జనసంద్రమైన సింహగిరి

ABN , First Publish Date - 2022-05-17T06:20:44+05:30 IST

వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సింహగిరి జనసంద్రంగా మారింది.

జనసంద్రమైన సింహగిరి
తొలిపావంచా వద్ద అప్పన్నకు పూజలు చేస్తున్న భక్తులు

వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామిని దర్శించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు

సింహాచలం, మే 16: వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సింహగిరి జనసంద్రంగా మారింది. ఏటా చైత్ర, వైశాఖ, జేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలలో సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం వుంటున్న మత్స్యకార కుటుంబాలకు చెందిన భక్తులు సింహగిరికి తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రే అనేకమంది మత్స్యకారులు సింహాచలం చేరుకున్నారు. సోమవారం ఉదయం ముందుగా కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు చేశారు. పుష్కరిణి ఒడ్డున, పరిసర తోటల్లో తమ బృందాలతో కలిసి కోలలు వెలిగించి భక్తిప్రపత్తులతో అప్పన్న స్వామిని కీర్తిస్తూ గంటల తరబడి భజనలు చేస్తూ గడిపారు. మత్స్యకార మహిళలు ఆరుబయట వండిన పదార్థాలను కోలలకు నివేదించి పూజలు చేశారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చిన కోడెదూడలను తొలిపావంచా వద్ద పూజలు చేశాక అప్పన్నకు మొక్కుబడులుగా సమర్పించారు. అనంతరం మెట్ల మార్గం గుండా సింహగిరికి చేరుకుని తలనీలాలు సమర్పించి గంగధార స్నానాలు ఆచరించి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన నలభై మంది భక్తుల బృందం తమ గ్రామంలో కొలిచే తోడపెద్దును ఘాట్‌రోడ్డులో సింహగిరికి తీసుకువెళ్లి పూజలు అనంతరం తమ ప్రాంతానికి వెనుదిరిగారు. కాగా వరాహ పుష్కరిణిలోని నీరు కలుషితమవ్వడంతో పలువురు భక్తులు అందులో స్నానాలు చేశాక సమీపంలోని బోరుల వద్ద కూడా స్నానాలు ఆచరించారు. 




Updated Date - 2022-05-17T06:20:44+05:30 IST