పోప్ ఫ్రాన్సిస్‌పై విమర్శల వెల్లువ

ABN , First Publish Date - 2022-01-06T23:11:11+05:30 IST

నేటి యువత పిల్లల్ని కనకుండా పెంపుడు జంతువులకు ప్రాధాన్యం

పోప్ ఫ్రాన్సిస్‌పై విమర్శల వెల్లువ

వాటికన్ : నేటి యువత పిల్లల్ని కనకుండా పెంపుడు జంతువులకు ప్రాధాన్యం ఇస్తూ ఓ రకమైన స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నారని పోప్ ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల్ని ఓ బాధ్యతగా కనకూడదని, కావాలనుకుంటేనే కనాలని విమర్శకులు వాదిస్తున్నారు. పెంపుడు జంతువులను పెంచుకోవడం స్వార్థం కాదని అంటున్నారు.


వాటికన్‌లో సాధారణ ప్రజానీకాన్ని ఉద్దేశించి బుధవారం పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. మాతృత్వం గురించి మాట్లాడుతూ, సమాజంలో కొన్నిసార్లు సంతానం స్థానాన్ని పెంపుడు జంతువులు ఆక్రమిస్తున్నాయన్నారు. నేడు మనం ఓ రకమైన స్వార్థాన్ని చూస్తున్నామన్నారు. కొందరు వ్యక్తులు పిల్లల్ని కనాలనుకోవడం లేదనే విషయాన్ని మనం గమనిస్తున్నామన్నారు. ఒక్కొక్కసారి ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని, కానీ కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారని, పిల్లల స్థానాన్ని పెంపుడు జంతువులు ఆక్రమిస్తున్నాయని చెప్పారు. ఈ మాటలు జనానికి నవ్వు తెప్పించవచ్చు కానీ ఇది వాస్తవమని అన్నారు. ఇలా చేయడం మాతృత్వాన్ని, పితృత్వాన్ని నిరాకరించడమేనని స్పష్టం చేశారు. ఇది మనల్ని క్షీణింపజేస్తుందని, మనలోని మానవత్వాన్ని పోగొడుతుందని తెలిపారు. 


జీవ సంబంధమైన కారణాల వల్ల పిల్లలు కలగనివారు దత్తత తీసుకోవడం గురించి పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు కావడానికి వెనుకాడకూడదని చెప్పారు. బిడ్డను కనడం రిస్క్‌తో కూడుకున్నదేనని, అయితే పిల్లలు లేకపోవడం మరింత రిస్క్ అని వివరించారు. 


పోప్ ఫ్రాన్సిస్ 2014లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సంతానానికి బదులుగా జంతువులను పెంచుకోవడం సాంస్కృతికపరమైన క్షీణత అని తెలిపారు. 


జంతువులను పెంచుకోవడం స్వార్థం కాదు : విమర్శకులు

పెంపుడు జంతువులుగలవారు స్వార్థపరులని వ్యాఖ్యానించడాన్ని చాలా మంది నెటిజన్లు తప్పుబట్టారు. తమ ‘‘నాలుగు కాళ్ళ పిల్లల’’ ఫొటోలను పోస్ట్ చేశారు. తమకు ఎంపిక చేసుకునే హక్కు ఉందని మరి కొందరు వాదించారు. ఓ కర్తవ్యంగా పిల్లల్ని కనకూడదని, దానివల్ల అలాంటి పిల్లల బాల్యం విచారకరంగా గడిచే అవకాశం ఉంటుందని వాదించారు. పిల్లల్ని కనడం ఓ ఛాయిస్ అని, అదొక బాధ్యత కాదని పేర్కొన్నారు. జననాల నియంత్రణ, గర్భస్రావ హక్కులను కేథలిక్‌లు వ్యతిరేకించడం వల్ల ఆత్మీయ కుటుంబాలు ఏర్పడబోవని పేర్కొన్నారు. జీసస్ ఎన్నడూ చెప్పని అంశాల్లో ఇదొకటన్నారు. 


పోప్ ఆసక్తికరంగా మాట్లాడుతున్నారని, తాను పిల్లల్ని కనకూడదని ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుందని లియో మాంటేగ్ అనే ట్విటరాటీ గుర్తు చేశారు. 


THEE Stephanie ఇచ్చిన ట్వీట్‌లో, మహిళల గర్భాశయం పట్ల అలాంటి కాముకత పోప్‌తోపాటు చాలా మందికి ఉందన్నారు. ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలన్నారు. అందరూ పిల్లలను కోరుకోరని చెప్పారు. ఇప్పటికే పుట్టిన, ప్రేమ, ఆశ్రయం, సంతోషకరమైన నివాస స్థానాలు అవసరమైన పిల్లలను సమాజం పట్టించుకోవడం లేదన్నారు. 


Emma Crocker ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పోప్ ఫ్రాన్సిస్ గారూ, చూడండి. నా కుటుంబం ఫొటోను చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మన సమాజానికి, పెంపుడు జంతువులకు సేవ చేయడానికి మా జీవితాలను అంకితం చేస్తున్న స్వార్థపూరిత నర్సులం మేం. నిజాయితీగా చెప్తున్నాను’’ అని తెలిపారు. 


Updated Date - 2022-01-06T23:11:11+05:30 IST