గండి పడితే అంతే!

ABN , First Publish Date - 2022-08-06T05:14:28+05:30 IST

జిల్లాలో భారీ సాగునీటి వనరు తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి, ఎడమ కాలువలకు గండ్లు పడినా స్పందించే వారే కరువయ్యారు. ప్రధానంగా కాంట్రాక్టర్ల జాడ కానరావడం లేదు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బందే అప్పులు చేసి గండ్లును పూడ్చే పనులు చేట్టాల్సి వస్తోంది.

గండి పడితే అంతే!
తోటపల్లి కుడికాలువ పరిధిలో గండి పడిన ప్రాంతంలో పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు (పైల్‌)

  తోటపల్లి పరిధిలో అధ్వానంగా కాలువలు

  వేధిస్తున్న నిధుల సమస్య  

 రైతులకు తప్పని ఇబ్బందులు

  అప్పులు చేసి బాధ్యతను నిర్వర్తిస్తున్న అఽధికారులు  

(గరుగుబిల్లి)

జిల్లాలో భారీ సాగునీటి వనరు తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి, ఎడమ కాలువలకు గండ్లు పడినా స్పందించే వారే కరువయ్యారు. ప్రధానంగా కాంట్రాక్టర్ల జాడ కానరావడం లేదు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బందే అప్పులు చేసి గండ్లును పూడ్చే పనులు చేట్టాల్సి వస్తోంది. వాస్తవంగా గతనెల 21న  సాగునీరును విడుదల చేశారు. అయితే  24న సుంకి సమీపంలో కుడి కాలువకు భారీ స్థాయిలో గండి పడింది. దీంతో సుమారు వారం రోజుల పాటు సాగునీరు సరఫరా కాలేదు. వాస్తవంగా కాలువల ఆధునికీకరణలో తీవ్ర జాప్యం కారణంగానే గండ్లుకు కారణమైంది. అయితే కాంట్రాక్టర్‌  నిర్వహించాల్సిన పనులను సంబంఽధిత అధికారులే చేపట్టాల్సి వచ్చింది. ప్రారంభంలోనే సుంకి నుంచి పనులు ప్రారంభించి ఉంటే గండి పడేది కాదు.  సరైన ప్రణాళిక లేక ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఖరీఫ్‌ సమీపంలో అనుకున్న సమయానికి సాగునీరు సరఫరా విడుదల కాకపోవడంతో కాలువల పరిధిలోని రైతులు తలలు పట్టుకున్నారు.  నిధులు సమస్య  వల్ల  సిబ్బంది అప్పులు చేసి గండ్లు పూడ్చే బాధ్యతను తలపై వేసుకున్నారు. సిబ్బందే పర్యవేక్షణ చేస్తూ రైతులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. 

ఎడమ కాలువకు సంబంధించి తోటపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస వరకు ఉన్న 31,200 ఎకరాలకు సుమారు 414 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కుడి కాలువకు సంబంధించి గరుగుబిల్లి మండలం నుంచి బలిజిపేట, వంగర మండలాల పరిధిలోని సుమారు 9 వేల ఎకరాలకు  సుమారు 100 క్యూసెక్కుల నీటిని అందించాల్సి ఉంది.   పాత రెగ్యులేటర్‌ పరిధిలో 64 వేల ఎకరాలకు పైబడి సాగునీరు సరఫరా అవుతుంది. గత నాలుగేళ్ల కిందట ఆధునికీకరణ పనులు ప్రారంభించినా పూర్తికాలేదు. ప్రస్తుతం రెండు కాలువల పరిధిలో అనేక  సమస్యలు   ఉన్నాయి. కాలువలు అత్యంత దయనీయంగా ఉండడంతో గండ్లుకు అధికంగా ఆస్కారం ఉంది. ఏ మాత్రం గండ్లు పడినా పూడ్చేందుకు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం అంతగా స్పందించకపోవడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

 ఆధునికీకరణ జరిగేదెప్పుటికో...

జిల్లా పరిధిలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం, పాలకొండ మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలానికి సాగునీరు అందించే ప్రధాన సాగునీటి వనరు అయిన తోటపల్లి ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.200 కోట్లతో తోటపల్లి పూర్వపు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నిధులు మంజూరయ్యాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అప్పట్లో 20 శాతం లోపు చేపట్టిన పనులను రద్దు చేసింది. ఆ తర్వాత చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం కుడి, ఎడమ కాలువల పరిధిలో 30 శాతం పనులే జరిగాయి. 70 శాతం పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

 చేపట్టిన పనులకే బాధ్యత

 తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలో ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రారంభించిన పనుల వరకే కాంట్రాక్టర్‌ బాధ్యత అని ఏఈ డి.వెంకటరమణ తెలిపారు. పనులు నిర్వహించిన ప్రాంతాల్లో లోపాలు ఉంటే వారు బాధ్యత వహిస్తారన్నారు. పనులు చేపట్టని ప్రాంతాల్లో నష్టం వాటిల్లితే వారేమీ చేయలేరన్నారు.  కుడి కాలువ పరిధిలో 5 కిలో మీటర్ల నుంచి 13.5 కిలో మీటరు వరకు , ఎడమ కాలువ పరిధిఓ 12.8 కిలో మీటరు నుంచి 21 కిలో మీటరు వరకు లైనింగ్‌ పనులు, వీరఘట్టం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని చెప్పారు. మిగిలిన పనులు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. ఆధునికీకరణకు సుమారు రూ. 195 కోట్లు  మంజూరయ్యాయని,  2008లో  పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.  రెండు కాలువల పరిదిలో సుమారు 270 వరకు స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉందన్నారు. అదేవిధంగా 100 వరకు డిస్ట్రిబ్యూషన్‌ బ్రాంచ్‌ కాలువలు ఉన్నాయన్నారు.  పనులు నిర్వహించని ప్రాంతాల్లో కాలువలకు నష్టం వాటిల్లితే శాఖపరంగా చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు.  రెండు కాలువల పరిధిలో గండ్లుకు ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. 

  


Updated Date - 2022-08-06T05:14:28+05:30 IST