆదివారం 86 కరోనా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
తాళ్లూరులో ఇంటికి వెళ్లి జ్వరం పరీక్షిస్తున్న ఆరోగ్య సిబ్బంది

కనిగిరి, మే 16: కనిగిరిలో ఆదివారం 86 కరోనా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు. ఇప్పటికే మండల టాస్క్‌ఫోర్స్‌ టీం నిర్ణయంతో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించగా కొత్తగా 86 కేసులు నమోదవటం పట్ల ప్రజల్లో భయాందోళనలతో బెంబేలెత్తుతున్నారు. నగరంలో ఆదివారం కరోనా నలుగురు మృతి చెందారు. వారిలో ఒక ప్రముఖ కాంట్రాక్టర్‌ మలిశెట్టి వెంకటేశ్వర్లు, కాగా పామూరు బస్టాండ్‌లోని కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి ఒకరు. అదేవిధంగా ఎన్జీఓ కాలనీలోని ఒక కుటుంబానికి చెందిన తల్లి కుమారులు కరోనాతో మృతి చెందగా, ఒకరు మరణవార్త మరోకరికి తెలియక పోవటం బాఽధాకరం. ఇద్దరు ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం కనిగిరిలో తల్లి అంత్యక్రియలు చేయగా, ఆదివారం సాయంత్రంకు కుమారుడు గఫార్‌ మృతి చెందటం శోచనీయం. గఫార్‌ కనిగిరిలో ఓ కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా జిల్లా లోని తర్లుపాడు ప్రభుత్వ హైస్కూల్‌లో పనిచేసే పీఈటీ టీచర్‌ కూడా కరోనాతో మృతి చెందాడు. కనిగిరిలోని ప్రముఖ వైద్యులు ఇప్పటికే కరోనా బారిన పడి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారినట్టు సమాచారం. ఆయనను హైద్రాబాద్‌ తరలించేందుకు కుటుంభ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

సింగరాయకొండలో 49 పాజిటివ్‌లు 

సింగరాయకొండ : మండలంలో ఆదివారం కొత్తగా 49 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ పాజిటివ్‌లు పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. 

ముండ్లమూరులోనూ అదే పరిస్థితి

ముండ్లమూరు, మే 16: మండలంలోని ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిఽధిలో 11 మందికి, మారెళ్ల ఆరోగ్య కేంద్రం పరిఽధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు మనోహరరెడ్డి, డి.వనజారెడ్డి  ఆదివారం తెలిపారు. వీరిలో పెద ఉల్లగల్లులో ఏడుగురికి, చింతలపూడిలో 3, పసుపుగల్లులో 1, ఉమామహేశ్వర అగ్రహారంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

పీసీ పల్లిలో 268 యాక్టివ్‌ కేసులు

పీసీపల్లి, మే 16: మండలంలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ప్రస్తుతం 268 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తురకపల్లిలో అత్యధికంగా 70 మంది కరోనాతో బాధపడుతున్నారు. నేరేడుపల్లిలో 10, మురిగమ్మిలో 10, మూలేవారిపల్లిలో 11, చిరుకూరివారిపల్లిలో 6, చౌటగోగులపల్లిలో 13, బండపాలెంలో 10, కొత్తపల్లిలో 7 మంది వైరస్‌ బారిన పడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా కేసులు ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పకీ రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వైరస్‌ వ్యాప్తికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా మొదటి డోస్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

గ్రామాల్లో కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

తాళ్లూరు, మే 16 : రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని గ్రామాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇంటింటి ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ పాలపర్తి బ్రహ్మయ్య తెలిపారు. మండలంలోని నాగంబొట్లపాలెం, తురకపాలెం తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నదని చెప్పారు. ఈనెల 30 వరకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు  నిత్యం ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలన్నారు.

కనిగిరి, మే 16: కనిగిరిలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు జరిగిన లాక్‌డౌన్‌ పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. 6 గంటల నుండి లాక్‌డౌన్‌ అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి టీ దుకాణాలు అన్ని సెంటర్లలో తెరచి వ్యాపారం నిర్వహించారు. దీంతో టీ దుకాణాల వద్ద ఒక్కోచోట 25 మందకి పైగా జనాలు గుమికూడి అరుగులపై, బల్లలపై కూర్చొని బాతా కానీ కొడుతూ కాలయాపన చేశారు. ఇదే తంతు ఉదయం 7 గంటల వరకు జరిగింది. పట్టణంలో ఎంఎస్‌ఎం కళాశాల వద్ద కొంతమంది యువత క్రికెట్‌ ఆడుతూ, మద్యపానం చేస్తూ, గుమికూడారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఓ వైపు అధికారులు నిర్వహిస్తున్నా.. ప్రజల్లో కూడా మార్పు రావాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నెలాఖరు వరకూ ఇంటింటి సర్వే 

పామూరు, మే 16:  మండలంలో కరోనా కట్టడి కోసం గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలతో చేయిస్తున్న సర్వే ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ఎంపీడీవో ఎం.రంగసుబ్బరాయుడు తెలిపారు. మండలంలో నర్రమారెళ్ళ, కొండారెడ్డిపల్లి, అయ్యవారిపల్లి, బోడవాడ గ్రామాల్లో ఆదివారం సర్వే చేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-05-17T07:16:45+05:30 IST